రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ఫిబ్రవరికి వరకు ఆసుపత్రిని, సిబ్బంది క్వార్టర్లను సిద్ధం చేయాలి
ఆందోల్: జిల్లాలో అసంపూర్తిగా ఉన్నా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయడానికి సిబ్బంది క్వార్టర్ల నిర్మాణానికి రూ. 11.50 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ అన్నారు. పునాదుల స్థాయిలో అసంపూర్తిగా నిలిచిపోయిన కమ్యూనిటీ ఆసుపత్రి భవనం వచ్చే నెల ఫిబ్రవరిలో అందుబాటులోకి రావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆదివారం వట్పల్లిలో ఏర్పాటు చేసిన 30 పడకల ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
మంజూరు చేసిన నిధులతో ఆస్పత్రి భవనంతో పాటు, రోగులు సిబ్బంది విశ్రాంతి భవనాలు నిర్మాణం జరిగేలా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వట్పల్లి కమ్యూనిటీ ఆసుపత్రిలో 30 పడకలతో పాటు ఐదు పడకల డయాలసిస్ కేంద్రం కూడా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కమ్యూనిటీ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలోని వట్పల్లి, అల్లాదుర్గం, రాయికోడ్, రెగోడ్, న్యాల్కల్, తదితర మండలాలలో వైద్య సేవలు మెరుగుపడనున్నట్లు మంత్రి తెలిపారు. నాణ్యతతో కూడిన నిర్మాణం పనులు వేగవంతంగా పూర్తి అయ్యేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి అధికారులను ఆదేశించారు.