calender_icon.png 20 April, 2025 | 9:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక క్వారీతో వాహనదారులకు తప్పని ఇబ్బందులు

27-03-2025 10:26:07 PM

జాతీయ రహదారిపై నిలిచిన లారీలు..

చెన్నూర్ (విజయక్రాంతి): కోటపల్లి మండలంలోని కొల్లూరు ఇసుక క్వారీ వద్ద నిజామాబాద్ - చత్తీస్ ఘడ్ జాతీయ రహదారిపై ఇసుక కోసం వచ్చిన లారీలు రోడ్డుకు ఇరువైపులా నిలుపడంతో వివాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అత్యవసర పని నిమిత్తం వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాల నుంచి చెన్నూరు మీదుగా మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు వెళ్లాల్సిన ఈ జాతీయ రహదారిపై ఇసుక కోసం వచ్చిన లారీలు, ఇసుక నింపుకున్న లాలీలను నిలిపి ఉంచడం వల్ల రోడ్డు మొత్తం ట్రాఫిక్ తో జామ్ అవుతుంది. దీనితో గంటల తరబడి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.

వాహనదారుల ఫిర్యాదుతో...

ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి. రోడ్డుపైన వాహనాలు నిలిపి ఉంచడంతో తలెత్తుతున్న ఇబ్బందులను ప్రయాణికుడు ఒకరు వీడియో తీసి అధికారులకు చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామికి చేరేలా పంపించారు. ఈ వీడియో నియోజకవర్గంలో వైరల్ కావడంతో స్పందించిన కోటపల్లి తహాసిల్దార్ రాఘవెందర్ రావు, సీఐ సుధాకర్ లు సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను పరిష్కరించారు. మునుముందు ట్రాఫిక్ సమస్య ఎదురు కాకుండా ఉండేందుకు ఇసుక రీచ్ నిర్వాహకులకు వాహనాలు రహదారిపై నిలువకుండా చూడాలని ఆదేశించారు. ప్రయాణికుడు పడ్డ ఇబ్బందిని వీడియో ద్వారా సోషల్ మీడియాలో షేర్ చేసేంతవరకు అధికారులు ఏం చేస్తున్నారని పలువురు బాహాటంగానే మాట్లాడుకున్నారు.