calender_icon.png 21 September, 2024 | 8:25 AM

సంజీవని గోమాత!

21-09-2024 02:15:24 AM

  1. ప్రభుత్వానికి గోవు పశువు.. ప్రజలకు తల్లి! 
  2.  గోవు పశువైతే.. మనం మనుషులమా? పశువులమా?
  3. 2029 ఎన్నికల నాటికి పెద్ద అంశంగా ‘గోమాత- రాష్ట్రమాత’ డిమాండ్

తిరుపతి లడ్డూ కల్తీ బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలి

శంకరాచార్య స్వాగత కమిటీ తెలంగాణ చైర్మన్, 

విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): భవిష్యత్తు తరాలకూ సంజీవని గోమాతేనని, అందుకే ప్రతిఒక్కరూ గోమాతలను కాపాడాలని శంకరాచార్య స్వాగత కమిటీ తెలంగాణ చైర్మన్, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం అన్నారు. ‘గోప్రతిష్ఠా ఆందోళన గోధ్వజ స్థాపన భారత్’ యాత్రలో భాగంగా అక్టోబర్ 10న శంకరాచార్య అవిముక్తేశ్వరా నంద్ స్వామీజీ ఆంధ్రప్రదేశ్‌కు విచ్చేయనున్న నేపథ్యంలో శుక్రవారం అమరా వతిలో శంకరాచార్య స్వాగత కమిటీ చైర్మన్ వేమూరు ఆనంద్ సూర్య ఆధ్వర్యంలో నిర్వహించిన  మీడియా సమా వేశంలో రాజం మాట్లాడారు.

‘కేంద్రం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలనే డిమాండ్‌తో శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ స్వామి ధ్వజయాత్ర చేపడుతు న్నారు. ఆయన అన్ని రాష్ట్రాల రాజధానుల్లో యాత్ర చేపడుతున్నారు. 22న అయోధ్యలో యాత్ర ప్రారంభమవుతుంది. 26న ఆయన ఢిల్లీలో నిర్వహించే పెద్దసభలో పాల్గొంటారు. మీడియా మిత్రులందరూ ఈ మంచిపనిలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ప్రతి పూజలో మనం గోమాతను ప్రత్యేకంగా పూజిస్తాం. ధర్మశాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాల్లో గోమాత గురించి గొప్ప ప్రస్తావన ఉంది.

33 వేల కోట్లమంది దేవత లను పూజిస్తే ఎంత పుణ్యం వస్తుందో.. గోవును పూజించినా అంతే పుణ్యం వస్తుంది. గోమాతను భారతదేశంలో 120 కోట్ల ప్రజలు తల్లిగా భావిస్తున్నాం. అలాంటి తల్లిని భారత ప్రభుత్వం పశువుగా పరిగణిస్తుంది. గెజిట్‌లోనూ గోవు పశువుగానే ఉంది. మన ప్రజాస్వామ్య దేశంలో వందలో 51 శాతం మెజార్టీ వస్తే ఒక మనిషి ఎంపీ అవుతాడు.  కొందరు ముఖ్యమంత్రు లు, ప్రధానమంత్రులవుతారు. మరి దేశవ్యాప్తంగా 85శాతం మంది గోవును రాష్ట్రమాత చేయాలని కోరుతున్నారు. గోమాతను రాష్ట్రమాత చేయాలనే డిమాండ్ 1857 నుంచి ఉన్నది.

బహుశా అంతకంటే ముందుగానే పరిశోధన ఉన్నది. దీనిపై ఇప్పటికీ పరిశోధన జరుగుతున్నది. కేంద్రంలో హిందుత్వ భావాలకు ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం అధికారం లో ఉన్నది. అయినప్పటికీ ప్రభుత్వం దృష్టి లో గోమాత పశువుగానే ఉన్నది. తల్లిలాంటి గోవు పశువు అయితే.. అప్పుడు మనమేం టి? గోతల్లి బిడ్డలం కాబట్టి మనమూ పశువులమా? లేదా మనుషులమా? అనేది మనం ఆలోచించుకోవాలి. గోమాతను రాష్ట్రమాత చేసేందుకు ఎంతో మంది  క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగా కొందరు దేశవ్యాప్తంగా యాత్ర నిర్వహిస్తున్నారు.

మరికొందరు గోశాలలు ఏర్పాటు చేసి గోవులను కొలుస్తున్నారు. వారి ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని మాత్రం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు పట్టించుకోవడం లేదు. గోమాత రాష్ట్రమాత డిమాండ్‌తో శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ స్వామి ఉద్యమం ప్రారంభి స్తున్నారు. తిరుపతి వేంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవం. తిరుపతి దేశంలోనే గొప్ప పుణ్యక్షేత్రం. అంతటి ప్రాశస్తి కలిగిన తిరుపతి లడ్డూలో స్వచ్ఛమైన ఆవు నెయ్యి లేకుండా.. ఇతరేతర పదార్థాలు ఉన్నాయని మీడియాలో వార్తలు వస్తున్నాయి. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిని కేవలం కిలోకు రూ.320కే కొంటున్నారని తెలిసింది.

నెయ్యి ధర బయట చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్గానిక్ నెయ్యి అయితే కిలో రూ.2 వేల వరకు ఉంటుంది. తిరుమలలో తక్కువ ధరకు నెయ్యి కొంటున్నారంటే దానిలో ఏదో కల్తీ ఉండే ఉంటుంది. మల్టీ నేషనల్ కంపెనీస్ ఉచితంగా దేవుడికి ఇస్తామంటే సరే గానీ, ఏ ఢిల్లీకి చెందిన ఏ అనామకులో వచ్చి నెయ్యి ఇస్తామంటే ఏమిటర్థం? దీనిపై ఏపీ ప్రభుత్వం సమగ్రమైన విచారణ జరిపించాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోక్‌శ్‌పై మాకు ఎంతో విశ్వాసం ఉంది. విచారణలో తప్పు జరిగిందని నిర్ధారణ అయితే వారు బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఇప్పుడు పిల్లులు, కుక్కలు ఉంటున్నాయి. కానీ, ఇంట్లో ఒక గోవు ఉంటే శుద్ధమైన నెయ్యి మనకు దొరుకుతుంది. గోమాతను మనం రక్షిస్తే.. గోమాత మనల్ని రక్షిస్తుంది. గోవు పాలు తాగితే మన ఆరోగ్యం బాగుంటుంది. భవిష్యత్తు తరాలకూ సంజీవని గోమాతే. అందుకే ప్రతిఒక్కరూ గోమాతలను కాపాడాలి. వాటి సంఖ్య పెంచాలి. దీనిలో భాగంగానే శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ స్వామి ఉద్యమం చేపడుతున్నారు. ‘గోమాత రాష్ట్రమాత.. రాష్ట్రమాత భరతమాత’ నినాదంతో యాత్ర చేయనున్నారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గోమాతకు ప్రాధాన్యం ఇస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కూడా సానుకూలంగానే ఉన్నట్లు కనిపిస్తున్నది. ఇందిరా గాంధీ హయాంలో తమ మొదటి ఎన్నికల గుర్తు ఆవుదూడ అనే చెప్తున్నారు. ఆ పార్టీ కూడా గోవుకు ప్రాధాన్యం ఇస్తున్నది. 120 కోట్ల భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్రం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలి. ఒకవేళ అలా జరగకపోతే 2029 ఎన్నికల నాటికి ఇది పెద్దగా పరిణమిస్తుంది. బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ.. ఇలా పార్టీ ఏదైనా సరే గోమాతను రాష్ట్రమాత డిమాండ్‌కు అనుకూలంగా ఉంటే బాగుంటుంది.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జాతీయ రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యం ఉన్నది. ఆయన సానుకూలంగా స్పందించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళితే బాగుంటుంది. సీఎం ఈ ఉద్యమాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళితే బాగుంటుంది. ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది. అలా జరిగితే రాష్ట్రప్రభుత్వానికి ఎంతో పేరు వస్తుంది. వేమూరు ఆనంద్ సూర్య చొరవ తీసుకుని సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరుతున్నాం. తద్వారా సీఎం పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టించే విధంగా కృషి చేయాలని విజ్ఞపి చేస్తున్నాం’ అని అన్నారు.

జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ 

10న అమరావతికి రాష్ట్రీయ సంయోజక్ వికాస్ పాట్నాజీ

హైదరాబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): భారత్‌లో గోవును గో మాతగా పూజిస్తామని, కానీ దేశవ్యాప్తంగా గోహత్యలు నిరంతరం జరుగు తున్నాయని జ్యోతిర్మఠ్ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ స్వామి యాత్ర రాష్ట్రీయ సంయోజక్ వికాస్ పాట్నాజీ అన్నారు. గోహత్యలేని భారత్‌ను చూడాలంటే, గోమాతను భారత ప్రభుత్వం రాష్ట్రమాతగా ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ డిమాండ్‌తోనే శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ స్వామి దేశవ్యాప్తంగా ‘గో మాత రాష్ట్రమాత’  భారత యాత్ర చేపడుతున్నారని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

యాత్ర ద్వారా దేశమంతా ఒక్క తాటిపైకి వస్తుందని విశ్వసిస్తున్నామని అన్నారు. ఇదే లక్ష్యం కోసం 1857 నుంచే ఉద్యమం మొదలైందని గుర్తుచేశారు. గో సంరక్షణ కోసం కొందరు తుపాకీ గుళ్లను సైతం తీసుకున్నారని కొనియాడారు. అప్పటి నుంచే స్వాతంత్య్ర ఉద్యమం మొదలైందన్నారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి కలియుగ ప్రత్యక్ష దైవమన్నారు. వేంకటేశ్వరుడికి స్వయం గా భూమాతే క్షీరధార ఇచ్చిందన్నారు. వేంకటేశ్వరుడు ప్రజల ప్రత్యక్ష దైవమయ్యాడని గుర్తుచేశారు. అలాంటి చోట గోహత్యలు బంద్ అయితే అందరికీ మంచి జరుగుతుందని, గోమాత రాష్ట్రమాత అయితే దేశానికే శుభం జరుగుతుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం గోమాతను రాష్ట్రమాత చేస్తే దేశంలో గోహత్యలనేవే ఉండవన్నారు. ఒక రాష్ట్రంలో గోహత్యల నిషేధం ఉండి ఉపయోగం లేదని అభిప్రాయపడ్డారు. గోవధకులు నిషేధం లేని రాష్ట్రాలకు గోవులను తరలించి గోహత్యలు చేస్తున్నారన్నారు. అలా జరగకుండా ఉండాలంటే కేంద్రం వెంటనే గోవును గెజిట్‌లో పశువుగా పరిగణించకుండా ఉండా లన్నారు. అందుకు గోమాతను రాష్ట్రమాతగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోమాత విశ్వమాత అని, కనీసం గోమాతను రాష్ట్రమాతగా ప్రకటిస్తే దేశానికి శుభ మన్నారు. మీడియా మిత్రులందరూ గోమా త రాష్ట్రమాత డిమాండ్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు.

అక్టోబర్ 10న గోధ్వజ స్థాపన భారత్ యాత్ర..

గోప్రతిష్ఠా భారత్ యాత్రలో భాగంగా అక్టోబర్ 10న శంకరాచార్య అవిముక్తేశ్వరానంద్ అమరావతికి విచ్చేయనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు నిర్వహించే మహాసభలో మాట్లాడతారు. నిర్వాహకులు త్వరలో వేదికను ప్రకటిస్తారు. ఈ కార్యక్రమంలో జ్యోతి ర్మఠ్ శంకరాచార్య శిష్యులు బ్రహ్మచారి అఖిలేశ్ కృష్ణాజీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శంకరాచార్య స్వాగత కమిటీ చైర్మన్ శ్రీ వేమూరి ఆనంద్ సూర్య,  సమన్వయకర్తలు గార్లపాటి విజయకుమార్, వారణాశి దుర్గాసారథి, నదిరాజ్ ప్రకాష్, తడకపల్లి రవీంద్రనాథ్, తాడేపల్లి సూర్యనారాయణ, కుందేటి సుబ్రహ్మణ్యం, బొగ్గారపు వెంకట కోటేశ్వర రావు, కుప్పా సత్యనారాయణ, శ్రీమతి కృష్ణ కుమారి, పాములపాటి అశోక్, కుందేటి లక్ష్మీనారాయణ, వల్లభనేని ఆషా కిరణ్, అందుకూరి శ్రీమన్నారాయణ, బులుసు వీవీయస్ శర్మ, భామిదిపల్లి రమణ మూర్తి పాల్గొన్నారు.