04-03-2025 01:17:44 AM
నాగర్ కర్నూల్ మర్చి 3 ః విజయక్రాంతి: నాగర్ కర్నూల్ నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా ఆగడాలు మరింత శృతి మించుతున్నాయి. నిరుపేదలు తమ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమయ్యే ఇసుకను అక్రమ మార్గాన తరలిస్తూ అడ్డగోలుగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.
నియోజకవర్గంలోని కొంతమంది పోలీసు అధికారులను తమ గుప్పిట్లో పెట్టుకుని మైనింగ్ రెవెన్యూ వంటి ముఖ్యమైన శాఖల అధికారులతో పాటు ఆయా గ్రామాల ప్రధాన లీడర్లతో నెలవారి మామూళ్లు పంచుతూ అక్రమంగా తరలిస్తున్న ఇసుక రవాణాకు రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.
నది పరివాహక గ్రామాలతో పాటు సొంతంగా ఇసుక ఫిల్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని మట్టిని ఇసుకగా మార్చి సొమ్ము చేసుకుంటున్నారు. మన ఇసుక వాహనం అమల్లోకి వస్తే తమకు మనుగడ ప్రశ్నార్థకంగా మారనుందన్న భయంతో తెర వెనుక ఆయా సమీప గ్రామాల ప్రజలను రెచ్చగొడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలోని మాజీ కౌన్సిలర్ భర్తతో పాటు మరో మాజీ కౌన్సిలర్, ఓ ట్రాక్టర్ మెకానిక్ లు కలిసి తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ శివారులో మూడు ఇసుక ఫిల్టర్ కేంద్రాలను నెలకొల్పారు. నాగర్ కర్నూల్ మండలం గుడిపల్లి గ్రామ శివారులోని కేఎల్‌ఐ కాల్వ పరిసరాల్లోనూ కొంతమంది అధికార, ప్రతిపక్ష పార్టీలకి చెందిన నేతలు భారీ హిటాచీలు, జెసిబి లతో ఫిల్టర్ ఇసుక తయారీ చేసి రాత్రి వేళల్లో అక్రమంగా ఇసుకను తరలించి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శలున్నాయి.
మన ఇసుక వాహనం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో నడిగడ్డ ఇసుక రీ వద్ద 2536 మంది ధరకాస్తూ చేసుకోగ 1,268 ట్రాక్టర్ల ఇసుకను డెలివరీ చేశారు, మరో 1,261 ట్రాక్టర్ల ఇసుకను తరలించాల్సి ఉంది. వంగూరు మండలం ఉపర గ్రామ శివారులోని ఇసుక రీ వద్ద 1,960 దరఖాస్తులు రాగా 1,126 ట్రాక్టర్ల ఇసుకను సరఫరా చేశారు.
మరో 832 ట్రాక్టర్ల ఇసుకను తరలించాల్సి ఉంది కాగా ఈ రెండు రీ ల నుంచి ప్రజలకు సరఫరా చేసిన ఇసుక ట్రాక్టర్ యజమానులకు సుమారు 80 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. గత రెండు నెలలుగా జిల్లా మైనింగ్ శాఖ అధికారి లేకపోవడంతో ఈ సమస్య ఉత్పన్నమైందని ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారులు గద్వాల మైనింగ్ శాఖ ఏడి వెంకటరమణను నాగర్ కర్నూల్ అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
సరైన సమయంలో ట్రాక్టర్ యజమానులకు బిల్లులు ఇవ్వకపోవడంతో సక్రమ మార్గాన నడిచే ఇసుక రవాణాకు అడ్డుపుల్ల పడుతోందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. వీటితోపాటు జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల వారికి తక్కువ ధరకే ఇసుకను సరఫరా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముల్గర పోతిరెడ్డిపల్లి వంటి ప్రాంతాల్లోనూ ఇసుక రీ లను గుర్తించారు.
కానీ జిల్లా అధికార యంత్రాంగం అంతా ఎస్.ఎల్.బి.సి టన్నెల్లో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. దీంతోపాటు మైనింగ్ శాఖలో ఉద్యోగస్తుల కొరత కారణంగా ఇసుక అక్రమ రవాణాపై నిఘా కొరవడింది. ఇదే అదునుగా భావించే ఇసుక మాఫియా గ్యాంగ్ పెట్రేగిపోయి అడ్డగోలుగా ఫిల్టర్ ఇసుకను తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాష్ర్ట ప్రభుత్వం అక్రమ ఇసుక రవాణాతో పాటు ఫిల్టర్ ఇసుకను నిలువదించాలని కృత నిశ్చయంతో పోలీసు అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానికుల నుంచి పోలీసు అధికారులకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు సైతం అందుతున్నాయి.
కానీ అక్రమ ఇసుక వ్యాపారులు స్థానిక పోలీసులతో కుమ్మక్కు కావడంతో ఫిర్యాదు చేసిన స్థానికుల సమాచారాన్ని ఇసుక మాఫియా గ్యాంగ్ వారి చెవిన పడేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో స్థానికులపై ఇసుక మాఫియా గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మైనర్లతో అక్రమ ఇసుక రవాణా...!
సుమారు 17 నుంచి 18 సంవత్సరాలు కూడా నిండని మైనర్ల చేత అక్రమ ఇసుక రవాణా దారులు రాత్రి పగలు అని తేడా లేకుండా ఇసుక ట్రాక్టర్లను నడిపించడంతో బాల్యం పూర్తిగా అక్రమ మార్గాన్నే పయనిస్తుందని స్థానికులు మండిపడుతున్నారు. అనుభవం లేకపోవడంతో అతివేగంతో ప్రయాణిస్తూ ప్రమాదాలకు కూడా కారకులు అవుతున్నారు.
వారికి మద్యం ఇతర వ్యసనాలను అలవాటు చేస్తూ వారి అక్రమ రవాణాకు మైనర్లను వినియోగిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. దీనిపై మైనింగ్ శాఖ ఆర్‌ఐ నాగ చైతన్యను వివరణ కోరెందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.