calender_icon.png 25 October, 2024 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డిలో ఇసుక పట్లు

29-07-2024 02:26:18 AM

కాంగ్రెస్ సొంత, వలస నేతల పోరు

ఇసుక దందాపై ఆధిపత్యం కోసం ఎత్తులు

పదేండ్లు కోట్లు గడించిన వలస నేతుల

ప్రభుత్వం మారగానే కాంగ్రెస్‌వాళ్ల కన్ను 

అంతలోనే రంగంలోకి నాటి దందాకారులు

క్వారీలపై ఆధిపత్యం కోసం పోటీ

కామారెడ్డి జిల్లాలో ఇసుక తుఫాన్!.. అది రాజకీయంగా వేడి పుట్టిస్తున్నది. మొదటి నుంచీ కాంగ్రెస్‌లో ఉన్న నేతలకు, ఈ మధ్య బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నేతల మధ్య అక్రమ ఇసుకపై ఆధిపత్యం కోసం పోరాటం తీవ్రతరమైంది. జిల్లాలో బీఆర్‌ఎస్ పాలనలో దాదాపు పదేండ్లు అడ్డు అదుపు లేకుండా ఇసుకను మేసిన నేతలు.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మళ్లీ పోటీకి రావటంతో జిల్లాలోని కాంగ్రెస్ సీనియర్లు రగిలిపోతున్నారు.

కామారెడ్డి, జూలై 2౮ (విజయక్రాంతి):  జిల్లాలో పదేండ్లుగా అక్రమ ఇసుక దందా చేస్తున్నవారికి.. దానిపై పూర్తిస్థాయిలో పట్టు ఉన్నది. ఏ అధికారిని ఎలా దారిలోకి తెచ్చుకోవాలి.. ఒక మీటర్ పేరు చెప్పి పది మీటర్ల మేర క్వారీని తవ్వినా ఎలా మేనేజ్ చేయాలి.. ఎవరైనా పోటీకి వస్తే ఎలా అడ్డు తొలగించుకోవాలి.. తమ దందాను అడ్డుకొనేవారిని ఎలా దారికి తేవాలన్నదానిపై వలస నేతలకు మంచి అవగాహన ఉన్నది. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా అక్రమ ఇసుక దందాపై వారి ఆధిపత్యమే కొనసాగుతున్నది.

నిజానికి మంజీరా నది పరీవాహక ప్రాంతంలోని ఇసుక క్వారీలు రాష్ట్రంలో ప్రభుత్వం మారిన వెంటనే కాంగ్రెస్ నాయకుల అధీనంలోకి వచ్చాయి. దీంతో బంగారు బాతులాంటి ఇసుక దందా కోసం పార్టీ మారేందుకు కూడా బీఆర్‌ఎస్ నేతలు వెనుకాడలేదు. దందాలు కాపాడుకొనేందుకే జిల్లాలోని కొందరు బీఆర్‌ఎస్ కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కోట్లు కురిపించే ఇసుక దందా కోసం ఓ నేత 30 ఏళ్ల రాజకీయ జీవితాన్ని తాకట్టుపెట్టి పార్టీ మారారని విమర్శలు వినిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకొనేందుకు ఆ పార్టీ సీనియర్  నాయకుడు షబ్బీర్ అలీ తన బంధువులతో ఇసుక క్వారీలు నడిపించారని ఆ పార్టీ నేతలే చెప్పుకొన్నారు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపే నాలుగు ఇసుక క్వారీలను మంజీరా పరీవాహక ప్రాంతంలోని బిచ్కుంద మండలం హస్గుల్ వద్ద ఏర్పాటు చేసి ప్రతిరోజు వందలాది లారీల్లో ఇసుకను హైదారాబాద్‌కు తరలించారని ఆరోపణలు గుప్పుమన్నాయి. కానీ, ఇటీవల బీఆర్‌ఎస్ నేత పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లటంతో ఈ ఇద్దరు నేతల మధ్య ఇసుకపై ఆధిపత్యం మొదలైందని జిల్లావాసులు చెప్పుకొంటున్నారు.

మళ్లీ ఇసుక టెండర్లకు ఆదేశాలు

ఉమ్మడి జిల్లాలోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మకై నదిలో నీటి ప్రవాహం తగ్గిన తరువాత కొత్తగా ఇసుక క్వారీలను ప్రారంభించేందుకు ఎత్తుగడలు వేశారనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. అధికారులు మాత్రం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే నిబంధనలకు విరుద్ధంగా వ్యవ హరిస్తున్న క్వారీలను రద్దు చేసినట్లు విజయక్రాంతి తో తెలిపారు. రాష్ట్ర మైనింగ్‌శాఖ అధికారుల ఆదేశాల మేరకే కొత్త టెండర్లు త్వరలో పిలువనున్నట్లు వెల్లడించారు. ఇసుక క్వారీల రగడ జిల్లాలో సీనియర్ నేతలైన షబ్బీర్ అలీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డి మధ్య చిచ్చు రేపుతున్నది. అయితే, వీరిమధ్య సయో ధ్య కుదిర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. తమ దందాలోకి మూడోపక్షాన్ని రానీయకుండా వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది.   

పర్మిట్లు ఒక రకం.. రవాణా మరోరకం

ఇసుక క్వారీల నుంచి పర్మిట్లు తీసుకొని ఇసుకను తరలించాల్సి ఉంటుంది. కానీ, జిల్లాలో నేతల కనుసన్నల్లో నడిచే ముఠాలు పర్మిట్ ఒకటి తీసుకొని పది లారీలవరకు అదే పర్మిట్‌పై ఇసుక రవాణా కొనసాగించాయి. గత పదేండ్లుగా అదే తంతు నడిచింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తన అనుచరులతో ఇసుక క్వారీలను టెండర్లలో దక్కించుకున్నారు. ఇది గత పదేండ్లుగా దందా సాగించిన నాయకులకు మింగుడు పడలేదు. ఎలాగైనా ఇసుక క్వారీలను అడ్డుకోవాలని పథకం వేసి గ్రామస్తులను, యువకులను రెచ్చగొట్టి ఓవర్‌లోడ్‌తో వెళ్తున్న ఇసుక లారీలను అడ్డుకున్నారు. రోజూ ఏదోవిధంగా అవాంతరాలు సృష్టించారు.

ఇసుక అక్రమ దందాలో వీరు చెయ్యి తిరిగిన నిపుణులు కావటంతో ప్రస్తుతం దందా చేస్తున్నవారిపై యువకులతో, గ్రామస్తులతో ఫిర్యాదులు చేయించారు. జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర మైనింగ్ శాఖ ఉన్నత అధికారులకు పూర్తి ఆధారాలతో ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయంపై రాష్ట్ర అధికారులు విచారణకు ఆదేశించారు. స్థానిక మైనింగ్ అధికారులతో పాటు రాష్ట్ర స్థాయి బృందం ఇసుక క్వారీలను సందర్శించి కొలతలు తీసుకొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక సరఫరా చేశారని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. దీంతో కామారెడ్డి జిల్లాలోని హస్గుల్, బిచ్కుంద పరిధిలోని నాలుగు ఇసుక క్వారీలను సీజ్ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోని పాత, వలస నేతల మధ్య మనస్పర్ధలు తారస్థాయి చేరాయని సమాచారం.

కాంట్రాక్టర్లపై చర్యలు

కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్న కాంట్రాక్టర్లను అధికారులు బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు. కేఎస్‌ఆర్ కన్‌ట్రక్షన్, మెసర్స్ ఎంఎస్‌ఆర్ ప్రాజెక్ట్ అండ్ మినరల్స్, మెస్సర్స్ సుధాకర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, మెసర్ సాయి, డాగ్స్ ఇంజినీర్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌తో పాటు పట్టదారులైన పర్జానా బేగం, అబ్దుల్ కలీంలకు సంబంధించిన ఈఎండీలు, బ్యాంక్ గ్యారెంటీల మెత్తాన్ని పీజీఎండీసీ అగ్రిమెంట్ నిబంధనలు అతిక్రమిచిన కారణంగా జప్తు చేసినట్లు టీజీఎండీసీ అధికారి రాంప్రసాద్ తెలిపారు. ఐదుగురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇసుక క్వారీలను సీజ్ చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు చేసుకున్న అగ్రిమెంట్లను కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. హస్గుల్, బిచ్కుంద ఇసుక క్వారీలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకే టెండర్లు

కామారెడ్డి జిల్లాలోని మంజీరా పరీవాహక ప్రాంతంలో నాలుగు ఇసుక క్వారీలను టెండర్లు వేసి దక్కించుకున్న వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో క్వారీలను సీజ్ చేశాం. కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాం. ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు ఇసుక క్వారీలను సీజ్ చేశాం. ఇప్పటివరకు చేసుకున్న అగ్రిమెంట్లను కూడా రద్దు చేశాం.ప్రభుత్వ ఆదేశాల మేరకు కొత్త టెండర్లు త్వరలో నిర్వహిస్తాం.

 రాంప్రసాద్, 

టీజీఎండీసీ అధికారి, కామారెడ్డి