17-05-2024 01:42:51 AM
న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్లు ఆచంట శరత్ కమల్, మనికా బాత్రాలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో భారత పురుషుల జట్టును శరత్ కమల్ నడిపించనుండగా.. మహిళల జట్టకు మనికా నేతృత్వం వహించనుంది. గురువారం టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (టీటీఎఫ్‌ఐ) ఒలింపిక్స్‌కు వెళ్లే బృందాన్ని ప్రకటించింది. ఒలింపిక్ నార్మ్స్ ప్రకారం ఆరుగురితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. పురుషుల జట్టులో శరత్ కమల్, హర్మీత్ దేశాయ్, మానవ్ టక్కర్‌లు.. మహిళల బృందంలో మనికా, తెలుగు తేజం శ్రీజ ఆకుల, అర్చన కామత్‌లను ఎంపిక చేసింది. శరత్ కమల్, హర్మీత్ దేశాయ్‌లు సింగిల్స్ ఆడనున్నారు. మహిళల సింగిల్స్ విభాగంలో మనికా, శ్రీజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ప్రత్యామ్నాయ ప్లేయర్లుగా జి. సతియాన్, ఐహికా ముఖర్జీలను ఎంపిక చేసింది. తాజా ప్రపంచ ర్యాంకింగ్స్ ఆధారంగానే వీరిని ఎంపిక చేసినట్లు టీటీఎఫ్‌ఐ పేర్కొంది. ఇక వెటరన్ శరత్ కమల్‌కు ఇది వరుసగా ఐదో ఒలింపిక్స్ కావడం విశేషం. 2004 నుంచి ప్రతి ఒలింపిక్స్‌లో శరత్ కమల్ బరిలోకి దిగాడు.