అంజనగిరి, పాన్గల్, బండపల్లి గ్రామాల్లో డ్రై డే కార్యక్రమం పరిశీలన
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి (విజయక్రాంతి): స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి పారిశుధ్య కార్మికులకు వైద్య ఆరోగ్య పరీక్షలు, జీవన్ జ్యోతి, సురక్ష యోజన భీమా చేయించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం ఉదయం డ్రై డే కార్యక్రమంలో భాగంగా వనపర్తి మండలం అంజనగిరి, పాన్గల్, బండపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లో జరుగుచున్న డ్రై డే కార్యక్రమాలను పరిశిలించడంతో పాటు అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు.అమ్మ ఆదర్శ పాటశాల పనులు పూర్తి అయిన వాటికి మెజర్మెంట్ బుక్ సిద్ధం చేసి సోమవారంలోగా ఇవ్వాలని ఆదేశించారు. గ్రామాల్లో ఉన్న పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారా లేదా? జీవన్ జ్యోతి, సురక్ష యోజన వంటి భీమా పాలసీలు పూర్తి అయ్యాయ లేదా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వచ్చత హి సేవా కార్యక్రమం అక్టోబర్ 2వరకు నిర్వహించడం జరుగుతుందనీ ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతి మల్టి పర్పస్ వర్కర్లకు వైద్య వైద్య పరీక్షలు, భీమా పాలసీలు చేయించి బ్యాంకు అకౌంటుకు అనుసంధానం చేయించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారిని ఆదేశించారు.
ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలక్టర్ ఆదేశించారు. శుక్రవారం పానగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీల ఈ. డి.డి. రిజిస్టరు, త్రైమాసిక ఏ.ఎన్.సి. చెకప్, స్టాక్ రిజిష్టర్లను పరిశీలించారు. లేబర్ రూమ్ ను పరిశీలించిన కలక్టర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. బండ పల్లి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ మండల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల విద్యా సామర్థ్యాలను పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యం పెంచాల్సిన అవసరం ఉందని మండల విద్యా అధికారిని ఆదేశించారు.అనంతరం డ్రై డే కార్యక్రమాన్ని పరిశీలించిన కలక్టర్ వర్షాకాలం అయ్యే వరకు ప్రతి శుక్రవారం, మంగళవారం డ్రై డే కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారి, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి ఉమాదేవి, వనపర్తి తహసిల్దార్ రమేష్ రెడ్డి, పానగల్ ఎంపీడీఓ గోవింద రావు, మెడికల్ ఆఫీసర్ తదితరులు కలక్టర్ వెంట ఉన్నారు.