calender_icon.png 19 November, 2024 | 9:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగాది తరువాతే సన్నబియ్యం..

19-11-2024 02:39:55 AM

  1. రేషన్ దుకాణాలకు సరఫరా 
  2. ఇప్పటివరకు 13.13లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ
  3. సన్నాలు, దొడ్డు రకాల గుర్తింపునకు కమిటీలు
  4. 23 నాటికి సన్నాలకు 90% బోనస్ చెల్లింపులు
  5. అవకతవకలకు పాల్పడిన 362 మంది మిల్లర్లపై చర్యలు
  6. ఇతర దేశాలకు తెలంగాణ బియ్యం ఎగుమతి
  7. రాష్ట్ర పౌరసరఫరాల కమిషన్ డీఎస్ చౌహాన్

హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి) : రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ ఉగాది తరువాతే ఉంటుందని.. ప్రభుత్వం చెప్పినట్లు సంక్రాంతికి సాధ్యం కాదని రాష్ట్ర పౌరసరఫరాల కమిషనర్ డీఎస్ చౌహాన్ స్పష్టం చేశారు. సీఎంఆర్ ధాన్యం మూడునెలలు నిల్వ ఉంచితే ఆహా రం వండుకోవడానికి ఉపయోగపడుతుందని, అందుకోసం గోదాముల్లోకి తరలిస్తా మన్నారు.

సోమవారం సోమాజిగూడలోని తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 90లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యమని.. ఇప్పటివరకు 13.13 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోళ్లు చేశామన్నారు. సన్నాలకు రూ.9.21కోట్ల బోనస్ చెల్లింపులు చేశామని.. సాంకేతిక కారణాల వల్ల ఈనెల 23 నాటికి 90 శాతం బోనస్ చెల్లింపులు చేస్తామన్నారు.

జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తుందని, దీంతో 2.81కోట్ల మందికి లబ్ధి కలుగుతుందన్నారు. ప్రజలు దొడ్డు బియ్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి సన్నబియ్యం కొంటున్నారని.. ఇది గ్రహించిన ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం ఇవ్వా లని నిర్ణయించుకున్నదన్నారు.

ఇకపై సీఎంఆర్‌కు తీసుకున్న ధాన్యం గడువులోగా అప్ప గించకుంటే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 2014 నుంచి 2023 వరకు కార్పొరేషన్‌పై రూ.58,623 కోట్ల భారం ఉండగా.. ఈ ఏడాది రూ.11,608 కోట్ల రికవరీ చేసిందన్నారు. మిల్లర్లు బ్యాంక్ గ్యారంటీతో మరో దానికి ముడి పెట్టవద్దని, లీజు పేరుతో మోసాలకు పాల్పడితే సహించమని స్పష్టం చేశారు.

అవకతవకలకు పాల్పడిన 362 మిల్లర్లపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించేందు కు జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమించామని.. సన్నాలు, దొడ్డు రకాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశామన్నారు. 

పిలిప్పున్స్‌కు తెలంగాణ రైస్ 

తెలంగాణ బియ్యానికి ఇతర దేశాల్లో చాలా డిమాండ్ ఉందని, ఇటీవల పిలిప్పున్స్ దేశానికి శాంపిల్స్ పంపితే వెంటనే దిగుమతికి అంగీకరించినట్లు వివరించారు. త్వరలో ఆ దేశానికి బియ్యం పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వరి సాగులో దేశంలోనే తెలంగాణ రెండో స్ధానంలో నిలిచిందన్నారు.

ఎక్కువ ధర వచ్చిన చోటే రైతులు పంటను అమ్ముకోవచ్చని ఆయన సూచించారు. అక్టోబర్‌లో ప్రైవేట్ వ్యాపారులు పెద్ద మొత్తంలో సన్నవడ్లు కొన్నారని.. నవంబర్ నుంచి ప్రభుత్వ కేంద్రాలకు ధాన్యం వస్తుందన్నారు. మిల్లుల్లో తనిఖీలు చేస్తే విషయం బయటపడుతుందన్నారు.