27-04-2025 12:24:09 AM
ఈ నెల 30న సారథి పోర్టల్ ప్రారంభం
తిరుమలగిరిలో పైలట్ ప్రాజెక్టు
ప్రారంభించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): వాహనదారులకు మెరుగైన ఆర్టీఏ సేవలను అందించేందుకు కేంద్ర రహదారులు, రవాణా మంత్రిత్వ శాఖ తీసుకువచ్చిన వాహన్ సారథి ఆన్‌లైన్ పోర్టల్ ఎట్టకేలకు తెలంగాణలోనూ ప్రారంభం కానుంది. ఇందు కు గతేడాదే రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినా ఎన్‌ఐసీ పోర్టల్, తెలంగాణ ఆర్టీఏ పోర్టల్ అనుసంధానంలో సమస్యలు రావడంతో వాయిదా పడింది. తాజాగా ఈ నెల 30న ఈ సేవలను తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. తిరుమలగిరిలో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రమంతా అమలు చేస్తారు. వాహన్ సారథి ద్వారా ఇంట్లో కూర్చొనే లెర్నింగ్ లైసెన్స్ నుంచి వాహనం రిజిస్ట్రేషన్ వరకు మొత్తం 18 రకాల సేవలను ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశం ఉంది. వాహన్ సారథి సేవలు తెలంగాణ మినహా దేశంలోని 21 రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి.