అదనపు కలెక్టర్ దీపక్ తివారి...
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం రెబ్బెన మండలం గోలేటిలోనీ ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి పాఠశాల పరిసరాలు, విద్యార్థులకు అందిస్తున్న మెనూ, రిజిస్టర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలలలో పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని, విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని సకాలంలో అందించాలని తెలిపారు.
విద్యార్థులు ప్రతి రోజు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని, వార్షిక పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రత్యేక తరగతులలో విద్యార్థులు తమకు కలిగిన సందేహాలను ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. ఆశ్రమ పాఠశాలలో మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టలేదని హెచ్ ఎం మీద అదనపు కలెక్టర్ అగ్రం వ్యక్తం చేశారు. మరల పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు, హెచ్ ఎమ్ కి, కంప్లెక్స్ హెచ్ ఎమ్ కి షోకాజ్ నోటీసు ఇవ్వడం జరిగినది. అనంతరం గోలేటి గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను పరిశీలించారు.
ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల కొరకు అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి దరఖాస్తుదారుల వివరాలను ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇండ్ల యాప్ లో ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పనిచేసి నిర్ణీత గడువులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీల ద్వారా పిల్లల సంక్షేమానికి చర్యలు: అదనపు కలెక్టర్ దీపక్ తివారి
జిల్లాలోని అంగన్వాడీల ద్వారా పిల్లల సంక్షేమం, ఆరోగ్యంపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం రెబ్బెన మండలం నంబాల గ్రామపంచాయతీ పరిధిలోని 5వ నంబర్ అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అంగన్వాడి కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రభుత్వం చేపట్టిన సక్షం అంగన్వాడి కార్యక్రమంలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించాలని తెలిపారు. అంగన్వాడి కేంద్రం పునరుద్ధరణ పనులు దాదాపు పూర్తయ్యాయని, మిగిలిన పెయింటింగ్ పనులు వచ్చే వారంలోగా పూర్తి స్థాయిలో చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో శిశు అభివృద్ధి అధికారి, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి, డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.