24-03-2025 12:00:00 AM
నాగర్ కర్నూల్ మార్చి 23 (విజయక్రాంతి): కందనూలు జిల్లాలో ఇసుక దొంగ లు అర్థరాత్రిళ్లు రెచ్చిపోతున్నారు. భారీ హిటాచి, జెసిబిలు, టిప్పర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ చీకటి వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. నిఘా వర్గాల కళ్ళుగప్పి అర్ధరాత్రిళ్లు యదేచ్చగా ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారని తీవ్రస్థాయిలో విమర్శలొస్తున్నాయి.
అందుకు కంచె చేను మేసిన చందంగా పోలీసు అధికారులే అండ దండగ ఉన్నారని బాహాటంగా చర్చించుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ నుంచి పర్సంటేజీలు అందడంతోనే అర్ధరాత్రిళ్లు ఇసుక తరలిపోతున్నా బ్లూ కోర్ట్, డయల్ 100 ఇతర పోలీస్ సిబ్బంది ఎవరూ కూడా ఇసుక మాఫియాను నిలువరించడం లేదని విమర్శలు ఉన్నాయి.
తెల్లారేసరికి నిర్మాణాలు జరుగుతున్న ఇళ్ల వద్ద భారీ స్థాయిలో ఇసుక డంపులు వెలుస్తున్న పరిస్థితి నెలకొంది. దుందుభి పరివాహక గ్రామాలతో పాటు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కల్వకుర్తి ప్రాజెక్టు మూడవ లిఫ్ట్ గుడిపల్లి పరిధిలోని రిజర్వాయర్ల పరిధిలో నీటి ద్వారా మట్టి నుండి ఫిల్టర్ ఇసుక తయారు చేస్తూ ఒక్కోటిప్పర్ 38,000 చొప్పున అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు.
నాగర్ కర్నూల్ నియోజకవర్గంలోని తాడూరు, తెలకపల్లి, తిమ్మాజిపేట, బిజినపల్లి మండల పరిసర ప్రాంతాలకు రూట్ మార్చి ఇసుక తరలింపు జరుగుతోందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సంపదను సామాన్యులకు తక్కువ ధరకు అందించాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం మన ఇసుక వాహనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
కానీ అనుమతుల పేరిట రాత్రిళ్ళు కూడా ఇసుకను తరలిస్తూ సైడ్ బిజినెస్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆన్లైన్ ద్వారా సామాన్యులు దరఖాస్తు చేసుకున్న ఇసుకను సరఫరాకు ఆలస్యం జరుగుతున్న కారణంగా అక్రమ మార్గాన తరలించే ఇసుకకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.
అందులో భాగంగానే ఇసుక మాఫియా గ్యాంగ్ ఇలా రాత్రుళ్లు సరఫరా చేసేందుకు పోలీసు అధికారులను మేనేజ్ చేసుకుంటున్నట్లు విమ ర్శలున్నాయి. అక్రమ మార్గాన తరలించే ఇసుక పైన కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం పోలీసు అధికారులకు ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొంతమంది పోలీసులు వ్యవస్థను కూడా దెబ్బతీసే విధంగా కొంతమందిని అక్రమార్కులను ఇసుక దందాలో వాడుకొని సొమ్ము చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
నిఘా వర్గాలకు తెలిసి రాత్రిళ్ళు కాపు కాసి బిజినపల్లి మం డల కేంద్రంలో రెండు టిప్పర్లను పట్టుకున్నారు. వాటిని పోలీస్ స్టేషన్కు తరలించినా కేసు నమోదు చేయకుండా సదురు పోలీస్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. తాడూరు, తెలకపల్లి, నాగర్ కర్నూల్ మండల కేంద్రాల నుండి కూడా ట్రాక్టర్ల ద్వారా మాజీ కౌన్సిలర్ భర్త ఇసుక వ్యాపారం చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి.
ప్రభుత్వ అనుమతుల పేరిట అక్రమంగా ఫిల్టర్ ఇసుక తయారీ చేసి ఇసుక వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నా యి. కొంతమంది వ్యక్తులు దరఖాస్తు చేసుకోకపోయినా వందలకొద్దీ ట్రాక్టర్ల ఇసుక లోడు సరఫరా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కొడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. అక్రమ ఇసుక వ్యాపారానికి రెవె న్యూ మైనింగ్ అధికారుల సైతం అండ దండగా ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.
మన ఇసుక ద్వారా ఆయా రీచుల్లో భారీ హిటాచీలు జెసిబిల సాయంతో ఇసుకను తోడువేస్తూ నిబంధనలను ఉల్లం ఘిస్తున్నారని ఆయా గ్రామాల రైతులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను నిల్వరించి చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.