calender_icon.png 1 January, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోవులకూ అభయారణ్యాలు ఏర్పాటు చేయాలి

16-09-2024 12:59:47 AM

గో భక్తుల ఆత్మీయ సమ్మేళనంలో భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 15 (విజయక్రాంతి): దేశంలో గోవులకూ అభయార ణ్యాలు ఏర్పాటు చేయాలని, ఈ అంశాన్ని కేంద్రం ప్రకటించినప్పటికీ అమల్లోకి రాలేదని భువనేశ్వరి పీఠాధిపతి కమలానంద భారతి స్వామీజీ అన్నారు. ప్రస్తుత సమాజంలో గోవులపై అవగాహన, చైతన్యం పెరిగిందని తెలిపారు. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 27న కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు జరగనున్న గో మహాపాదయాత్ర సందర్భంగా కాచిగూడ శ్యాంమందిరంలో ఆదివారం గోభక్తు ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమలానంద భారతి స్వామీజీ, విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం పాల్గొన్నారు.

కమలానంద భారతి మాట్లాడుతూ.. ఆధునిక సమాజంలో వేదం చదువుకున్నవాళ్లే గోసేవ చేస్తున్నారన్నారని తెలిపారు. గో మహాపాదయాత్ర చేపట్టనున్న బాలకృష్ణ గురుస్వామి బృందంతో గోమాతను రక్షిద్దాం. భూమాతను రక్షిద్దాం. ప్రకృతిని రక్షిద్దాం. మానవజాతిని రక్షిద్దాం అని ప్రతిజ్ఞ చేయించారు. విజయక్రాంతి చైర్మన్ సీఎల్ రాజం మాట్లాడుతూ.. గోవుల పరిరక్షణకు గో మహాపాదయాత్రకు సాహసించిన బాలకృష్ణ బృందాన్ని అభినందించారు. 14 రాష్ట్రాలలో ఆర్నెల్లపాటు యాత్ర సాగుతుందని, వీరి బృందంలో గోవు కూడా ఉండటం గొప్ప విషయమన్నారు.

ఈ యాత్రతోనైనా ప్రజల్లో గోవు ల పట్ల అవగాహన పెరగాలని ఆకాంక్షించారు. ఈ నెల 20న బషీర్‌బాగ్ అమ్మవారి ఆయలం నుంచి కశ్మీర్‌కు బయలుదేరుతామని బాలకృష్ణ చెప్పారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్షేత్ర గోసేవా సంయోజక్ ఆకుతోట రామారావు, వీర ధర్మజ స్వామీజీ, గోరక్ష దక్షిణ భారత విభాగం అధ్యక్షులు యాదగిరిరావు, లవ్ ఫర్ కౌ ఫౌండేషన్ అధ్యక్షులు జస్వంత్‌బాయ్ పటేల్, ప్రకృతి వ్యవసాయ నిపుణులు విజయరామ్ పాల్గొన్నారు.