calender_icon.png 9 November, 2024 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగెం శివయ్య తోడు.. మూసీకి అడ్డొస్తే.. బుల్డోజర్‌తో తొక్కిస్తా

09-11-2024 01:17:52 AM

హరీశ్‌రావు నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. జనవరిలో వాడపల్లి నుంచి చార్మినార్‌కు నడిచివస్తా

  1. బిల్లా రంగా, చార్లెస్ శోభరాజ్ సిద్ధంగా ఉండాలి  నేను దోచుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదు
  2.  నకిలీ బీజేపీ నేతలు గుజరాత్‌లో సబర్మతి రివర్‌ఫ్రంట్, ప్రధాని మోదీ చేపట్టిన గంగా రివర్‌ఫ్రంట్‌ను స్వాగతించిండ్రు
  3. ఇప్పుడు మూసీ ప్రక్షాళనను ఎందుకు వద్దంటున్నరో చెప్పాలె ? 
  4. మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి
  5. అణుబాంబులా మూసీ మారింది
  6. నా జన్మదినం రోజు మూసీ ప్రక్షాళనకు 
  7. కంకణం కట్టుకున్నా.. నా జన్మ ధన్యమైంది

* కేసీఆర్.. మూసీకి అడ్డం పడితే కుక్కచావు చస్తవ్.. నల్గొండ ప్రజల పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దు.

...

* నెలరోజుల్లో మూసీ ప్రక్షాళనకు సంబంధించిన డీపీఆర్‌కు సంబంధించిన పనులు మొదలవుతాయి. అడ్డుకునేందుకు బిల్లా రంగా, ఛార్లెస్ శోభరాజ్‌కు రెడీనా? (కేసీఆర్, కేటీఆర్,హరీశ్‌రావును ఉద్దేశిస్తూ) మూసీ ప్రక్షాళన వద్దన్న వాళ్లను జనం వారి నడుములకు రాయి కట్టి మూసీలో ముంచుతారు. 

 సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): ‘మూసీ ప్రక్షాళనకు ఎవరెవరు అడ్డొస్తారో చెప్పండి.. సంగెం శివయ్య తోడు.. వారందరినీ బుల్డోజర్లతో తొక్కిస్తా. మూసీ ప్రక్షాళన చేసితీరతా’నని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్, బీజేపీ నేతలను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన యాదాద్రి జిల్లాలోని సంగెం నుంచి భీమలింగం వరకు మూసీ పునరుజ్జీవ సంకల్పయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా సంగెం వద్ద నిర్వహించిన సభలో సీఎం మాట్లాడుతూ.. పాలకుల పగనో.. దేవుడి శాపమో తెలియదు గానీ మూసీ విషపూరితంగా మారిందన్నారు. జపాన్‌లోని హిరో షిమా, నాగసాకీ నగరాలు అణువిస్ఫోటన విధ్వంసాన్ని చవి చూశాయని, కానీ, మూసీ కాలుష్యం అంతకంటే ప్రమాదమన్నారు. ‘వరంగా ఉండాల్సిన నది శాపంగా మారితే పాలకుడిగా నాకు ప్రక్షాళన చేసే బాధ్యత లేదా..?’ అని ఉద్వేగంతో ప్రశ్నించారు. ‘ఎంతమంది అడ్డొచ్చినా.. వారి మీదుగా బుల్డోజర్లు వెళ్తాయి.. తొక్కుకుంటూ వెళ్లి మూసీ ప్రక్షాళన చేస్తా’నని తేల్చిచెప్పారు. ‘హరీశ్‌రావు నీ సవాల్‌ను స్వీకరిస్తున్నా.. జనవరిలో వాడపల్లి నుంచి చార్మినార్ వరకు నడచివస్తున్నా. ఆ సభకు నువ్వు కూడా రావాలి’ అని సీఎం సవాల్ విసిరారు.  సంగెం సబలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగం ఆయన మాటల్లోనే..

కులవృత్తులకు శాపం..

రసాయనిక అవశేషాల భయంతో రైతులు స్వయంగా పండించిన పంటలను సైతం తినడం లేదు. తినే అన్నం విషంగా మారింది. మహిళలకు గర్భస్రావాలు అవుతున్నాయి. ఒకవేళ బిడ్డ పుట్టినా బతుకుతుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఫ్లోరైడ్ కారణంగా పుట్టే బిడ్డలు దివ్యాంగులుగా పుడుతున్నారు. నదిలో చేతులు పెడితే బొబ్బలు వస్తున్నాయి. కాళ్లు పెడితే వాస్తున్నాయి.

జలాలు విషంగా మారాయి. మత్స్యకారులు పట్టిన చేపలు, గొల్ల కురుమలు పెంచిన గొర్రె, మేక మాంసాన్ని తినేందుకు ఎవరూ ధైర్యం చేయడం లేదు. భూగర్భజలాలు కలుషితం కావడంతో తాటికల్లు కూడా కలుషితమైంది. గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. పాడి రైతులు పశువుల నుంచి తీసిన పాలను ఎవరూ తాగడం లేదు.

పంటలు పండించలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది. నేను స్వయంగా ముదిరాజ్‌లు, దళితులు, గొల్ల కురుమలతో మాట్లాడాను. ఇక్కడ కులవృత్తులు సైతం చేసుకునే పరిస్థితి లేదు. వారి క్షోభను అర్థం చేసుకుని నేను మూసీ ప్రక్షాళనకు పూనుకున్నా.

జీవనది విషంగా మారింది..

అనంతగిరి కొండల నుంచి 250 కిలోమీ ప్రవహిస్తూ మూసీ జీవనదిగా ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండను సస్యశ్యామలం చేసింది. ఇప్పుడు విషంగా మారింది. తెలంగాణలోనే పుట్టి, తిరిగి రాష్ట్రంలో పారుతున్న కృష్ణా నదిలోనే కలవడం మూసీ ప్రత్యేకత. ఎవరైనా జన్మదినమంటే దావత్ చేసుకుంటరు.

కానీ, నేను మూసీ పునరుజ్జీవం కోసం కనీసం భోజనం కూడా చేయకుండా సంకల్పయాత్రకు వచ్చా. పాదయాత్ర చేసినందుకు తన జన్మదినం కాదు నా జన్మ ధన్యమైంది. ఒకప్పుడు పాడిపంటలతో సంతోషంగా బతికిన రైతులకు ఇప్పుడు భూములు అమ్ముకోవాల్సిన దుస్థితి రావడం నాకు బాధ కలిగిస్తున్నది. నేను స్వయంగా ఎంతోమంది శాస్త్రవేత్తలతో మాట్లాడా. వారంతా నది కాలుష్యంతో నల్గొండ ప్రజలు మనగలిగే పరిస్థితులు లేవని చెప్పారు.

కేసీఆర్.. మూసీకి అడ్డం పడితే కుక్కచావు చస్తవ్..

ఎమ్మెల్సీ కవిత మూడు నెలలు జైలుకు వెళితే, ఆమె తండ్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎక్కడ లేని దుఃఖం వచ్చింది. కానీ, కాలుష్యం కారణంగా పుట్టబోయే బిడ్డలు చేతులొంకర, కాళ్లొంకరతో పుడుతుంటే, వారి తల్లులు దుఃఖిస్తుంటే, బిడ్డలను మంచానికి కట్టి కూలి పనులకు వెళ్తుంటే కేసీఆర్‌కు దుఃఖం రావడం లేదా? మూసీ ప్రక్షాళనకు అడ్డుపడితే కేసీఆర్ కుక్క చావు చస్తడు.

నల్గొండ ప్రజల పౌరుషాన్ని తక్కువ అంచనా వేయొద్దు. ధర్మభిక్షం, కొండా లక్ష్మణ్ బాపూజీ, రావినారాయణరెడ్డి, ఆరుట్ల దంపతులు పుట్టిన గడ్డ ఇది. ఇక్కడి ప్రజలకు నిజాం నవాబులను తరిమిన చరిత్ర ఉంది. మూసీ ప్రక్షాళన వద్దంటే బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ముందుంది.

స్థానికులు కోరిన విధంగా సంగెం సమీపంలో హైలెవల్ బ్రిడ్జి పూర్తి చేస్తాం. సంగెం శివన్న ఆలయ అభివృద్ధి కోసం రూ.2 కోట్లు విడుదల చేస్తాం. ప్రజల ఆశీర్వాదంతో సామేలు, వేముల వీరేశం, కుంభం అనిల్, మల్‌రెడ్డి రంగారెడ్డి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేలుగా గెలిచారు.

బిల్లా రంగా.. చార్లెస్ శోభరాజ్ రెడీనా?

నెలరోజుల్లో మూసీ ప్రక్షాళనకు సంబంధించిన డీపీఆర్‌కు సంబంధించిన పనులు మొదలవుతాయని, అడ్డుకునేందుకు బిల్లా రంగా, ఛార్లెస్ శోభరాజ్‌కు రెడీనా (కేసీఆర్, కేటీఆర్,హరీశ్‌రావును ఉద్దేశిస్తూ) ? మూసీ ప్రక్షాళన వద్దన్న వాళ్లను జనం వారి నడుములకు రాయి కట్టి మూసీలో ముంచుతారు. గోదావరి నీళ్ల మూసీలో కలిపి, వాటిని ఈసాలోకి తీసుకొస్తాం.

ఆ జలాలను కృష్ణాకు అనుసంధానిస్తాం. నదుల అనుసంధానం చేసి తీరుతాం. మూసీ ప్రక్షాళన చేసే బుల్డోజర్లకు అడ్డొచ్చిన వారెవరైనా శవాలుగా మారతారు. ఎవరికైనా అడ్డుపడే ధైర్యం ఉంటే తారీఖు చెప్పండి. మా నల్లగొండ ప్రజలతో వచ్చి మీపై బుల్డోజర్లతో తొక్కిస్తా. బుల్డోజర్‌పై మంత్రి వెంకటరెడ్డి ఉంటాడు.

ఎమ్మెల్యే సామేలు జెండా ఊపుతాడు. యాదాద్రి లక్ష్మీనరసింహుని ఆశీస్సులతో నేను చిన్నవయస్సులో ముఖ్యమంత్రిని అయ్యా. పదేళ్ల పాటు ప్రజల కోసం పనిచేశా. నాకు అల్లాటప్పాగా పదవి రాలేదు.

తెలంగాణను చెర బట్టి రూ.లక్ష కోట్లు దోచుకున్నరు..

తెలంగాణను చెరబట్టి కేసీఆర్ కుటుంబం కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రూ.లక్ష కోట్లు దోచుకున్నది. మూసీ టెండర్ రూ.1.50 లక్షల కోట్లలో సీఎం వాటా రూ.25 వేల కోట్లని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. నాకు దోచుకునే ఉద్దేశం లేదు. ఒకవేళ దోచుకోవాలంటే మీరు (గత బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి) తెచ్చిన ధరణినే అబ్రకదబ్ర చేసి వందల కోట్లు దోచుకోవచ్చు. మూసీ ప్రక్షాళనను స్వాగతించిన కమ్యూనిస్టులకు నా అభినందనలు.

ముదిరాజ్, గౌడన్న, కుమ్మరి, గొల్ల కురుమలు, దళితులకు అండగా ఉంటా. నదులున్న ప్రాంతంలో అక్కడి ప్రజలు వారి బిడ్డలకు నదుల పేర్లు పెట్టుకుంటున్నరు. కవి సీ నారాయణరెడ్డి (సినారె) తన నలుగురు బిడ్డలకు నదుల పేర్లు పెట్టుకున్నరు. కానీ, ఎవరైనా తమ బిడ్డలకు మూసీ పేరు పెట్టుకు న్నారా? లేదు. ఆ రోజు రావాలని ఆకాంక్ష. 

నకిలీ బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నా..

నేను నకిలీ బీజేపీ నాయకులను ఒకటే ప్రశ్నిస్తున్నా. గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్‌ను వారు స్వాగతించారు. ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గంగా ప్రక్షాళనను స్వాగతించారు. కానీ, మూసీ ప్రక్షాళన, మూసీ రివర్ డెవలప్‌మెంట్ ఫ్రంట్‌ను ఎందుకు అడ్డుకోవాలనుకుంటున్నారో ప్రజలకు చెప్పాలి.

ప్రధాని మోదీ గుజరాత్ సబర్మతి నదిని బాగు చేసుకున్నప్పుడు, మేం మూసీని బాగుచేసుకోవద్దా? మూసీని బాగు చేసుకోకుంటే ఇక నా జన్మ ఎందుకు ? ప్రజల కష్టాలు ్చందుకు సంగెం శివయ్యను దర్శించుకుని సంకల్పం తీసుకున్నా. మూసీ ప్రక్షాళనకు నడుం బిగించా. సబర్మతి, గంగా, లండన్‌లోని థేమ్స్, సియోల్‌లోని హాంగ్ నది ప్రక్షాళన తరహాలో మూసీకి పునరుజ్జీవం తీసుకోస్తా. పరీవాహకాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతా.

మరోసారి సీఎం  రేవంత్‌రెడ్డే 

మంత్రి కోమటిరెడ్డి 

యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (విజయక్రాంతి): వచ్చే అయిదేళ్లు కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని.. అప్పుడు కూడా రేవంత్‌రెడ్డే సీఎంగా ఉంటారని రోడ్లు, భవనాల శాఖామంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టిన అనంతరం సంగెం వద్ద ఈ ప్రాంత ప్రజలతో మాట్లాడటానికి ఏర్పాటు చేసిన వేదికపై సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మంత్రి కోమటిరెడ్డి ప్రసంగించారు.

ఉమ్మడి రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యానికి గురవుతున్న తెలంగాణ ప్రజలు పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని కేసీఆర్‌కు అధికారం అప్పగిస్తే.. ప్రజల సమస్యలను పక్కనబెట్టి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. పదేండ్లు అధికారంలో ఉన్నా.. మూసీ ప్రక్షాళన చేయని కేసీఆర్ బతుకు ఒకే బతుకేనా అని ఆయన ప్రశ్నించారు.

నల్లగొండ జిల్లా ప్రజల జీవితాలను ఆగం చేస్తున్న మూసీ కాలుష్యం నుంచి కాపాడటానికి సీఎం రేవంత్‌రెడ్డి చేపడుతున్న మూసీ పునరుజ్జీవానికి అడ్డుపడితే జిల్లా ప్రజలు కేటీఆర్, హరీశ్‌రావుల భరతం పడతారని హెచ్చరించారు.

సంగెంకు కూత వేటు దూరంలో ఫామ్‌హౌజ్‌లో పడుకున్న కేసీఆర్‌కు మూసీ ప్రక్షాళనను అడ్డుకొనే దమ్ముందా అని ప్రశ్నించారు. బుల్డోజర్లకు అడ్డుగా పడుకున్నా మూసీ పునరుజ్జీవం ఆగదని స్పష్టం చేశారు. కేటీఆర్ పాదయాత్ర బదులు మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు.

తీరనున్న మూసీ బాధితుల కష్టాలు

భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి, నవంబర్ 8( విజయక్రాంతి): దశాబ్దాలుగా మూసీ కాలుష్యంతో తల్లడిల్లుతున్న మూపీ పరివాహక ప్రజల కష్టాలు తీరనున్నాయని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం భువనగిరి నియోజకవర్గంలో సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టి రైతులతో సమావేశమైన అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడారు.

మూసీ కాలుష్యంతో ఈ ప్రాంత నేల, నీరు కలుషితమైందని, రైతులు, గీత కార్మికులు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయారన్నారు. మూసీ పునరుజ్జీవం కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నారన్నాని పేర్కొన్నారు.

మూసీ ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చి, పదేండ్లలో పట్టించుకోని కేసీఆర్, బీఆర్‌ఎస్ నాయకులు ఇప్పుడు నల్లగొండ జిల్లా ప్రజలకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నదీ పునరుజ్జీవనానికి అడ్డుపడుతున్న  నాయకులకు నియోజకవర్గ ప్రజలు గుణపాఠం చెప్పాలని, సీఎం రేవంత్‌రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.

రాజకీయమే చేద్దామా..  ప్రజలు బతకొద్దా

ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి

యాదాద్రి భువనగిరి, నవంబర్ 8(విజయక్రాంతి): ప్రజల గురించి ఆలోచించకుం డా రాజకీయం చేయడం సరికాదని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి బీఆర్‌ఎస్ నేతలకు హితవు పలికారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంతంలో పాదయాత్ర అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మీరు మాజీ సీఎం కేసీఆర్ ఏనాడైనా సచివాలయానికి వచ్చారా? ప్రజలను పట్టించుకున్నారా అని ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి తన పుట్టినరోజును మూసీ ఒడ్డున కాలుష్యబాధిత ప్రజల మధ్య జరుపుకున్నారన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. మూసీ కాలుష్యంతో నల్లగొండ జిల్లా మూసీ పరివాహక ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలు తెలిసికూడా బీఆర్‌ఎస్ నాయకులు ప్రక్షాళనను అడ్డుకోవడం సరికాదన్నారు. మూసీ పునరుజ్జీవ గొప్ప లక్ష్యంతో ముందుకెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డికి అండగా నిలవాలని కోరారు.

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యేల్ మాట్లాడుతూ.. మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్ నాయకులు కేటీఆర్, హరీశ్ చాదర్‌ఘాట్ వద్ద మూసీలో దూకి, సంగం వద్ద నీటిని తాగితే నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలు తెలుస్తాయని విమర్శించారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో వందేండ్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. 

ఎవరు అడ్డొచ్చినా ప్రక్షాళన ఆగదు

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదాద్రి భువనగిరి, నవంబర్ 8 (విజయక్రాంతి): ఒకప్పుడు స్వచ్ఛమైన నీరు ప్రవహించే మూసీనది కాలుష్యం కారణంగా ఆరు నియోజకవర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వాపోయారు. మూసీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి ప్రజలు ముక్తకంఠంతో అండగా కదిలి వస్తున్నారన్నారు.

శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డి మూసీ పరివాహక ప్రాంత పాదయాత్రలో పాల్గొన్న బీర్ల అయిలయ్య అనంతరం జరిగిన సభలో ప్రసంగించారు. జిల్లాలోని పది లక్షల ప్రజలకు మూసీ నది కాలుష్యం జీవన్మరణ సమస్యగా మారిందని, సీఎం రేవంత్‌రెడ్డి పక్కా ప్రణాళికతో చేపట్టిన ప్రాజెక్టు ఎవరు అడ్డొచ్చినా ఆగదన్నారు.

మూసీని అడ్డుకుంటున్న బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రజాపాలన అని, పుట్టినరోజు కూడా ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించడమే ఇందుకు నిదర్శనమన్నారు.

సీఎంకు ప్రముఖుల శుభాకాంక్షలు

* రేవంత్‌రెడ్డికి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి 

 ప్రధాని నరేంద్రమోదీ 

* నిండు, నూరేళ్లు ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాం

 ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు గడ్కరీ, బండి సంజయ్

* సీఎం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు

 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

* తెలంగాణ ప్రజలకు సేవ చేసేందుకు ఈ ఏడాది కూడా మీకు మంచి విజయాలు వరించాలి 

 కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

* ఈ సంవత్సరం కూడా విజయాలు సాధించాలి 

 హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్

* అంకిత భావం, స్ఫూర్తితో మీ చుట్టుపక్కల వారికి స్ఫూర్తిగా నిలవండి

 హైదరాబాద్‌లో బ్రిటిష్ డిప్యూటీ 

హై కమిషనర్ గారెత్