08-04-2025 01:01:02 AM
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్
నారాయణపేట. ఏప్రిల్ 7 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం నిరుపేదల ఆత్మ గౌరవ పథకం అని నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం కలెక్టర్ జిల్లాలోని నర్వ మండలంలోని లంకాల గ్రామంలో సన్న బియ్యం పథకాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి తో కలిసి ప్రారంభించారు.
అనంతరం సన్న బియ్యం లబ్ధిదారు రేణుక ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం చేశారు.అంతకు ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ... సన్న బియ్యం పథకం గొప్పదని, సీఎం రేవంత్ రెడ్డి పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని ఆమె తెలిపారు. రేషన్ కార్డుదారులందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అయిందని, అయితే ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు మాత్రమే కాకుండా, ఇవ్వని హామీలను సైతం అమలు చేస్తున్నదని, ఉచిత బస్సు, 500 రూపాయలకే ఎల్పీజీ కనెక్షన్, గృ హజ్యోతి, రైతు భరోసా, రైతు భీమా, రుణమాఫీ వంటి పథకాలను అమలు చేస్తున్నామని, త్వరలోనే రాజీవ్ యువశక్తి పథకం కింద నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కింద నాలుగు లక్షల రూపాయల వరకు ఆర్థిక సహాయం ఇవ్వనున్నమన్నారు.
నిజమైన తెలంగాణ పేదవాడు కలల కన్న తెలంగాణ ఇదేనని ఆయన తెలిపారు. అంతకు ముందు గ్రామంలో రూ.20 లక్షల నిధులతో చేపట్టే సీసీ రోడ్డు నిర్మాణ పనులను, అంగన్ వాడీ భవన నిర్మాణ పనులను కలెక్టర్, ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో తహసిల్దార్ మల్లారెడ్డి, ఎంపీడీఓ శ్రీనివాస్, నర్వ మండల ప్రత్యేక అధికారి హీర్యా నాయక్ తదితరులు పాల్గొన్నారు.