calender_icon.png 24 April, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సరస్వతీ నది పుష్కరాల పనులు వెంటనే పూర్తి చేయాలి

23-04-2025 08:12:35 PM

మే 10 వరకు డెడ్లైన్ విధించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్..

మహాదేవపూర్ (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంటున్న సరస్వతి నది పుష్కరాల పనులను వేగం పెంచి వెంటనే పూర్తి చేయాలని డెడ్లైన్ విధించిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, దక్షిణ కాశీగా పేరుపొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధి త్రివేణి సంగమమైన గోదావరినది, ప్రాణహిత నది, అంతర్వాహినిగా ప్రవహిస్తున్న సరస్వతీ నది పుష్కరాలను మే 15వ తేదీ నుండి 26వ తేదీ వరకు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 35 కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టింది.

ఈ పనుల పురోగతిని సమీక్షించుటకు ముఖ్య కార్యదర్శి బుధవారం సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ అలేఖ్య పుంజాల, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, కలిసి పరిశీలించారు. ఇతర అధికారులతో కలసి విఐపి ఘాట్, సరస్వతి మాత విగ్రహం ఏర్పాటు, 100 గదుల సత్రం పనులు పరిశీలించారు. అనంతరం ఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో శాఖల వారిగా చేపడుతున్న పనుల ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా పనులు పూర్తి చేయుటకై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సెక్రటరీ మాట్లాడుతూ.. రానున్న 10 రోజులు చాలా ముఖ్యమని  ప్రతి రోజు పనులలో ప్రగతి రావాలని అన్నారు. ప్రతి రోజు పనుల ప్రగతి, జరుగుతున్న పనులు వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు.

సరస్వతి విగ్రహం ఏర్పాటు మే మొదటి వారం వరకు పూర్తి చేయాలని దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. సమయం సమీపిస్తున్నదని పనుల్లో వేగం పెంచాలని, రేయింబవళ్లు పనులు జరిగితే తప్ప పనులు పూర్తి కావని, ఆశించిన స్థాయిలో వేగంగా పనులు జరగడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మే మొదటి వారం వరకు ప్రతి పౌర్ణమికి హారతి నిర్వహించడం జరుగుతుందని హారతి ప్లాట్ ఫారం పూర్తి చేయాలని తెలిపారు. విఐపి ఘాట్, సరస్వతి విగ్రహం, 100 గదుల సత్రం పనులు, పూర్తి చేయాలన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు తదితర పనులు పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక పర్యవేక్షణ అధికారులుగా నియమించి నిరంతరం పనులను పర్యవేక్షణ చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

మే 10వ తేదీ వరకు అన్ని పనులు పూర్తి కావాలని, ఇంజినీరింగ్ అధికారులు పనులు పూర్తి చేయుటకు టైం షెడ్యూల్ ప్రకారం పూర్తి చేయాలని ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న కార్యక్రమమని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని అన్నారు. విఐపి ఘాట్ వద్ద శాశ్వత మరుగుదొడ్లు, షవర్స్, భక్తులు బట్టలు మార్చుకునే గదులు 12వ తేది వరకు ఫుల్ షేప్ లో పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. భక్తులు నది వరకు వెళ్ళడానికి అనువుగా అప్రోచ్ రోడ్డు నిర్మించాలని, వేసవి దృష్ట్యా నదిలోకి భక్తులు వెళ్ళడానికి  అనువుగా కన్వేయర్ మాట్ ఏర్పాటు చేయుటలో అవగాహన లేకుండా ఎందుకు చెప్తున్నారని పీఆర్ ఈఈపై  ఆగ్రహం వ్యక్తంచేశారు. 

విఐపి ఘాట్ వద్ద అదనంగా తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టాలని ఆర్ డబ్ల్యూ ఎస్ ఈఈకి సూచించారు. సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్ తరలించడానికి 4 వాహనాలు సిద్ధంగా ఉంచాలని,  గోతిలో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వేసి పూడ్చాలని సూచించారు.  విఐపి ఘాట్ వద్ద లైటింగ్ పనులు 10వ తేదీ వరకు పూర్తి చేయాలని అన్నారు. విఐపి ఘాట్ వద్ద 100 కెవి సబ్ స్టేషన్ ఏర్పాటుతో పాటు 125 కెవి జనరేటర్ సిద్ధంగా ఉంచాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విఐపి ఘాట్ వద్ద సూచన చేసిన ప్రకారం మొక్కలు నాటాలని మే 10 వరకు పూర్తి చేయాలని దేవస్థానం అధికారులను ఆదేశించారు. ఘాట్ పైన చలువ పందిళ్లు వేయాలని సూచించారు. ఏదేని సమస్య ఉంటే తెలియచేయాలని, వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. 

సమస్యలు ఉంటే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటారని సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే, కాటారం సబ్ కలెక్టర్ మయంక సింగ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయశాఖ ఆర్ జె సి రామకృష్ణారావు, విద్యుత్ శాఖ ఎస్సీ మల్చూర్ నాయక్, ఇరిగేషన్ ఎస్సీ సత్యనారాయణ, డిపిఓ నారాయణరావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్, దేవాదాయ శాఖ ఈఈ కనకదుర్గ ప్రసాద్, పిఆర్ ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్డబ్ల్యూ  ఈఈ నిర్మల, ఇరిగేషన్ ఈ తిరుపతిరావు, ధార్మిక సలహాదారు గోవిందరాజు, దేవస్థానం ఈవో మహేష్, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.