10-02-2025 01:32:59 AM
* పేరుకే చెక్ పోస్ట్
* తనిఖీలు ఒకవైపు రవాణా మరోవైపు
* ఒక్కో వెహికల్‌కు రేటు సపరేటు
* తమ పరిధి కాదంటూ అక్రమార్కులకు అండగా ఖాకీలు
కామారెడ్డి, ఫిబ్రవరి 9 (విజయ క్రాంతి): మంజీరా నది నుంచి అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదు. రాత్రి వేళల్లో ఏదేచ్ఛగా నది నుంచి ఇసుకను తీసుకొని సమీప గ్రామాలలో డబ్బులు చేస్తున్నారు. ఉదయం నుంచి టిప్పర్రు ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద డోంగ్లి బీర్కూరు కోటగిరి పోతంగల్ మండలాల పరిధిలోని గ్రామాలలో ఆక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుంది.
కామారెడ్డి జిల్లా లోని బిచ్కుంద, బీర్కూరు, పోతంగల్, కోటగిరి ,పోలీసుల తీరు రోజురోజుకు వివాదాస్పదంగా మారుతుంది. ప్రజల కోసం పనిచేయాల్సిన పోలీసులు అక్రమార్కుల గుప్పెట్లో కీలుబొమ్మలుగా మారారనే పుకార్లు గట్టిగానే వినిపిస్తున్నాయి. మంజీరా పరిహారక ప్రాంతాల నుండి అక్రమ ఇసుక రవాణా చేస్తున్న అక్రమార్కులకు పోలీస్ శాఖలో కొందరు అధికారులు అక్రమ ఇసుక రవాణాకు అండగా నిలిచి ఇబ్బంది లేకుండా ముందస్తు సమాచారం ఇస్తూ తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బహిరంగంగా గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
అందుకు నిదర్శనంగా పోలీస్ స్టేషన్ ముందు నుంచి అక్రమ ఇసుక రవాణా తరలిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవాల్సిన పోలీసులె సదరు ట్రాక్టర్లను యజమానితో కుమ్మక్కై వదిలేయడం పై పోలీసులు ఇసుక మాఫియా అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారని విషయం బహిర్గతమైంది. తమ పరిధి కాదంటూనే ఇసుక మాఫియాను తమ గుప్పెట్లో పెట్టుకున్నారని ఆరోపణ వినిపిస్తున్నాయి.
మంజీరా పరివాహక ప్రాంతాలైన పుల్కల్, డోన్లి, సిర్పూర్, బీర్కూర్, కొడిచెర్ల, కారేగం , హంగర్గా గ్రామాల నుండి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని విషయం పోలీసులకు తెలిసినప్పటికీ ఒక గ్రామంలో రవాణా జరిగితే మరొక గ్రామం లో పెట్రోలింగ్ చేస్తూ ఇసుక మాఫియా దార్లకు సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి అయిందంటే ఇసుక ట్రాక్టర్లు ,టిప్పర్లు చెక్ పోస్టుల మీదుగా సరిహద్దులు దాటుతున్న టిప్పర్ కు ఒక రేటు, ట్రాక్టర్కు ఇంత అని వసూలు చేస్తూ గట్టిగానే దండుకుంటునారని ఆరోపణలో వినిపిస్తున్నాయి.
బాన్సువాడ డివిజన్ సబ్ కలెక్టర్ కిరణ్మయి, బోధన్ డివిజన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ టీం లను ఏర్పాటు చేసిన ఫలితం శూన్యంగానే మిగిలింది. రాత్రి సమయాలలో పోతంగల్ నుండి అక్రమ డంపులు చేసిన ఇసుకను టిప్పర్లు, ద్వారా డబ్బులు చేసి లారీలలో టిప్పర్లలో ఇసుక ను అక్రమంగా రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారుల ముందు నుండి తరలిస్తున్న పట్టుకోవాల్సిన వారే పచ్చ జెండా ఊపుతున్నారు అనే విమర్శలు వస్తున్నాయి.
ఇసుక అక్రమ రవాణా విషయం అధికారుల స్థాయిని బట్టి ఎవ్వరికీ ఎప్పుడు మామూలు అందాలో అందడం వలననే అక్రమ రవాణాను చూసి చూడనట్లు ఉన్నారనే వాదనలు లేకపోలేదు. మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి నదిలోనే ఇసుకను తరలించేందుకు తాత్కాలిక రోడ్డును సైతం వేసుకున్నారు. రాత్రి వేళలో తాత్కాలిక రోడ్డు నుంచి టిప్పర్ల ద్వారా ఇసుకను మంజీర నది నుంచి తరలించి సమీప గ్రామాలలో ఇసుక డంపులు చేస్తున్నారు.
యదేచ్చగా ఇసుకను ఇసుక మాఫియా తరలించుకు పోతున్నారు. ఒక టిప్పర్ ఇసుక 50 వేల నుంచి 60 వేల వరకు అమ్ముతున్నారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర కర్ణాటక హైదరాబాద్ నగరాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక మాఫియా కు అధికార పార్టీ నేతల అండదండలతో పాటు రెవిన్యూ పోలీస్ యంత్రాంగం అండదండలు ఉండడంవల్లే అక్రమ ఇసుక దందాను కొనసాగిస్తున్నారు. సబ్ కలెక్టర్ లా మాటలను సైతం పెడచెవిన పెట్టి ఆక్రమ ఇసుక దందాకు అధికారులు సహకరిస్తున్నారు.