స్వచ్ఛంగా, అందంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక
- పిచ్చిమొక్కలు, వ్యర్థాల తొలగింపునకు చర్యలు
- చెరువులో నీటిని ఖాళీ చేయించిన అధికారులు
- శుద్ధి నీటితో నింపి రోప్‌వే నిర్మాణానికి యోచన
జనగామ, నవంబర్ 18 (విజయక్రాంతి): ఒకనాడు ప్రజల దాహార్తిని, రైతులకు పంటల సాగు అవసరాలను తీర్చిన భద్రాకాళి చెరువుకు పూర్వవైభవం తెచ్చేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది. భద్రకాళి గుట్టల నడుమ నీటితో అందంగా కనువిందు చేసే ఈ చెరువుకు మరిన్ని మెరుగులు దిద్దేందుకు కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది.
గతంలో మంచినీటితో కళకళలాడిన భద్రకాళి చెరువు కొన్నేళ్లుగా మురుగునీరు, గుర్రపుడెక్క, చెత్తచెదారంతో కంపు కడుతోంది. కళ తప్పిన ఈ చెరువుకు పునరుజ్జీవం పోసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకోవడంతో అధికారులు చెరువు సుందరీకరణ పనులను వేగవంతం చేశారు.
ఈ నెల 5న హైదరాబాద్‌లో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి భద్రకాళి చెరువు ప్రక్షాళనపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. దీంతో అధికారులు చెరువును శుద్ధి చేసేందుకు ఇప్పటికే అందులోని నీటిని ఖాళీ చేయించారు.
వాణిజ్య సముదాయాలు, గృహాల నుంచి వచ్చిన వ్యర్థాలు చెరువులో పేరుకుపోవడంతో పూర్తిగా శుద్ధి చేసేందుకు అధికారులు పూనుకున్నారు. వ్యర్థాలు, గుర్రపు డెక్కను తొలగించి మంచినీటితో చెరువును నింపడమే కాకుండా కట్టను మరింత బందోబస్తుగా మార్చే పనులు చేపడుతున్నారు.
380 ఎకరాల విస్తీర్ణంలో
వరంగల్, హనుమకొండ నగరాల మధ్య 380 ఎకరాల విస్తీర్ణంలో భద్రకాళి చెరువు ఉంది. చెరువు పక్కనే చారిత్రక భద్రకాళి అమ్మవారి ఆలయం ఉండటంతో ఆ పేరే చెరువుకు వచ్చింది. 10వ శతాబ్దంలో కాకతీయ రాజులు ఈ చెరువును కట్టించారనే ప్రచారం ఉంది. 1984 నుంచి 1994 వరకు పదేళ్ల పాటు ఈ చెరువు తాగునీటి వనరుగా ఉపయోగపడింది.
వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల ప్రజల దాహార్తిని తీర్చిన ఘనచరిత్ర ఈ చెరువుకు ఉంది. 1994 నుంచి 2000 సంవత్సరం వరకు ఆరేళ్ల పాటు రైతులకు సాగునీటి చెరువుగానూ దోహదపడింది. ఆ తరువాత చెత్తాచెదారం పేరుకుపోతుండడంతో భద్రకాళి చెరువు నీటి తాగు, సాగు నీటి అవసరాలకు దూరంగా పెట్టారు.
కేబుల్ బ్రిడ్జి, రోప్ వే, బోటింగ్..
భద్రకాళి చెరువు సుందరీకరణలో భాగంగా రోప్ వే ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే హృదయ్ పథకంలో భాగంగా సుమారు రూ.80 కోట్లతో హనుమకొండలోని పద్మాక్షిగుట్ట, హంటర్‌రోడ్, వరంగల్ పోతనగర్ వరకు భద్రకాళి బండ్‌ను అభివృద్ధి చేశారు. ప్రస్తుతం చెరువు సుందరీకరణలో భాగంగా కేబుల్ బ్రిడ్జితో పాటు రోప్ వే నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బోటింగ్ కూడా ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.