17-02-2025 12:00:00 AM
తఖ్తీ సాహెబ్ కూర్చున్నాడు. మౌల్వీ రఫీయుద్దీన్ ఎక్కడున్నాడని, సాలీనా ఎనిమిది వందలకు దుకాణాన్ని గుత్తాకు ఇచ్చి వేసి హైదరాబాదు విచ్చేయుచున్నాడని నిగరానీదారులు చెప్పి యున్నారు. ఒక చిత్రకారుని పట్టుక వచ్చినడనియు తెలిసినది. “వాడెక్కడ?” అని గుడ్లురిమి నోటిలోని హుక్కా ను పక్కకు విసిరేసి అడిగినాడు తఖ్తీ సాహెబ్.మారుమాట్లాడలే రాజయ్య.గూడెంల వాన పడుతున్నందున పశువుల గుడిసె మీది గడ్డి ధార కట్టింది. సాహెబ్ మహల్ చుట్టూ మనుషులు ఎవళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. కొందరు తాళ్ళు పేనుతున్నారు. కొందరు పశువులకు నీళ్ళు పెడుతున్నారు. తఖ్తీ సాహెబ్ సోదరుడు జహంగీర్ పనివాండ్లను నిలబెట్టి జుట్టు పట్టుకొని చెంప చెళ్ళు మనిపించి దూషించుచున్నాడు.సలాం సోదరుడు “మార్ మార్... ఔరేక్ మార్ సాలోంకో...” అనుచు ఆజ్యం చిలుకరించుచున్నాడు.
సత్తి బాలింత. అడవి అడవి తిరిగి తిరిగి కట్టెలు కొట్టింది. సమిధల మోపులు తెచ్చి ఇంట్లో పడ వేసింది. “ఇవేం పుల్లలు తెచ్చినావ్?” అని ముసలాయన డొక్కల తన్ను తన్నాడు. బాలింత కుక్క మూల్గినట్లుగా మూలకు నక్కింది. “ఏమిరా బెయిమాన్! నీ ఇంట్ల నాలుగు గ్రంథా లు దొరికినై కుత్తా” మౌల్వీ పక్కకు తిరిగి ఉరుము ఉరిమినాడు.“నాకు తెల్వదు దొర, బాంచెను” అని రాజయ్య సమాధానంగా చెప్పినాడు.
“తఖ్తీ సాబ్ భూమ్యాదాయ జమాఖర్చు చూచుకొనుటకు కలబ్గూరు యెల్లారెడ్డి దాంకా నియమిం చబడిన రాక్షసుడు. నిజాం జమియత్‌కు దగ్గర సంబంధాలు కలిగి తిరుగులేని అధికారం కల్గి ఉన్నాడు. అంగ్రేజి ఇలాఖా వారితో స్నేహ సంబంధాలున్నవని పెద్దలు సంపాదించిన భూములు, మహళ్ళు చాలవని ఊళ్ళకూళ్ళను నోటి బుక్కగా చేసుకొనుచున్నాడు”.రాజయ్య సమాధానానికి సంతృప్తి పొందలేదు. జహంగీరుని పిలిచి వీన్ని అరుసుకొమ్మని చెప్పాలి.
“క్యారే బేవఖూబ్” అనుకుంట చెంపమీంచి చరిచినాడు.“దిఖా రే దిఖా, రఫియుద్దీన్ కహా హై” మెడల మీంచి గుద్దినాడు. జుట్టు పట్టుకొని దిడ్డిగేటును తెరిచాడు.“చూపిస్త బాంచెను” రాజయ్య తఖ్తీ సాహెబ్ కాళ్ళ మీద పడుతూ, “ఇగ చూపిస్త, ఇప్పటినించి అన్ని చెప్త బాంచెను...” మాట పూర్తి కాకుండానే రాజయ్య మెడలు వంచుతూ తొవ్వమీదికి నూకినాడు తఖ్తీ సాహెబ్.
పశువుల గుడిసెమీద ధార ఆగిపోయింది. మొగులు చాటునించి మెత్తని సూర్యుడు మంద స్నేహముగా నవ్వుకుంటు పలుకరించినాడు. తాళ్ళు పేనే వారందరి ముంజేతిలో అక్షరాల వడులు. కడుపు నిండా నీళ్ళు తాపిన జీతగాళ్ళు తమ పనితోపాటు చదువుకున్నారు. పశువులు గోస పడకుం డా అయిపోయిందని దమ్ము తీసుకున్నారు. గాండ్ల భూమన్న కనుసైగ జేశాడు. మనుషులంతా పనిలోంచి దిగి రాత్రి బడివద్దకు బయలుదేరినారు. సత్తి దబదబ పోరికి పాలిచ్చి వస్తానని కన్నీళ్ళు తుడుచుకుంటూ నడిచిపోయింది.“ఏక్, దో, తీన్” ముందుకు నడిచాడు జహంగీర్.గుర్రం ఎక్కి ఒక్కసారి నోరు పెంచాడు.
రాజయ్య అడుగులో గుర్రం కచేరి వెనక నించి ఊరు హద్దులకు నడిచినది. అక్కడ ఆముదం దీపం వెలుగులో రఫీయుద్దీన్ జగ్గుమని మెరిసాడు. అతని చుట్టు గ్రంథాల మాలలు పేర్చబడి నాయి. మెదక్, జోగిపేట, తూప్రాన్, నార్సింప్యాట, యెల్లారెడ్డి, గజ్వేలు వరకు పఠన మందిరముల నించి పలువురు సంఘ సంస్కర్తలు వచ్చి యు న్నారు. వారంతా గూడెం యెట్టి బానిసలకు విద్య నభ్యసించుచు వారలకు తోచిన సహాయము చేయుచూ ప్రోత్సహించుచున్నారు. చిన్నచిన్న లఘు పొత్తములను చూపించుచూ చదివించుచున్నారు. పలువురు జాగీరు వాడలోని జీతగాండ్రు వ్యాయామము నేర్పించుకొనుచున్నారు. జహంగీరుకు చల్లని చలువలు గమ్ముకున్నవి.
“మాకీ తెల్వకుండా మా యిలాఖాల ఇంత నాట్కం జరుగుతుంది? క్యా బేఖాతర్ చేస్తర్ ఏం? అరే మాకి నాట్కం ఆడుతున్నర్, ఏం సభ జేస్తున్నర్ సభ! సదుకుంట సంఘ సంస్కారం పెడ్తర్! అచ్చా... చూస్కుంటం” గట్టిగా గాండ్రించుతూ రఫియుద్దీన్‌ని కోపంగా పిలిచినాడు.రఫియుద్దీన్ లేచి నిలబడినాడు.
“మా జాగీర్‌ల నౌకిరి కుత్తా మేం ఇచ్చిన ఘర్ గుత్తాకిచ్చి అవారా దౌరా తిరుగుతున్నౌ గ్రంథాలయం బెడ్తావ్ ర! నీకి మూడింది ఇయ్యాల్ల దొరికినౌ! అరే జవాన్ ఇన్కో గిరఫ్తార్ కర్!”
జవాన్ మహిబేల్ సాబ్ నల్గురు కలిసి ముందు కు ఉరకబోయినరు. మల్ల యుద్ధవీరులు నలుగురికి నాలుగు వాతలేశినరు.రాజయ్య, సత్తి జహంగీర్‌ను చూసి తుప్పున ఉమ్మేశినరు. జహంగీర్ తల కిరీటాలు నేల పడినట్లయినవి.
పెద్ద జంగు జరిగే సూచనలు దగ్గర పడుతున్నందున జహంగీర్ తన సేవకులతో వెనుదిరిగినాడు. గూడెం జగమందు వర్తిల్లినది. శతసహస్ర గూడాలకు విస్తరిల్లినది. ఉపన్యాసములతో విజ్ఞానవ్యాప్తి, శారీరక దారుఢ్యముతో కుస్తీ వ్యవహారములు, సారస్వత గ్రంథాలయముల స్థాపనమునకై ప్యాటలన్నియు, ఉద్యుక్తమైనవి.
(‘మెతుకు కతలు’ నుంచి..)