calender_icon.png 30 November, 2024 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యల్లో సరస్వతీ నిలయాలు

30-11-2024 03:08:06 AM

సెస్ బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యం

లైబ్రరీల నిర్వహణకు తప్పని తిప్పలు

వేధిస్తున్న సిబ్బంది కొరత

మెదక్, నవంబర్ 29 (విజయక్రాంతి): స్వరాష్ట్ర సాధనలో భాగంగా తొలిదశ పోరాటంలో గ్రంథాలయోద్యమానిది కీలకపాత్ర. అప్పట్లో ఉద్యమకారులు ఊరూరా గ్రంథాలయాలు నెలకొల్పి తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం రగిలించారు. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన విజ్ఞాన భాండాగారాలు స్వరాష్ట్రంలో ప్రస్తుతం నిర్వహణ లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. సిబ్బంది కొరతతో పాటు పూర్తిస్థాయిలో పుస్తకాలు లేక ఉనికిని కోల్పోతున్నాయి. వాస్తవానికి గ్రంథాలయాలు స్థానిక సంస్థల నుంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. సెస్ రూపం లో గ్రంథాలయాలకు విధిగా చెల్లించాల్సి ఉంటుంది. వీటితోనే నిర్వహణ సాధ్యపడుతుంది. అయితే కొన్నేళ్లుగా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల నుంచి రావా ల్సిన సెస్ బకాయి లు అందక లైబ్రరీల నిర్వహణ ఇబ్బందికరంగా మారుతోంది. 

అందని సెస్..

సమాజాభివృద్ధిలో ఎంతో కీలకంగా వ్యవహరించే పుస్తకాల ప్రాధాన్యతను గుర్తించిన గత ప్రభుత్వాలు పౌరులు చెల్లించిన పన్నులో లైబ్రెరీల అభివృద్ధి కోసం సెస్ చెల్లించాలనే నిబంధనలు పెట్టాయి. స్థానిక సంస్థలకు అందే ఆస్తి పన్నులో ప్రతీ రూపాయిలో 8 పైసలు సెస్ రూపంలో అందించాల్సి ఉం టుంది. దీనిని స్థానిక సంస్థలు ఎప్పటికప్పుడు చెల్లిస్తే లైబ్రరీలు ఆటంకం లేకుండా మనుగడ సాగిస్తాయి. అయితే ప్రభుత్వాల నిర్లక్ష్యం, అధికారుల నిర్లిప్తత వెరసి గ్రంథాలయాలకు శాపంగా మారుతుంది. సెస్ సంబంధిత బకాయిలు చెల్లించడానికి పలు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు విముఖత ప్రదర్శిస్తుండటంతో సరస్వతీ నిలయాలు సమాజంలో మొక్కుబడిగా కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. 

గుదిబండగా బకాయిలు

మెదక్ జిల్లా వ్యాప్తంగా 14 గ్రంథాలయాలు ఉన్నాయి. మెదక్ పట్టణంలో జిల్లా కేంద్ర గ్రంథాలయం ఉండగా జిల్లాలోని 21 మండలాల్లో 15 గ్రంథాలయాలు కొనసాగుతున్నాయి. వీటి నిర్వహణకు అవసరమైన సెస్ బకాయిలు రూ.లక్షల్లో పెండింగ్‌లో ఉం డటం గమనార్హం. జిల్లాలోని నాలుగు ము న్సిపాలిటీల నుంచి రూ.60 లక్షలకు పైగా బకాయిలు రావాల్సి ఉండగా జిల్లాలోని గ్రామ పంచాయతీల నుంచి రూ.30లక్షలకు పైగా బకాయిలు అందాల్సి ఉంది. ఎప్పటికప్పుడు మున్సిపాలిటీ, జీపీ అధికారుల దృష్టికి బకాయిల చెల్లింపు విషయాన్ని తీసుకువెళ్తున్నా ఏమాత్రం ప్రయో జనం లేకుండా పోతుందనే అసహనం గ్రంథాలయ అధికారుల నుంచి వ్యక్తమవుతోంది. 

అంతా ఇన్‌చార్జిలే...

జిల్లా గ్రంథాలయంతో పాటు జిల్లాలోని   మిగతా గ్రంథాలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వంశీ కృష్ణ సైతం ఇన్‌చార్జిగా పనిచేస్తున్నారు. జిల్లాలో16 మంది లైబ్రేరియన్లు ఉండాల్సి ఉండగా నలుగురు రెగ్యులర్ లైబ్రేరియన్లు, మరో నలుగురు ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సైతం ఇన్‌చార్జి లైబ్రేరియన్ విధులు నిర్వర్తిస్తున్నారు. 

డీసీబీ వివరాలు ఇవ్వడం లేదు

గ్రంథాలయ నిర్వహణ ముఖ్యంగా సెస్ పైనే ఆధారపడి ఉం టుంది. వేతనాలు మినహా మిగిలిన నిర్వహణ అంతా సెస్ ఆదాయం నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీల కంటే మున్సిపాలిటీల నుంచి వసూలు విషయం లో ఇబ్బందులు ఉంటున్నాయి. అలాగే సంబంధిత అధికారులు డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్(డీసీబీ) వివరాలు కూడా సరిగా ఇవ్వడం లేదు. పూర్తిస్థాయిలో తెలియపరిస్తే సెస్ బకాయిల విషయంలో స్పష్టత వస్తుంది. 

- నరేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ ఇన్‌చార్జి లైబ్రేరియన్