19-02-2025 07:56:17 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఏర్పాటులో ఎంతోమంది గిరిజన బిడ్డల త్యాగం ఉందని, వారి పోరాటాన్ని, త్యాగాన్ని గుర్తించకుండా గత బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో అన్యాయం జరిగిందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్(Former MP Madhu Yashki Goud) పేర్కొన్నారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ 286వ జయంతి వేడుకలను(Shri Sant Sevalal Maharaj 286th Jayanthi Celebrations) బుధవారం హస్తినాపురంలోని కాటం పార్వతమ్మ పార్కు(Khatam Parvathamma Park)లో నిర్వహించారు. మధుయాష్కీ గౌడ్ తో పాటు మాజీ ఎంపీ రవీందర్ నాయక్, సీనియర్ ఐఏఎస్ అధికారిణి బి.భారతి నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మధు యాష్కీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గిరిజనుల పక్షమేనన్నారు. ఇందిరా గాంధీ హాయంలో గిరిజనులకు రిజర్వేషన్స్ కల్పించి వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించిన ఘనత కాంగ్రెస్ ది అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా బలరాం నాయక్ లాంటి బంజారా నాయకులకు అవకాశం కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. రవీందర్ నాయక్ ఎంపీగా తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేశారని, తన రాజీనామాతో తెలంగాణ ఆవశ్యకతను చాటి చెప్పారని వెల్లడించారు. గిరిజనుల పోడు భూములకు పట్టాలు ఇచ్చే విషయం కాంగ్రెస్ పార్టీ సానుకున్న నిర్ణయం తీసుకుందన్నారు. కానీ గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఎన్నాడు బంజారాలను పట్టించుకోలేదని, గిరిజన తండాలను గ్రామపంచాయతీలు చేస్తామని పంగనామాలు పెట్టారని, పేద, గిరిజన పిల్లలు చదివే వేలాది ప్రభుత్వ పాఠశాలను మూసేశారని విమర్శించారు. అంతేగాకుండా మాజీ సీఎం కేసీఆర్ తన పాలనలో పోడు భూములను, అసైన్డ్ భూములను పేదల నుంచి లాక్కున్నాడని ఆరోపించారు. గిరిజనలు తమ బిడ్డలను అమ్ముకునే దుస్థితికి కేసీఆర్ పాలన కొనసాగిందని దుయ్యాబట్టారు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం మాత్రమే బంజారా గిరిజనులకు న్యాయం చేస్తుందన్నారు. గిరిజనుల భూముల క్రయవిక్రయాలకు అనుమతి ఇచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. సంత్ సేవా లాల్ మహారాజ్ బోధనలను ప్రజలలోకి తీసుకెళ్తామన్నారు. యువత మద్యం బారిన పడకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ ఎంపీ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. తాను తెలంగాణ కోసం పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేసిన సమయంలో భావోద్వేగంతో మధుయాష్కీ కన్నీరు పెట్టుకున్నారని గుర్తు చేశారు. సీనియర్ ఐఏఎస్ అధికారిని భారతి నాయక్, కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రచార కమిటీ కో కన్వీనర్ వజీర్ ప్రకాష్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ ఎల్బీనగర్ అధ్యక్షుడు రమేష్ నాయక్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్ రెడ్డి, గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాశం అశోక్ గౌడ్, జయంతి ఉత్సవాల నిర్వాహకులు దంజిలాల్, వాసు రామ్ నాయక్, జానకిరామ్, పాండు నాయక్ తదితర నాయకులు పాల్గొన్నారు.