20-04-2025 12:00:00 AM
సంప్రదాయ రూపమైన చీరను ఇండో వెస్ట్రన్ కాంబినేషన్‌లో చకచకా కట్టుకోవచ్చు. ఫ్యాషన్ వేదికలపైనా స్టులిష్‌గా వెలిగిపోవాలంటే.. ఈ స్టయిల్ చీరలు ఉత్తమమని డిజైనర్లు చెబుతున్నారు. కొత్త తరానికి చీర మీద మోజు తగ్గలేదు. జీన్సులూ స్కర్టులూ వేసుకుంటున్నారు కాబట్టి చీరను మర్చిపోయారని అస్సలు అనుకోలేం. సందర్భానికి తగ్గట్టు ఆ డ్రెస్‌లో రెడీ అయిపోవడం ఇష్టం. అందుకే పెళ్లిళ్లు.. పండుగల వేళ అచ్చ తెలుగు చీరకట్టులో మెరిసిపోతుంటారు..
* జీన్స్ వేసుకున్నంత ఈజీగా చీర కట్టుకోవచ్చు తెలుసా? ఏదైనా చిటికెలో అయిపోవాలి అనుకునే ఈ తరం అమ్మాయిలు తాము ప్యాంటు షర్టు వేసుకునేంత సమయంలోనే చీరలో సిద్ధమైపోవాలి అని కోరుకుంటున్నారు. వారికి జిప్ అండ్ గో శారీలు అందుబాటులోకి వచ్చాయి.
* పేరుకు తగ్గట్టే జిప్ అండ్ గో శారీ అంటే జస్ట్ జిప్ పెడితే సిద్ధమైపోయే చీరే. మడత విప్పి చూస్తే ఇది గౌనులా కనిపిస్తుంది. పైన ఉన్న బ్లౌజ్, కింద చీర కలిపి కుట్టేసి ఉంటాయన్న మాట. కుచ్చిళ్లు కూడా రెడీగానే ఉంటాయి. ఈ గౌనును తొడుక్కుని ఛాతీ దగ్గర ఇచ్చిన జిప్ పెట్టుకోవాలి. తర్వాత నడుం దగ్గర ఉన్న బటన్‌ని కూడా పెట్టేస్తే కుచ్చులు ఎదురుగా వచ్చేస్తాయి. ఇక వాటికి అనుబంధంగా ఉండే కొంగును తిప్పి భుజం మీదుగా వేసుకుంటే చీరకట్టు సిద్ధమైనట్టే.
* సిల్క్, కాటన్, జార్జెట్, షమ్మర్.. ఇలా సాధారణ చీరల్లో ఎన్నుకున్నట్లే వీటిలోనూ నచ్చిన రకాన్ని ఎంచుకోవచ్చు. చేతులు ఉన్నవే కాదు స్లీవ్‌లెస్ తరహాలోనూ ఈ చీరలు వస్తున్నాయి. జరీ అంచు చీరలూ, ఎంబ్రాయిడరీ బ్లౌజులతోనూ ఇవి తయారవుతున్నాయి. ఇంతకుమునుపు వచ్చే రెడీ టు వేర్ చీరల్లో నడుం దగ్గర హుక్ పెట్టి చీరను చుట్టి, జాకెట్ విడిగా వేసుకోవాలి. దానికి భిన్నంగా చీరా జాకెట్ రెండూ కలిపి ఉండి, జిప్ పెడితే సిద్ధమైపోవడం ఈ రకం ప్రత్యేకత.
* కాటన్ పాప్లిన్ క్లాత్ వేడి వాతావరణానికి అనువైనదిగా పేరొందింది. మస్లిన్, వాయిల్, సీర్ సకర్.. వంటివి ఈ కాలం తేలికగా అనిపించే మెటీరియల్. సాధారణంగా కాటన్స్‌లో వైట్, లైట్ షేడ్స్ మెటీరియల్ లభిస్తుంది. డల్‌గా ఉండే కలర్ ఫ్యాబ్రిక్ అంటూ పక్కన పెట్టేసే రోజులు కావివి. ఫ్లోరల్ మోటిఫ్స్, ప్యాచ్‌వర్క్, టై అండ్ డై తో ఆకట్టుకునే చీరలు అందుబాటులో ఉన్నాయి.