13-04-2025 12:01:56 AM
హీరో ప్రియదర్శి, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ కాంబోలో రూపుదిద్దుకున్న సినిమా ‘సారంగపాణి జాతకం‘. రూప కొడువాయూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో నరేశ్ వీకే, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల, ‘వెన్నెల’ కిశోర్, ‘వైవా’ హర్ష, రూపలక్ష్మి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల మరో వారం వెనక్కి వెళ్లింది. మేకర్స్ ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఈ విషయాన్ని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ శనివారం అధికారికంగా ప్రకటించారు.
‘ఈ సినిమా మా శ్రీదేవి మూవీస్ పేరు ప్రఖ్యాతులు నిలబెడుతుంది. ఫస్ట్ కాపీతో సహా సినిమా రెడీ అయ్యింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. నిజానికి 18న విడుదల చేద్దామనుకున్నాం. అయితే బయ్యర్ల సూచన మేరకు, మరిన్ని మంచి థియేటర్ల సౌలభ్యత కోసం 25న వస్తున్నాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి డీవోపీ: పీజీ విందా, సంగీతం: వివేక్‌సాగర్; పాటలు: రామజోగయ్యశాస్త్రి, స్టంట్స్: వెంకట్ వెంకటేశ్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేశ్.