calender_icon.png 7 March, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు సంజీవని కులగణన

23-02-2025 12:00:00 AM

డాక్టర్ సంగని మల్లేశ్వర్ :

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణన వల్ల బీసీల లెక్కలు చావు తప్పి లొట్టపోయినట్టు ఉంది. 76 సంవత్సరాలుగా బడుగు లను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారనేది ఆయా ప్రభుత్వాలు ఆడుతున్న నాటకాలను బట్టి అర్థం అవుతున్నది. 

స్థానిక ఎన్నికలే అజెండా

అయితే శాసనసభ ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే రేవంత్ ప్రభుత్వం కులగణనను ఒక యజ్ఞంలా సాగించినప్పటికీ గణాంకాలు రాబట్టడంలో విఫలమైం దని విపక్షాలు గగ్గోలు పెట్టుతున్నాయి. వాస్తవానికి కులగణన విషయంలో బీసీ వర్గాలనుంచి పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు కానీ ప్రత్యర్థి పార్టీలు మా త్రం కులగణన సందర్భంగా చోటు చేసుకున్న కొన్ని లోపాలను రాజకీయ అస్త్రంగా మలుచుకొంటున్నాయి.

రేవంత్ సర్కార్ బీసీల శాతాన్ని ఉద్దేశపూర్వకంగా తగ్గించిందని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ ఆరో పిస్తూ ఉంటే, ముస్లింలను బీసీల్లో చేర్చి లెక్క కట్టడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ముస్లింలను తప్పించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే తామ మద్ద తు ఇస్తామని ఆ పార్టీకి చెందిన కేంద్రమం త్రి బండి సంజయ్ తెగేసి చెప్తున్నారు.

విచి త్రం ఏమిటంటే స్వపక్షంలోని బీసీలను ఎన్నడూ ఉద్ధరించని కాంగ్రెస్ పార్టీలోని ఆ వర్గం నేతలు సైతం ప్రభుత్వంపై ఒంటికాలు మీద లేస్తున్నారు. ఇదే అదనుగా మేమేం తక్కువనా అన్నట్లుగాప్రతిపక్షాలు  రాజకీయ రంగు పులిమే ప్రయత్నం అడుగడు గునా కనిపిస్తోంది. నిజంగానే బీసీల పై ప్రేమ ఉంటే కేటీఆర్, హరీశ్ రావు లాం టి బీఆర్‌ఎస్ నేతలు కుటుంబ సర్వేను బహిష్కరించేవారు కాదు.

పైగా ‘అవ్వ ఏడవంగా బిడ్డ ఏడ్చినట్లు’ తప్పుల తడకలా ఉన్నదని దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే వారికి దొరికిందల్లా ఒక్కటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలను మాత్రమే విపక్షాలు నిలదీస్తున్నాయి. స్థానిక సంస్థ ల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు ఏదని? వారు ప్రశ్నిస్తున్నారు.

రిజర్వేషన్లు తేలక ముందు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు గర్జించి అధికార పార్టీని నేలకేసి కొడతారన్న ఎత్తుగడతో ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నా రు. ప్రభుత్వం మాత్రం కులగణన తేలితే ఆయా కులాల దామా షా ప్రకారం వారికి రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చినట్టుగానే ఎన్నికల ముందు సమగ్రమైన వ్యూ హంతో 50 రోజులపాటు చిత్తశుద్ధితో కులగణనను నిర్విరామంగా నిర్వహించింది.

దానికోసం 94,863 మంది ఎన్యూమరేటర్లు, 9628 మంది సూపర్వైజర్లను నియ మించింది. అయితే ‘మూలిగే నక్కమీద తాటి పండు పడ్డట్టు’ గణాంకాలలో 3.1 శా తం ప్రజలు నమోదు కాని కారణంగా బీసీ ల భావజాల వ్యాప్తికి ఆటంకం కలిగింది. లెక్కల్లో గందరగోళానికి కారణమైంది.

చారిత్రాత్మక నిర్ణయం

మేమెంతో, మాకంత నినాదంతో రోడ్డెక్కిన బీసీల న్యాయమైన సామాజిక న్యా యం కోసం తెలంగాణ ప్రభుత్వం కులగణన చేయడం చారిత్రాత్మక నిర్ణయం. ఆర్థి క, రాజకీయ, సామాజిక, విద్య రంగాల్లో బలపడడానికి ఇది పదునైన అస్త్రం అవుతుందని అందరూ భావించారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో బీసీల జనాభా 46 శాతం రావడం ఏం టని ఆయా వర్గాల వారు నిలదీస్తున్నారు.

ముస్లిం బీసీలు 10.08 శాతం కలిపితే మొత్తం బీసీల జనాభా 56.33 శాతంగా ఉంది. 2011 జనగణనలో నాటి తెలంగాణ రీజన్‌లో జనాభా 3.51 కోట్లుగా నమోదు అయ్యింది. రాష్ట్రం ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన సమగ్ర కుటుం బ సర్వే ప్రకారం 3.68 కోట్లుగా, బీసీలు 51.1 శాతంగా రికార్డు అయ్యింది.

అటువంటిది ఇప్పుడు జరిగిన కులగణనలో 3.56 తక్కువ నమోదు కావడం ఏమిటని బీసీ సమాజం ప్రశ్నిస్తున్నది. బీసీలకు రాజకీయాల్లో వాటా దక్కకుండా చేయడానికి కుట్ర జరుగుతున్నదనే అనుమానాలకు ప్రభుత్వం చూపెట్టిన కులగణన గణాంకాలు బలం చేకూరుస్తున్నాయి. కులగణన బీహార్,తమిళనాడు మాదిరిగా శాస్త్రీయం గా జరుగలేదని బీజేపీ తప్పుపడుతు న్నది.

పంచాయతీరాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లలకు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. 73,74 వ రాజ్యాంగ సవరణ చేసినప్పుడు రాజ్యాంగంలోని 72డి,6 ప్రకారం స్థానిక  సంస్థల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో రిజర్వేషన్లు పెంచుకోవచ్చని సుస్పష్టం చేసింది.

అటువంటిది తెలంగాణ ప్ర భుత్వం తూతూ మంత్రంగా ఇక్కడ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపి చేతులు దులుపుకొనే ప్రయ త్నం సరికాదు. కాంగ్రెస్ చిత్తశుద్ధిని చాటుకోవడానికి దామాషా ప్రకారం పంచా యత్ రాజ్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ, మొత్తంలో 50 శాతం నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చినప్పుడే కామారెడ్డి డిక్లరేషన్‌కు అర్థం ఉంటదంటే అతిశయోక్తి కాదు.

పార్టీల చిత్తశుద్ధికి పరీక్ష 

రాష్ట్రంలో బీసీలకు విద్య,రాజకీయ ఆర్థిక రంగాల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బీసీల జనాభా తప్పని ప్రజాసంఘాలు దుమ్మెత్తి పోస్తున్న కారణంగా ఈ నెల 16 నుండి 28వరకు మరో సారి సర్వే నిర్వహిస్తున్నారు. వాస్తవానికి అధికారుల అలసత్వంతో పాటు, కొంతమంది ఉద్దేశ పూర్వకంగా లెక్కలు ఇవ్వడా నికి ఇష్టపడలేదు.

ఈసారి ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఆన్‌లైన్ ,టోల్ ఫ్రీ, మండల కార్యాలయంలో స్వయంగా వివరాలు అందించే వెసులుబాటు కల్పించిం ది. శాసనసభలో ఆమోదించి బీసీ రిజర్వేషన్ల బిల్లును మొక్కుబడిగా పార్లమెంట్ లో కూడా ప్రవేశ పెట్టేందుకు కాకుండా బీసీ రిజర్వేషన్ల కోసం కలిసివచ్చే అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి, ప్రధాని మోదీకి విన్నవించితే కానీ పార్లమెంట్‌లో చట్టబద్ధ్దత సాధ్యం కాదు.

అమలుకు నోచుకోదు. ఈ బిల్లుతో బీసీల వ్యతిరేకులు ఎవరనేది తెలియక తప్పదు. నాడు 2014 లో కులగణన చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ జనగణన కూడా చేయకుండా రోహిణి కమిషన్‌ను వేసి చేతులు దులుపుకున్న కేంద్ర ప్రభుత్వం బీసీలపై మొసలి కన్నీరు కారుస్తున్నది.

‘నవ్విపోదురు గాక నాకేంటి’ అన్నట్లుగా ప్రధాని మోదీ హయాంలో రాష్టం లో పార్టీబీసీ అధ్యక్షుడుగా ఉన్న బండి సంజయ్‌ను తొలగించి, ఆ తర్వాత వచ్చిన విమర్శలను కప్పి పుచ్చుకోవడంకోసం కేంద్ర మంత్రిని చేశారనే ప్రచారం ఉంది. అధికారంలో ఉన్నప్పుడూ బీసీల బాగోగులు చూడని విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనం కోసం సర్వే లెక్కలు తప్పుల తడక అని విమర్శలు చేయడం సబబు కాదు.

అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల రిజర్వేషన్లు 34నుండి 23శాతానికి  తగ్గించింది ఎవరు? అటువంటిది బీఆర్‌ఎస్ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేయ డం విడ్డ్డూరంగా ఉంది. దేశంలో బీసీ లు చాలా ఏండ్లుగా అన్యాయానికి గురవుతున్నారు.

స్వాతంత్య్రం వచ్చి 77ఏళ్ళు అయి నా రాజ్యాంగంలో ప్రత్యేక రిజర్వేషన్లు లేకపోవడం వల్ల, బీసీల రాజ్యాధికార అజెం డాను ఆధిపత్య కులాలు  విదిలించే పదవుల కోసం బాడుగ నేతలు హైజాక్ చేసి దారి మళ్లిస్తే బానిసత్వం అనుభవించక తప్పదు. బీసీల ఆకాంక్షల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.తాము చేపట్టిన కులగణన దేశానికే రోల్‌మోడల్ అవుతుందని రేవంత్ సర్కా ర్ ధీమాగా చెబుతున్నది.

అంతేకాదు గతం లో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన సమగ్ర కుల సర్వే  వివరాలను ఇప్ప టికీ బైటపెట్టలేదని, రాజకీయ ప్రయోజనాలకోసమే దాన్ని వాడు కున్నారని, తాము అలా కాకుండా చిత్తశుద్ధితో అన్ని వివరాలను ప్రజల ముందుంచామని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలైతే దేశవ్యాప్తంగా ఓబీసీలకు ’కులగణన’ సంజీవనిగా మారుతుందని బుద్ధి జీవులు అభిప్రాయపడుతున్నారు.

 వ్యాసకర్త సెల్ : 9866255355