29-03-2025 09:25:52 PM
చోద్యం చూస్తున్న అధికారులు... అధికారులకు తెలిసే ఇసుక వ్యాపారం అంటున్న ప్రజలు
నాయకులు అడ్డుకుంటేనే వచ్చిన పోలీసులు..
ఈ ఇసుక దందాకు సహకరిస్తుంది ఎవరు ? అడ్డుకున్నది ఎవరు..?
మహబూబ్ నగర్,(విజయక్రాంతి): 'బండెనుక బండి.. కట్టి పదహారు బండ్లు కట్టి...' ఓ సినీ గేయ రచయిత రాసిన ఈ పాట మిడ్జిల్ లో జరిగిన ఘటన ఇసుక మాఫియా ఘటన చూస్తే అలాగే అనిపించక మానదు. ఏదో అర్థరాత్రి కాదు... పట్టపగలు.. యాదేచ్ఛంగా టిప్పర్లు.. టిప్పర్ వెనక టిప్పర్ అన్ని టిప్పర్ లో ఇసుక తరలిస్తుండగా కొందరు నాయకులు శనివారం అడ్డుకున్నారు. అధికారులు నియంత్రించవలసి ఉన్న అటువైపు చూడకుండా ఉండడంతో కొందరు నాయకులు వరుసగా వెళుతున్న ఇసుక భారత్ బెంజ్ వాహనాలను మిడ్జిల్ మండలం రాణిపేట్ దగ్గర ఆపిండ్రు. అప్పుడు పోలీసులకు సమాచారం అందడంతో రాణి పేట దగ్గర ఇసుక వాహనాలు ఆపిన దగ్గరికి వచ్చి ఎలాంటి ఆందోళనలు జరగకుండా చూడడం జరిగింది. పదుల సంఖ్యలో భారత్ బెంజ్ టిప్పర్లు లో ఇసుక తరలిస్తున్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ఒక టిప్పర్ ఇసుకకు రూ. 30 నుంచి రూ 35 వేల వరకు ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. డిమాండ్ ను బట్టి ఇసుక వ్యాపారులు ఇసుక విక్రయిస్తున్నారని ఇండ్ల నిర్మాణదారులు సైతం పేర్కొంటున్నారు.
అధికార నాయకులకు తెలియకుండా ఇసుక పట్టపగలే తరలింపు జరుగునా..?
దుందుభి వాగులో దర్జాగా కొనసాగుతున్న ఇసుక తవ్వకాలు ఎల్లప్పుడూ జరుగుతున్నాయని ఆరోపణలకు ఉన్నాయి. అధికార పార్టీకి సంబంధించిన నాయకుల అండదండలు లేకుండా పట్టపగలు భారత్ బెంచ్ తో పాటు ఇతర భారీ వాహనాలలో ఇసుక ఎలా తరలిస్తారని జడ్చర్ల నియోజకవర్గంలో ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. నియంత్రించాల్సిన నాయకుల,అధికారుల అండదండలు లేకుండా పట్టపగలు ఇసుక ఎలా తరలిస్తారని ప్రజలు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. దొరికితేనే అక్రమం లేకుంటే సక్రమం అనే విధంగా జడ్చర్ల నియోజకవర్గంలో ఇసుక ఇసుక తరలింపు జరుగుతుందని ఆరోపణలకు ఈ ఘటన ప్రత్యేక సాక్షిగా నిలుస్తుంది. ఈ విషయంపై ఎస్సై శివ నాగేశ్వరరావుకు ఫోన్లో సంప్రదించగా స్పందించలేదు. ఈ ఘటన తెలుసుకున్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అక్రమ ఇసుక తరలింపు సరికాదని పేర్కొన్నట్లు తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో ఇసుక వ్యాపారం జరుగుతున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న కు సమాధానం అంత పట్టడం లేదు. ఇకనైనా నాయకులు, అధికారులు చెబుతున్న మాటలకు వాస్తవ పరిస్థితులకు పొంతన ఉండేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
సీఎం చెప్పిన తగ్గని ఇసుక వ్యాపారం
అక్రమంగా ఇసుక తరలింపు ప్రక్రియను పూర్తిస్థాయిలో నిలిపివేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ విధానాలను స్వాగతిస్తూ జిల్లా కలెక్టర్ ఎస్పీలు సైతం అక్రమ ఇసుక తరలింపు ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా అది కేవలం ఆదేశాల వరకు మాత్రమే పరిమితమైంది. ఇసుక వ్యాపారం మాత్రం ఎక్కడ ఆగకుండా నిర్విరామంగా జరుగుతోందని ఆరోపణలకు ఈ ఘటన ఒక సాక్ష్యంగా నిలుస్తుంది. ఇకనైనా అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటూ అక్రమ ఇసుక తరలింపును నిలిపివేయాలని ప్రజలు కోరుతున్నారు.