calender_icon.png 18 October, 2024 | 3:26 PM

శంకర, ఫినిక్స్ సేవలు అభినందనీయం

18-10-2024 12:31:35 AM

హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలో ఉన్న శంకర కంటి ఆసుపత్రిలో గురువారం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యుల కోసం ప్రత్యేకంగా ఉచిత కంటివైద్య పరీక్షా శిబిరాన్ని నిర్వహించారు. శంకర హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సం యుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ‘మా’ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని ఉచిత వైద్య సేవలను సద్వినియోగం చేసుకున్నారు.

అంతకుముందు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు, ఉపాధ్యక్షుడు మాదాల రవి, కోశాధికారి శివ బాలాజీ అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘కుడిచేత్తో చేసే దానం ఎడమ చేతికి కూడా తెలియకూడదంటారు. ఫీనిక్స్ సంస్థ, శంకర హాస్పిటల్స్ అదే చేస్తున్నాయి.

పద్మశ్రీ డాక్టర్ రమణి భారతదేశమంతా కంటి ఆసుపత్రులు నెలకొల్పి, ఎలాంటి ప్రచారం కోరుకోకుండా ఇంత పెద్ద ఎత్తున ఉచిత సేవలు అందిస్తుండటం స్ఫూర్తిదాయకం. కంచి కామ కోటి పీఠాధిపతుల్ని మేం ఆరాధిస్తుంటాం. వాళ్ల ఆశీస్సులతో ఈ హాస్పిటల్స్ నడుస్తుండటం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

మాదాల రవి మాట్లాడుతూ.. ఫినిక్స్ సంస్థ నుంచి చుక్కపల్లి సురేశ్, చుక్కపల్లి అవినాష్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు కృతజ్ఞతలు’ అని చెప్పారు. ‘శంకర హాస్పిటల్స్ ఇప్పటివరకు 25 లక్షల మందికి ఫ్రీ ఐ ఆపరేషన్స్ చేయించడం గొప్ప విషయం’ అని శివ బాలాజీ అన్నారు.

ఫీనిక్స్ సంస్థ డైరెక్టర్ నీలేశ్ జానీ మాట్లాడుతూ.. ‘మేం సాధ్యమైనంత మేరకు అంధత్వాన్ని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని తెలిపారు. కంటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కరించుకోవాలని శంకర హాస్పిటల్ హెడ్ విశ్వమోహన్ సూచించారు. కార్యక్రమంలో ఫీనిక్స్, శంకర ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.