19-02-2025 10:50:51 PM
రాజస్థాన్‌లోని రెండు స్కూళ్లలో మార్పు..
దుమారం రేపిన మంత్రి వ్యాఖ్యలు..
జైపూర్: రాజస్థాన్‌లోని రెండు పాఠశాలల్లో ఉర్దూ స్థానంలో సంస్కృతాన్ని మూడో లాంగ్వేజ్‌గా ఎంపిక చేయాలని రాష్ట్ర విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జైపూర్‌లోని మహాత్మాగాంధీ ప్రభుత్వ పాఠశాల, బికనీర్‌లోని సీనియర్ సెకండరీ స్కూల్‌లో వెంటనే ఉర్దూను తొలగించి దాని స్థానంలో సంస్కృతంను చేర్చాలంటూ రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. అయితే ఉర్దూ టీచర్లపై రాష్ట్ర మంత్రి జవహర్‌సింగ్ బేదమ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసింది. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో ఉర్దూ టీచర్లుగా పనిచేస్తున్నారని.. అంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం సంస్కృతం టీచర్లను తొలగించి వారి స్థానంలో ఉర్దూ టీచర్లకు అవకాశమిచ్చారంటూ ఆరోపణలు చేశారు.
ఈ ఆరోపణలను ఖండించిన రాజస్థాన్ ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆశీష్ మోదీ స్పందిస్తూ.. ‘విద్యార్థుల ఆసక్తి మేరకు నిర్ణయం తీసుకున్నాం. బికనీర్‌లోని నపాసర్ పాఠశాలలో ఒక్క విద్యార్థి తప్ప మిగతా అందరు ఉర్దూను చదవడానికి ఇష్టపడడం లేదు. అందుకే మూడో లాంగ్వేజ్‌గా ఉర్దూను డిస్‌కంటిన్యూ చేశాం’ అని చెప్పుకొచ్చారు.