కోల్‌కతా రేప్ కేసు
చనిపోయేవరకు..
- ఇది అతి అరుదైన కేసు కాదు : సియాల్దా కోర్టు
- మృతురాలి కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం
- న్యాయం కావాలి : మృతురాలి తల్లిదండ్రులు
కోల్‌కతా, జనవరి 20: దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ ఆసుపత్రి వైద్యురాలిపై లైంగిక దాడి కేసులో దోషి సంజయ్‌రాయ్‌కి కోల్‌క తా సియాల్దా కోర్టు జీవితఖైదుతో పాటు రూ.50 వేల జరిమానా విధించింది. చనిపోయేవరకు సంజయ్ రాయ్ జీవితఖైదీగా ఉండాల ని స్పష్టం చేసింది. అలాగే మృతురాలి కుటుంబానికి రూ.17 లక్షల పరిహారం చెల్లించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశిం చింది.
సియాల్దా కోర్టు న్యాయమూర్తి అనిర్బన్‌దాస్ సోమవారం ఈ తీర్పు నిచ్చారు. ఈ సందర్భంగా సంజయ్‌రాయ్ తన వాదన వినిపిస్తూ.. ‘నన్ను ఈ కేసులో తప్పుగా ఇరికించారు. నాతో బలవంతంగా ఎన్నో పత్రాలపై పోలీసులు, సీబీఐ అధికారులు సంతకాలు తీసుకున్నారు’ అని కోర్టుకు తెలిపాడు.
మరణశిక్ష విధించాలి: సీబీఐ తరఫు న్యాయవాది
తర్వాత సీబీఐ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ.. ‘ఇది చాలా అరుదైన కేసు. నిందితుడు సంజయ్‌రాయ్ కారణంగా ప్రతిభవంతురాలైన వైద్యురాలు ప్రాణం కోల్పోయింది. ఆమె తల్లిదండ్రులకు శోకం మిగిలింది. ప్రజల ప్రాణాలు నిలబెట్టగలిగిన వైద్యులకు భరోసానివ్వాలంటే సంజయ్‌రాయ్‌కి మరణశిక్ష విధించాలి. తద్వారా న్యాయవ్యవస్థపై సమాజానికి ఉన్న విశ్వాసాన్ని నిలబెట్టాలి’ అని న్యాయస్థానాన్ని కోరారు.
ఇది అతి అరుదైన కేసు కాదు : న్యాయస్థానం
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి అనిర్బన్‌దాస్ ఈ కేసులో సంజయ్‌రాయ్‌ని దోషిగా నిర్ధారించి, అతడికి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధించారు. అతడికి మరణ శిక్ష విధించేందుకు ఈ కేసు అతి అరుదైన కేసు కాదని తేల్చిచెప్పారు. సంజయ్‌రాయ్‌పై బీఎన్‌ఎస్ సెక్షన్లు 64, 66, 103 (1) కింద మాత్రమే దోషిగా నిర్ధారిస్తున్నామని తేల్చిచెప్పారు.
పరిహారం వద్దు.. న్యాయం కావాలి : మృతురాలి తల్లిదండ్రులు
సంజయ్‌రాయ్‌కి జీవిత ఖైదు విధింపుపై మృతురాలి తల్లిదండ్రులు స్పందించారు. కోర్టు తీర్పుతో తాము దిగ్భాంత్రికి గురయ్యామన్నారు. తమ కు పరిహారం వద్దని, న్యాయం మాత్రమే కావాలని వెల్లడించారు. న్యాయస్థానం తీర్పు తమ ను నిరాశకు గురిచేసిందని, లైంగికదాడికి గురై ఒక ప్రాణం పోతే ఎలా అరుదైన కేసు కాకుం డా పోతుందని ప్రశ్నించారు. తీర్పును సవాల్ చేస్తూ తాము హైకోర్టును ఆశ్రయిస్తామని తేల్చిచెప్పారు.
కోర్టు మరణశిక్ష విధిస్తుందనుకున్నా: బాధిత కుటుంబం తరఫు న్యాయవాది
బాధిత కుటుంబం తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. ‘న్యాయస్థానం సంజయ్ రా య్‌కి మరణశిక్ష విధిస్తుందనున్నా.. కోర్టు కేవలం జీవితఖైదు విధించింది’ అని నైరాశ్యం వ్యక్తం చేశారు.