calender_icon.png 15 January, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంట పొలాల్లో ఇసుక మేటలు

06-09-2024 01:49:42 AM

  1. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 68,345 ఎకరాల్లో పంట నష్టం 
  2. నష్టం విలువ రూ.150 కోట్ల పైనే 
  3. ఆందోళనలో అన్నదాతలు

ఖమ్మం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): ఇటీవల కురిసిన వర్షాలకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లాయి. దీంతో అన్నదాతలు కన్నీరుము న్నీరవుతున్నారు. వరి, పత్తి, మిర్చి లాంటి అనేక పంటలు వరదపాలయ్యాయి. జిల్లా లో 68,345 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమికం గా అంచనా వేశారు. దీని విలువ రూ.150 కోట్లకు పైగానే ఉంటుందని పేర్కొంటున్నారు. చాలా ప్రాంతాలు ఇంకా వరద ముంపులోనే ఉండడం వల్ల పంట నష్టం లెక్కింపు ఇంకా పూర్తి కాలేదు.

ప్రభుత్వాధికారుల అంచనాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షల ఎకరాల్లో పంట  నష్టం జరగ్గా అత్యధికంగా ఖమ్మం జిల్లాలోనే 68,345 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఆ తర్వాత సూర్యాపేట జిల్లాలో 34,149 ఎకరాల్లో, మహబాబాబాద్‌లో 25,275 ఎకరాల్లో పంట వరద పాలైంది. పంట పొలాలు ఇంకా వరద నీటి ముంపులోనే ఉండడం వల్ల తెగుళ్లు సోకుతాయోమోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 50 చెరువులకు పైగా గండ్లు పడ్డాయి. సత్తుపల్లి, కల్లూరు, మధిర డివిజన్లలో దాదాపు 42 చెరువులు తెగిపోయాయి. ఫలితంగా వేలాది ఎకరాల్లో పంట ముంపునకు గురై, రైతులకు వేదన మిగిలింది.

ప్రతీ రైతును ఆదుకుంటాం  మంత్రి తుమ్మల 

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. గురువారం ఆయన మధిర, ఎర్రుపాలెం మండలాల్లో పర్యటించి.. నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. మధిర మండలం చిలుకూరు, ఎర్రుపాలెం మండలం మీనవోలు, జిలుగుమాడు, మామునూరు, పెద్దగోపవరం తదితర గ్రామాల్లో పర్యటించారు. తుమ్మల మాట్లాడుతూ రైతులు అధైర్యపడొద్దని ప్రభుత్వం రైతులకు దన్నుగా ఉంటుందన్నారు.త్వరలో కేంద్ర బృందం కూడా పరిశీలనకు వస్తోందన్నారు. రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్, రైతు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.