కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ, జనవరి 30 (విజయక్రాంతి) : సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇతర పనులకు ఇసుక అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వంగమర్తి రీలో ఇసుక తవ్వకాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ కమిటీ తీర్మానించింది. ఈ రీ నుంచి 3,66,613 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వెందుకు ఆమోదించారు.
ఇక్కడి నుంచి ఇసుకను ఉదయ సముద్రం, ఎస్సెల్బీసీ, మున్సిపల్ పనులు, వైటీపీఎస్, ఇతర బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు ఉపయోగించాలని నిర్ణయించింది. మూసీ ఎగువన కొత్తగా గుర్తించిన ప్రాంతంలో 70,980 క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకానికి కమిటీ అనుమతిస్తూ ఇందుకు 3 నెలల్లో మైనింగ్ అనుమతుల ప్రణాళిక సమర్పించాలని ఆదేశించింది.
అమరుల దినోత్సవం సందర్భంగా అంతకుముందు కలెక్టరేట్ సమావేశ మందిరంలో అమరవీరులకు కలెక్టర్ నివాళులర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, జిల్లా గనులశాఖ సహాయ సంచాలకుడు శామ్యూల్ జాకబ్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, భూగర్భ జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు.