* నేటితో ముగియనున్న శక్తికాంతదాస్ పదవీ కాలం
* సుదీర్ఘ కాలం సేవలు
న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండి యా నూతన గవర్నర్‌గా రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా నియమితులయ్యారు. ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ పదవీ కాలం మంగళవారం(డిసెంబర్ 10)తో ముగియడంతో తదుపరి గవర్నర్‌ను కేంద్రం నియమించింది. 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్.. పదవీ కాలం 2021లోనే ముగియగా కేంద్రం మరో మూడేళ్లు పొడిగించింది. ఈ గడువు కూడా డిసెంబర్ 10తో ముగియనుండడంతో కొత్త గవర్నర్ నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. మల్హోత్రా ఆర్‌బీఐకి 26వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. డిసెంబర్ 11 నుంచి మూడేళ్ల కాలం పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ప్రిన్స్‌టన్ వర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ
కొత్త ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులైన సంజయ్ మల్హోత్రా రాజస్థాన్ కేడర్‌కు చెంది న 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్‌లో కంప్యూటర్ సైన్స్‌లో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆయన అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీనుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ చేశారు. విద్యుత్, ఆర్థిక, పన్నులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైన్స్ తదితర రంగాల్ల్లో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయం లో అపార అనుభవం కలిగిన మల్హోత్రా ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన విధాన రూపకల్పనలోనూ కీలకంగా వ్యవహరించారు.
ప్రస్తుతం రెవిన్యూ శాఖ కార్యదర్శిగా పని చేస్తున్న మల్హోత్రా అంత కు ముందు 2022 అక్టోబర్‌నుంచి రెవిన్యూ శాఖలో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా పని చేస్తున్నారు.ప్రభుత్వ రంగ సంస్థ అయిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఇసి)కి సీఎండీగా కూడా పని చేశారు.
భువనేశ్వర్‌లో జన్మించిన శక్తికాంత్ దాస్ 2018లో ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు గవర్నర్‌గా ఉన్న ఉర్జిత్ పటేల్ స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. 2021లోనే ఆయన పదవీ కాలం ముగిసినప్పటికీ కేంద్రప్రభుత్వం మరో మూడేళ్ల పాటు పొడిగించింది. అప్ప ట్లో కరోనా సమయంలోనూ సమర్థవంతం గా పని చేశారన్న కారణంగా మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుకొంది.