15-02-2025 07:09:57 PM
దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడు....
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి
ఘనంగా సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి ఉత్సవాలు...
శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి
వనపర్తి,(విజయక్రాంతి): బంజారాల ఆరాధ్య దైవం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్(Sant Shri Sevalal Maharaj) చూపిన సన్మార్గాలు ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి(Wanaparthy MLA Tudi Megha Reddy) అన్నారు. సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 286 వ జయంతి ఉత్సవాలను శనివారం జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ(District Tribal Development Department) ఆధ్వర్యంలో నాగవరం గ్రామ శివారులోని సేవా లాల్ భవన్ లో సాంప్రదాయ బద్ధంగా ఘనంగా నిర్వహించారు.
జిల్లాలోని నలుమూలల ఉన్న తాండాల నుండి గిరిజనులు హాజరు కాగా లంబాడి మహిళలు తమ సాంప్రదాయ దుస్తులతో వేడుకలకు హాజరయ్యారు. ముందుగా సేవాలాల్ మహారాజ్, మేరమ యాడి దేవతకు మహాబోగ్ (హోమం) కార్యక్రమంలో పాల్గొన్న శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి లంబాడి పూజారులు రాజ్ పవార్, బిక్ష్యా నాయక్ తో కలిసి సాంప్రదాయ బద్దంగా హోమంలో నెయ్యి, కడావ్ ప్రసాదం వేసి నైవేద్యం సమర్పించారు. జిల్లాలోని సమస్త ప్రజలు ఆయురారోగ్యాలు, ధన ధాన్యాలతో వర్ధిల్లె విధంగా ఆశీర్వదించాలని ప్రార్థించారు.
అనంతరం జరిగిన కార్యక్రమంలో శాసన సభ్యులు మాట్లాడుతూ... దేవాలాల్ అందరికీ ఆదర్షప్రాయుడని, జీవ హింస చేయరాదని, అబద్ధం మాట్లాడవద్దు, దొంగతనాలు చేయవద్దు, మాంసాహారం చేయవద్దని బోధించారని గుర్తు చేశారు. సేవాలాల్ 286వ జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, ఇందుకు రాష్ట్రంలో రూ. 3.00 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. వనపర్తి నియోజకవర్గానికి రూ. 2.68 లక్షలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తన నియోజకవర్గంలో సేవా లాల్ దేవాలయాన్ని నిర్మించేందుకు అదేవిధంగా ఇప్పుడు ఉన్న సేవా లాల్ భవన్ అన్ని వసతులతో పూర్తి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడు: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి. చిన్నా రెడ్డి
దేవతను మెప్పించి చనిపోయిన తన ఎద్దులను, గుర్రాన్ని బతికించుకొని తాను మెరామ యాడికి సేవకుడు అయిన సేవాలాల్ చాలా గొప్ప పుణ్యాత్ముడని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నా రెడ్డి కొనియాడారు. దౌర్జన్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వారితో పోరాటం చేసిన యోధుడని అన్నారు. దొంగతనాలు చేయొద్దు, మాంసాహారం తినొద్దు అని బోధించారని గుర్తు చేశారు. గిరిజనులు కష్టపడే తత్వం గలవారని బి.సి లో ఉన్న బంజారాలను 1956 లో అప్పటి భారత ప్రధాని ఇందిరా గాంధీ ఎస్టీ జాబితాలో చేర్చారని, తద్వారా వారికి ఉద్యోగాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ పొందుతున్నారని అన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధించవచ్చని అందువల్ల ప్రతి బంజారాలు చదువుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నత చదువులు పొందాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గిరిజనులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వనపర్తి జిల్లాకు ఎస్టీ గురుకుల పాఠశాల తీసుకురావడంలో కృషి చేశానని గుర్తు చేశారు. అంతకు ముందు గిరిజనుల్లో శంకర్ నాయక్, జాత్రు నాయక్, వాల్యా నాయక్ సైతం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ పి. సీతారాం నాయక్, గిరిజన అభివృద్ధి అధికారి బీీరం సుబ్బా రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ , మాజీ ఎంపిపి కిచ్చా రెడ్డి, గిరిజన సేవా సంఘం అధ్యక్షుడు చంద్రు నాయక్, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు అర్జున్ నాయక్, మాజీ జడ్పీటిసి హనుమంతు నాయక్, వి. రాధా కృష్ణ, సూర్య నాయక్, కృష్ణా నాయక్, గిరిజన ఉద్యోగులు, గిరిజన మహిళలు, విద్యార్థులు, యువత తదితరులు పాల్గొన్నారు.