calender_icon.png 24 January, 2025 | 2:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వర్ణవాగులో ఇసుక తోడేళ్లు

22-01-2025 01:30:00 AM

  1. యంత్రాల సాయంతో నీటి నుంచి ఇసుక తీస్తున్న అక్రమార్కులు
  2. షిఫ్టులవారీగా తవ్వుతున్న మహారాష్ట్ర కూలీలు
  3. పట్టించుకోని అధికారులు

నిర్మల్, జనవరి 21 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ప్రవహించే స్వర్ణ వాగు నుంచి అక్రమార్కులు ఇసుకును తోడెస్తున్నారు. వాగులో ఉన్న నీటిలో యంత్రాలను ఉపయోగించి నీటిని తోడుతున్నారు. ఇసుక వనరులను సంరక్షించాలని కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ జానకీ షర్మిల కిందిస్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోవడంలేదు.

వారి కనుసైగల్లోనే ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్టు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రాత్రుల్లో విద్యుత్  బల్బులు, వాహనాల లైట్ల వెలుగుల్లో ఇసుకను నీటిలో నుంచి తోడేస్తున్నారు. 

గ్రామాల్లో వీడీసీల టెండర్లు

నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి సోన్ మండలం మాదాపూర్ వరకు సూమారు 40 కి.మీ. వరకు స్వర్ణ వాగు ప్రవహిస్తుంది. ప్రస్తుతం నిర్మల్‌లో ట్రాక్టర్ ఇసుకకు రూ.3,500 ధర పలుకుతోంది. దీంతో స్వర్ణవాగు పరిసర గ్రామాల్లోని వీడీసీలు గ్రామంలో ఇసుకకు ప్రైవేటుగా టెండర్లు నిర్వహిస్తున్నారు.

ఈ టెండరు కోసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు గ్రామానికి చెల్లించి వాగులో ఉన్న ఇసుక రీచ్‌లను అక్రమార్కులు తోడేస్తున్నారు. స్వర్ణవాగులో చెక్‌డ్యాంలు ఉండటంతో నీటి నిల్వలు కొనసాగుతున్నాయి. ఆ నీటిలో ఉన్న ఇసుకను కూలీలు ప్రాణాలకు తెగించి తోడెస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన వందలాది మంది కూలీలను తెప్పించి షిప్టుల వారిగా ఇసుకను తరలిస్తున్నారు.

అధికారుల కండ్ల ముందే..

స్వర్ణ వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న అక్రమార్కులకు ప్రభుత్వం అధికారుల అండదండలు ఉన్నాయి. అధికారుల కండ్ల ముందే ఇసుక రవాణ జరుగుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే సదరు అధికారులు దాడికి ముందుగానే ఇసుక వ్యాపారులకు సమాచారం చేరవేసి కాపాడుతున్నారు.

గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన బడా లీడర్లు వారి అనుచరులు పలుకుబడి ఉన్న నేతలు ఇసుక వ్యాపారం చేస్తున్నారు. స్వర్ణ వాగులో ఇసుకను తవ్వడంతో గుంతలు ఏర్పడి వాగు ఉనికిని కోల్పోతుంది. భూగర్భజలాలు అడుగంటి పోతున్నాయి. పశువులు  రైతులు సాగు చేసేందుకు నీటి కోరుత ఏర్పడుతుంది. వేసవిలో పంటలకు సాగునీరు చివరి వరకు లభించక పంటలు ఎండి పోతున్నాయని రైతులు అంటున్నారు.

ఈ ప్రాంతాల్లో ఇసుక రవాణ

సారంగపూర్ మండలంలోని చించోలి ఎం.సారంగపూర్, యాకర్‌పల్లి, ఆలూరు, బోరిగాం, భీరవెళ్లి, నిర్మల్ మండలంలోని కాల్వ, వెంగ్వాపేట్ తల్వేద, మంజులాపూర్, చిట్యాల్, కౌట్ల, కడ్తాల్, జాప్పౌజాప్రపూర్, మాదాపూర్, తాంసి గ్రామాల నుంచి ప్రతిరోజు వందల ట్రాక్టర్ల ఇసుక తరలిపోతున్నది. వాగులో ఇసుక తోడేందుకు ప్రత్యేక రోడ్లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.

పంట చేల నుంచి వాగులోకి వావానాలు వెళ్లేందుకు దారులు ఏర్పాటు చేశారు. నీటిలో 3 మీటర్ల లోతులో ఉన్న ఇసుకను యంత్రాల సాయంతో తోడుతున్నారు. ఇనుప చాటల సాయంతో నది ఒడ్డుకు తెస్తున్నారు. యంత్రానికి రోజుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు అద్దె చెల్లిస్తున్నారు. పరివాహక ప్రాంతంలోని పంట పొలాలు, ఇతర రహస్య ప్రదేశాల్లో ఇసుకను నిల్వ చేసి, ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.