09-02-2025 01:16:04 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఇసుక దందా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గోదావరి పరీవాహక ప్రాంతంలో మాఫీయా రెచ్చిపోతున్న ఉందాంతాలను నిత్యం చూస్తూనే ఉన్నాం. తాజాగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసిన లేఖ ఆ వార్తలకు బలం చేకూరుస్తోంది.
ఇటీవల నిర్వహించిన ఇసుక డంపింగ్ టెండర్లతో పాటు వాటిని దక్కించుకున్న కాంట్రాక్టర్లు అవకతవకలకు పాల్పడుతున్నారని అసోసియేషన్ ఆరోపించింది. దీని ద్వారా ప్రభుత్వానికి రోజుకు రూ.2.30 కోట్ల నష్టం వాటిల్లుతోందని లేఖలో పేర్కొంది. ఇసుకను తరలించే ప్రతి లారీ జీజీఎండీసీ సైట్‌లో బుక్ చేసుకొని, ఆ తర్వాత క్వారీల్లోకి వెళ్తుంది.
క్వారీల్లో కాంట్రాక్టర్‌కు చెందిన మనుషులు ఒక్కో లారీ నుంచి రూ.2,500 వసూలు చేస్తున్నారని ఆరోపించారు. వాస్తవానికి 14 చక్రాల లారీలో 32 టన్నులు, 16 చక్రాల లారీలో 35 టన్నుల ఇసుకను నింపాల్సి ఉంటుంది. కానీ కాంట్రాక్టర్ల మనుషులు అదనంగా రూ.12 వేలు తీసుకొని ఒక్కో లారీలో 28 టన్నుల నుంచి 30 టన్నుల వరకు ఓవర్ లోడ్ చేస్తున్నారని ఆ లేఖలో వివరించారు.
లారీ డ్రైవర్లు తమకు ఓవర్ లోడ్ వద్దని అంటే.. ఆ లారీల్లో ఇసుక లోడింగ్ చేయట్లేదని పేర్కొన్నారు. ఇలా ఓవర్ లోడింగ్ చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని చెప్పారు. ఇసుక పాలసీ మార్చేసి రవాణా వ్యవస్థను పెద్ద కాంట్రాక్టర్లకు అప్పజెస్పే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని కోరారు. ఒకవేళ, అలా చేస్తే లక్షల కుటుంబాలు రోడ్డున పడుతాయని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.