calender_icon.png 25 October, 2024 | 4:55 AM

51వ సీజేఐగా సంజీవ్ ఖన్నా

25-10-2024 02:52:14 AM

నవంబర్ 11న ప్రమాణస్వీకారం

ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

హైకోర్టు సీజేగా చేయకుండానే లభించిన అవకాశం

న్యూఢిల్లీ, అక్టోబర్ 24: భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎంపికయ్యారు. సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10న ముగియనున్న నేపథ్యంలో తర్వాతి ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా పేరును ఆయన సిఫార్సు చేశారు. జస్టిస్ చంద్రచూడ్ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో 51వ సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నవంబర్ 11న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్ వివరాలు వెల్లడించారు. వచ్చే ఏడాది మే 13 వరకు ఏడు నెలల పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా భారత ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తారు. 

హైకోర్టు సీజేగా చేయకుండానే..

జస్టిస్ సంజీవ్ ఖన్నా 1960 మే 14న జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ క్యాంపస్ లా సెంటర్‌లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. అనంతరం తీస్‌హజారీ జిల్లా కోర్టులో న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. హైకోర్టు, ట్రైబ్యునళ్లలో న్యాయవాదిగా ప్రాక్టీస్ కొనసాగించారు. 2005లో ఢిల్లీ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాతి ఏడాదే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు.

ఏ హైకోర్టులోనూ ప్రధాన న్యాయమూర్తిగా పని చేయకుండానే సీజేఐ ఘనత సాధించిన అతికొద్ది మందిలో ఒకరిగా జస్టిస్ ఖన్నా నిలిచారు. ఆయన ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, భోపాల్‌లోని నేషనల్ జ్యుడీషియల్ అకాడెమీ పాలక మండలి సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

హెచ్‌ఆర్ ఖన్నాకు మేనల్లుడు 

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నాకు జస్టిస్ సంజీవ్ మేనల్లుడు కావడం గమనార్హం. 1973లో ప్రముఖమైన కేశవానంద భారతి కేసులో రాజ్యాంగ మౌలిక నిర్మాణ సిద్ధాంతానికి సంబంధించి చారిత్రక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు ధర్మాసనంలో జస్టిస్ హెచ్‌ఆర్ ఖన్నా సభ్యుడుగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు వంటి ప్రాథమిక హక్కులను రద్దు చేయవచ్చుంటూ 1976లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వెలువరించిన తీర్పులో విభేదించిన ఏకైక సభ్యునిగా ఆయన పేరు ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు. అయితే అనంతరం తనను కాదని జూనియర్‌ను ఇందిరా ప్రభుత్వం సీజేఐగా నియమించడంతో న్యాయమూర్తి పదవికి రాజీనామా చేశారు.