calender_icon.png 24 September, 2024 | 6:05 AM

తిరుమలలో సంప్రోక్షణ

24-09-2024 03:14:54 AM

లడ్డూపై ఇక ఆందోళనలొద్దు

టీటీడీ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు

ఏఆర్ డెయిరీకి కేంద్రం నోటీసులు

బ్లాక్ లిస్టులో పెట్టాం: ఈవో 

తిరుపతి, సెప్టెంబర్ 23:  తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన దోషాలకు ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం చేసినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. ఆలయంలో శాంతి హోమంతో పాటు పంచగవ్వయ ప్రోక్షణ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ అనంతరం టీటీడీ ఈవో, ఆలయ అర్చకులు మీడియాతో మాట్లాడారు. తిరుమలలో అన్ని విభాగాల్లో సంప్రో క్షణ కార్యక్రమాలు చేసినట్లు ప్రధాన అర్చకు లు వేణుగోపాల దీక్షితులు తెలిపారు.

దోషం కలిగిందన్న భావన భక్తుల్లో లేకుండా ప్రసాద తయారీ కేంద్రాల్లోనూ ప్రోక్షణ చేస్తున్నామన్నారు. చివరిగా చేసే పూర్ణాహుతి హోమంతో అన్ని దోషాలు తొలగిపోతాయని, భక్తులు ఎవరూ ఆందోళన చెందవద్దని స్పష్టం చేశారు. లడ్డూ ప్రసాద విషయంలో ఇకపై ఎలాంటి అనుమానాలు వద్దని సూచించారు. పవిత్రోత్సవాలకు ముందే దోషం తొలగిపోయిందని, మార్చిన నెయ్యితోనే ప్రసాదాలు తయారు చేశామని చెప్పారు. తెలిసీ తెలియక జరిగిన దోషాలు శాంతిహోమం, సంప్రోక్షణ కార్యక్రమాలతో తొలగిపోతాయని వేణుగోపాల దీక్షితులు అన్నారు. 

ఏఆర్ డెయిరీకి కేంద్రం నోటీసులు

టీటీడీ లడ్డూ తయారీలో వాడే నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డెయిరీకి కేంద్రం షోకాజ్ నోటీసులు పంపింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఈ నోటీసులు పంపింది. తిరుపతి లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో పామాయిల్, చేప, బీఫ్, పంది నూనెలు వంటివి ఉపయోగించినట్లు ఎన్‌డీడీబీ కాల్ఫ్ ప్రయోగశాల నివేదికను అనుసరించి ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తం నాలుగు కంపెనీలు సరఫరా చేసిన నెయ్యి నమూనాలను సేకరించిన కేంద్రం..

నాణ్యతా పరీక్షలో ఏఆర్ కంపెనీ పంపిన నెయ్యి ఫెయిల్ అయినట్లు వెల్లడించింది. దీంతో సదరు కంపెనీకి నోటీసులు పంపినట్లు తెలిపింది. కాగా, తమపై వస్తోన్న కల్తీ ఆరోపణలను ఏఆర్ డెయిరీ ఖండించింది. ఆలయానికి రోజూ 10 టన్నుల నెయ్యి అవసరమని, అందులో 0.1 శాతం కూడా తాము సరఫరా చేయలేదని ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు, కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఏర్ డెయిరీని బ్లాక్ లిస్టులో పెట్టామని, దానిపై చట్టపరమైన చర్యలు ప్రారంభించామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు.    

తప్పు చేస్తే సర్వనాశమనమవుతా: భూమన

వెంకటేశ్వరుని ప్రసాదంలో ఎలాంటి తప్పిదాలు జరగలేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు తిరుమల ఆలయం ఎదుట భూమన ప్రమాణం చేశారు. సీఎం చంద్రబాబునాయుడు చెప్పినట్లు తమ హయాంలో ఎలాంటి కల్తీ తిరుమలలో జరగలేదని చెప్పారు. అత్యంత పవిత్రమైన ప్రసాదాలు, లడ్డూ విషయంలో కలుషిత రాజకీయాలు చేసేవారు దారుణంగా ప్రవర్తిస్తున్నారు.

నేను ఈ విషయంలో తప్పు చేసి ఉంటే నేను, నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం అని పేర్కొన్నారు. శ్రీవారి ఆలయం ఎదుట ఆంజనేయస్వామిని దర్శించుకుని అఖిలాండ కర్పూర హారతి వెలిగించి భూమన ఈ మేరకు ప్రమాణం చేశారు. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు ఆరోపణలను భూమన మొదటి నుంచి ఖండిస్తున్నారు. తన పాలనాకాలంలో ఎలాంటి పొరపాటు జరగలేదని పేర్కొన్నారు.