calender_icon.png 26 December, 2024 | 11:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యతోపాటు సంస్కృతిని భవిష్యత్ తరాలకు అందిస్తున్న సరస్వతి శిశు మందిరాలు

27-10-2024 06:26:35 PM

హిందువులకు ఆదివారం సెలవు దినం కాదు 

మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు 

ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి 

గజ్వేల్ (విజయక్రాంతి): విద్యతో పాటు సాంస్కృతిని  భవిష్యత్ తరాలకు తెలియజేయడంలో సరస్వతీ శిశు మందిరాలు ఎంతో కృషి చేస్తున్నాయని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ సరస్వతి శిశుమందిర్ లో కంప్యూటర్ ల్యాబ్, అదనపు తరగతి గదులను ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్త, సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నరేష్ బాబుతో కలిసి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

విలువలతో కూడిన విద్యను అందిస్తూ జాతి వికాసంలో తనదైన ముద్ర వేసుకుంటున్న సరస్వతి శిశు మందిరాలు సమాజంలో విద్యా యజ్ఞం లక్ష్యంగా, విద్యార్థుల అభ్యున్నతి, వికాసం, ప్రకాశంతో ముందుకు దూసుకెళ్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తమదైన శైలిలో ప్రత్యేక శిక్షణ, నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్న సరస్వతి శిశు మందిరాలు భిన్నమైన పాత్ర పోషిస్తూ విద్యార్థులను జాతికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

మిగతా పాఠశాలలకు భిన్నంగా అడుగులు వేస్తున్న ఈ పాఠశాలలు జాతీయ భావాన్ని పెంపొందిస్తూ తీర్చిదిద్దుతుండగా, ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నత లక్ష్యంతో చేపడుతున్న కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా గజ్వేల్ సరస్వతి శిశుమందిర్ అభివృద్ధికి కృషి చేస్తున్న డాక్టర్ నరేష్ బాబును ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిష్ కాలంలో వారు ప్రార్థనలు చేసుకోవడానికి ఆదివారం సెలవు దినంగా ప్రకటించారని, ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు చేసుకుంటారని, అన్ని రోజులు హిందువులకు ప్రత్యేకమైనవేనని ఆదివారం సెలవు దినం కాదని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు.

ఆదివారం ఎంతో శక్తివంతమైనదని మద్య, మాంసాలు, విందు వినోదాలకు వినియోగించకుండా పవిత్రంగా ఉండాలన్నారు. హిందువులకు సెలవు దినంగా మరో రోజును ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్ సి రాజమౌళి, నిర్వాహకులు డాక్టర్ పద్మజ్యోతి, డాక్టర్ మీలా శ్రీధర్, దొంతి నరేష్ తదితరులు పాల్గొన్నారు.