భద్రాద్రి కొత్తగూడెం: సీతారామ ప్రాజెక్టు నుంచి వచ్చే నీటి వాటాను స్పష్టంగా తెలియజేయాలని సంయుక్త కిసాన్ మోర్ఛ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కొత్తగూడెంలోని మంచి కంటి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రూ 18,600 కోట్లతో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టును గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రాజెక్టుకు కేటాయించిన నిధుల్లో ఇప్పటి వరకు 8600 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఇంక రూ.10 వేల కోట్ల ఖర్చు చేయాల్సి ఉందన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు.
మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు వారి స్వార్థం కోసం జిల్లాకు రావలసిన ప్రాజెక్టు నీటి వాటాను పక్కన పెట్టి గోదావరి వరదలతో వచ్చిన నీటితో, సాగర్ గణాలకు లింకు చేయటం జిల్లా ప్రజలను ముమ్మాటికీ మోసం చేయటమే అని ఆరోపించారు. జిల్లాలో జన్మించి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం సాధించిన మంత్రులు జిల్లా ప్రజలను ఇలా మోసం చేయటం సరైనది కాదని ధ్వజమెత్తారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు కూడా నత్తనడకన సాగుతుందని, పూర్తి కావడానికి కనీసం ఇంకా రెండు సంవత్సరాల వ్యవధి పడుతుందన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పూర్తి కాకుండా, 250 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించకుండా సీతారామ ప్రాజెక్ట్ నుంచి సాగునీరు సరఫర చేయడం అసాధ్యమన్నారు.