calender_icon.png 6 February, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదంలో గాయపడిన పారిశుద్ధ్య కార్మికురాలు..

05-02-2025 11:27:19 PM

కుడి కాలు పూర్తిగా తొలగించిన ఉస్మానియా వైద్యులు..

ఎడమ కాలుకు చికిత్స..రెండు రోజులుగా కోమాలో అండలమ్మ.. ఐన స్పందించని మున్సిపల్ అధికారులు..

శోక సంద్రంలో అండలమ్మ కుటుంబ సభ్యులు..

చార్మినార్ (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదం కారణంగా ఓ కుటుంబంలో చీకట్లు ఆలుముకున్నాయి. భరోసా కల్పించాల్సిన అధికారులు కనీసం ఏం జరిగిందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఇంటి పెద్ద దిక్కు ఆపదలో ఉండటం చూసి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. వివరాల్లోకి వెళ్లితే.. పాతబస్తీ ఉప్పుగూడ శివాజీనగర్‌లో నివసించే కె.యాదయ్య, అండలమ్మ (51), భార్యభర్తలు. వీరికి ముగ్గురు కూతుర్లు, ఓ కొడుకు. అయితే గతంలో చార్మినార్ మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే యాదయ్య మున్సిపల్ శాఖ తరుపున 2016లో ఏర్పాటు చేసిన కబడ్డీ పోటీల్లో పాల్గొన్ని అందరూ చూస్తుండగానే కబడ్డీ ఆడుతూ చదర్‌ఘాట్ మైదానంలో గుండెపోటుతో మృతి చెందాడు. యాదయ్య మరణించడంతో ఆయన స్థానంలో యాదయ్య భార్య అండలమ్మకు ఉద్యోగం ఇచ్చారు.అప్పటి నుంచి అండలమ్మ చార్మినార్ జోనల్ కార్యాలయం పరిధిలోని సంతోష్ నగర్ సర్కిల్‌లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది.

రోజు మాదిరిగానే ఈ నెల 4వ తేదీన మంగళవారం తెల్లవారుజామున అండలమ్మ సంతోష్‌నగర్‌లో రోడ్లను శుభ్రం చేయడానికి వెళ్లే క్రమంలో బాబానగర్‌లో ఆటో కోసం వేచ్చి ఉంది. ఈ సమయంలో వేగంగా దూసుకోచ్చిన షిఫ్ట్ కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. రక్త మడుగులో పడి ఉన్న ఆమెను స్థానికుల సహాయంతో కుటుంబ సభ్యులు ఉస్మానియా వైద్యశాలకు తరలించారు. వైద్యులు అండలమ్మ కుడి కాలును పూర్తిగా తొలగించారు. ఎడమ కాలుకు చికిత్స చేశారు. మెడపై బలమైన గాయం కావడంతో ప్రస్తుతం అండలమ్మ కోమాలో ఉంది. రోజులు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని వైద్యులు చెప్పడంతో అండలమ్మ పిల్లలు శోకసంద్రంలో మునిగారు. ఐనప్పటికీ అండలమ్మను చూడటానికి ఏ ఒక్క మున్సిపల్ అధికారి వైద్యశాలకు రాకపోగ కనీసం ఆమె పరిస్థితి ఏలా ఉంది అని తెలుసుకోకపోవడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.

క్షేత్ర స్థాయి సిబ్బందికి ప్రమాదం జరిగితే అధికారులు పట్టించుకోరా..?

చార్మినార్ మున్సిపల్ కార్యాలయంలో పని చేసే అధికారులు కింది స్థాయి సిబ్బందికి ఏదైనా ప్రమాదం జరిగినా.. లేక ఆపద వచ్చిన మాకేందుకులే అనే విధంగా వ్యవహారించడం సిబ్బందిలో ఆవేదన కలిగిస్తోంది. అండగా నిలవాల్సిన అధికారులు ఏం పట్టనట్టు వ్యవహారించడంతో తమ బాధను ఏవరికి చెప్పుకోవాలో తెలియడం లేదని వాపోతున్నారు. గతంలో కూడా విధి నిర్వాహణలో పని చేసే పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదం బారినపడ్డారు. అప్పట్లో కూడా సరైన తీరుగా స్పందించిన దక్కాలలు లేవు. దీనికితోడు కనీసం ప్రభుత్వం తరుపునైనా మేం ఉన్నాం అనే భరోసా బాధిత కుటంబానికి కల్పించడం లేదు. ఇప్పటికైనా జోనల్ కమిషనర్‌తో పాటు డిప్యూటీ కమిషనర్లు సంబంధిత అధికారులు స్పందించి అండలమ్మ ఆరోగ్యానికి భరోసా కల్పిస్తూ ఆమె కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తారో లేదోనని బాధితురాలి కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు.