calender_icon.png 28 March, 2025 | 5:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక లారీ డ్రైవర్లు పక్కాగా సమయపాలన పాటించాలి

25-03-2025 04:49:30 PM

ఎస్పీ కిరణ్ ఖరే..

కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ట్రాఫిక్ జామ్ సమస్య ఉత్పన్నం కాకుండా ఇసుక లారీ డ్రైవర్లు పక్కాగా సమయపాలన పాటించాలని, నిర్దేశిత సమయంలోనే ఇసుక లారీలు రోడెక్కాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి రోజూ ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఇసుక లారీలకు జాతీయ రహదారిపై అనుమతి లేదని, హోల్డింగ్ పాయింట్స్ లో చెక్ పోస్టుల్లో ఇసుక లారీలు నిలిపి ఉంచాలని, సమయపాలన ప్రకారం నడుచుకోవాలని పేర్కొన్నారు.

ఇసుక లారీల ట్రాఫిక్ నియంత్రణకు రేగొండ, కాటారంలో రెండు చెక్ పోస్టులు, హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. రేగొండలో ఖాలీ లారీలు, కాటారంలో ఇసుక  లోడ్ లారీలు, పోలీసుల నిర్దేశిత సమయపాలన ప్రకారం నడుచుకోవాలని, ఉదయం, సాయంత్రం సమయపాలన పాటించాలని అన్నారు. రోడ్డుపై వాహనాలు ఆపి ఉండడం మూలంగా ప్రమాదాలు జరుగుతుండడంతో పాటు, ట్రాఫిక్ జామ్ అవుతుందని, రోడ్డుపై ఇసుక లారీలు పార్కింగ్ చేయకుండా 24 గంటలు పెట్రోలింగ్ వ్యవస్థను పటిష్టం చేశామని ఎస్పీ పేర్కొన్నారు.

అలాగే లారీ డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలతో పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు ప్రమాదాల నివారణ, ఓవర్ స్పీడ్, పార్కింగ్ విధానం తదితర అంశాల అంశాలపై కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు జిల్లాలో కట్టుదిట్టంగా ట్రాఫిక్ నిబంధనలను అమలు చేస్తున్నామని, ఇసుక లారీ డ్రైవర్లు సైతం పోలీసులకు సహకరించాలని ఎస్పీ కిరణ్ ఖరె కోరారు.