calender_icon.png 12 March, 2025 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలి

12-03-2025 01:01:55 AM

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

జగిత్యాల అర్బన్, మార్చి 11 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చేలా ప్రభుత్వపరంగా ఇసుక స్టాక్ పాయింట్ ను ఏర్పాటు చేయాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. మంగళవారం జగిత్యాలలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఇసుక క్వారీలు లేకపోవడంతో ఇసుక అందుబాటులో లేక ఇబ్బంది గా మారిందన్నారు.

గతంలో రామాలయం వద్ద ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేసి, నిర్వహణ లోపం తో మూసివేశారన్నారు. నిర్మాణ రంగానికి ఇసుక అందుబాటులో లేకపోవడం తో నిర్మాణ రంగం కుంటు పడుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించిందన్నారు. ఇసుకను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ధర్మశాల స్థలంలో ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు.

జిల్లాలో అక్రమ ఇసుక రవాణా, ఇసుక డంపులను  అరికట్టడంలో జిల్లా కలెక్టర్ చొరవ అభినందనీయమన్నారు. నిర్మాణ రంగంలో ఇసుక ప్రాధాన్యతను వివరిస్తూ సిరిసిల్ల క్వారి నుండి ఇసుక తీసుకువచ్చి, ఇసుక స్టాక్ పాయింట్ ఏర్పాటు చేయాలనీ ఈ మేరకు కలెక్టర్ కు, మినరల్ డెవలప్మెంట్ అధికారులకు లేఖ రాశారు.

మొక్కజొన్న కు గతేడాది క్వింటాల్ కు రు.2500 లకు పైగా ఉన్న ధర, మొక్కజొన్న మార్కెట్ కు చేరుకొనే సమయానికి ధర రూ.2000 లకు పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, కందులకుసైతం మద్దతు ధర కల్పించేందుకు కందుల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కు లేఖ రాశాననీ గుర్తు చేశారు. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాన్ని పరిగణనలోకి తీసుకొని పసుపుకు మద్దతు ధర కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించకపోవడంపై  విలేకరులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఎమ్మెల్సీ అభ్యర్థులను  పార్టీ సామాజిక కోణంలో ఎంపిక చేసినట్టు  భావిస్తున్నానని అన్నారు. పదవితో సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల్లో ఒకడిగా సేవలు అందిస్తానని ఆయన పేర్కొన్నారు.