ఆచార్య మసన చెన్నప్ప :
అది 1971వ సంవత్సరం. డిప్‌ఓఎల్ చదవడానికి ‘ఆంధ్ర సారస్వత పరిషత్తు’కు వచ్చాను. పరిషత్తు వారి విశారద పూర్వోత్తర భాగాల్లో ఉత్తీర్ణుడనైనందున డిప్‌ఓఎల్‌లో చేరడానికి అవకాశం లభించింది. నేను పరిషత్తులో అడుగిడిన తర్వాత నేరుగా ప్రిన్సిపాల్ గది ముందుకు వచ్చాను మా పెద్దన్నతో. స్ఫురద్రూపి, ఎత్తయిన మనిషి, జ్ఞాన విజ్ఞానాలు మూర్తీభవించిన కె.కె.రంగనాథా చార్యులు (కేకేఆర్) మమ్మల్ని ఆహ్వానించారు.
విశారద అర్హతతో డిప్‌ఓఎల్‌లో చేరడానికి అనుమతిస్తూ, “పరిషత్తుపై అం తస్తులో క్లాసులు జరుగుతున్నాయి. మీరు వెళ్లి కూర్చోవచ్చు” అన్నారు. దరఖాస్తు ఫారం పూర్తి చేయక ముందే వెంటనే నాకు ప్రవేశం కల్పించారు ఆయన. సంతోషంగా క్లాసు రూపంలోకి ప్రవేశించాను.
తరగతి గదిలో సుమారు 70 మంది విద్యార్థులు ఉన్నారు. నాకంటే వయసు పైబడిన వారూ ఉన్నారు. అప్పుడు క్లాసు తీసుకుంటున్నది దివాకర్ల వారి కూతురు గాయత్రీ దేవి. అనుమతి తీసుకుని లోపలికి వెళ్లి, క్లాసంతా విన్నాను. ఆ తర్వాత పెరవ లింగయ్య శాస్త్రి, తిరుమలరావు వారల క్లాసులుకూడా విన్నాను.
మొదటి రోజు ఎంతో తృప్తిగా గడిచింది. సంతోషంగా ప్రిన్సిపాల్ గదికి వచ్చి దరఖాస్తు ఫారం పూర్తి చేసి, వారి ఆశీర్వా దం పొందాను. విశారద పరీక్షల సందర్భంలో కేకేఆర్‌ను ముఖ్యపరీక్షల నిర్వహ ణాధికారిగా చూసినట్లు జ్ఞాపకం ఉంది. ఆ రూపాన్ని మనసులో పెట్టుకున్న నేను వారు ప్రిన్సిపాల్‌గా ఉన్న పరిషత్తు ప్రాచ్య కళాశాలలో విద్యార్థిగా చేరడం పూర్వజన్మ సుకృతంగా భావించాను.
కేకేఆర్ దరఖాస్తు ఫారం పూర్తి చేస్తున్న సందర్భంగా “క్లాస్ ఎలా ఉంది” అని అడిగారు నన్ను. నేను “బాగుంద”న్నాను. ఒక గురువు క్లాస్ చెప్పడమేగాక ఎలా ఉందని అడగడం ఆశ్చర్యం అనిపించింది. విద్యార్థుల భవిష్యత్తును ఆకాంక్షించే గురువులు పాఠం చెప్పిన తర్వాత మూల్యాంకనం చేయడం సముచితమేమో అనిపించింది. అన్ని క్లాసులకు నేను తప్పకుండా హాజరయ్యేవాణ్ణి.
మూ డు రోజుల తర్వాత క్లాసులో ఒక సంఘటన జరిగింది. అది గాయత్రీ దేవి మేడ మ్ క్లాసు. ‘జైమినీ భారతం’ చెబుతూ, ‘సంత్రాసం’ అనే పదానికి ఆమె ‘సంతోషం’ అనే అర్థం చెప్పారు. సందర్భాన్నిబట్టి కూడా దానికి ‘భయం’ అనే అర్థం రావడం వల్ల నేను నిలబడి, వారు చెప్పిన అర్థాన్ని “కాద”న్నాను. ఆమె, ఏమీ అనలేక, “ఇద్దరిదీ కరెక్టే” అన్నారు.
విద్యార్థు లలో వెనుక బెంచిలో కూర్చున్న వారెవరో, “మీ ఇద్దరిలో ఎవరిది కరెక్ట్?” అం టూ గట్టిగా అరిచారు. అంతే, గాయం త్రీ దేవి క్లాసు ఆపి బయటికి వెళ్లిపోయారు. నేను ఖంగు తిన్నాను. నా ప్రవేశం దెబ్బ తింటుందేమోనని భయపడ్డాను. అయితే, తోటి విద్యార్థులు నేనిచ్చిన అర్థా న్నే సమర్థించారు. అప్పటికి రెండు రోజులైంది. ‘ఇక, గాయత్రీ దేవి క్లాసులు తీసుకోరని, రిజైన్ చేసి వెళ్లిపోయారని’ తెలిసింది.
దాంతో నాలో భయం హెచ్చింది. ఒకరోజు కేకేఆర్ నన్ను ‘తమ గదికి రమ్మని’ పిలిచారు. నాకు భయమేసింది, ‘నేనేమైనా అనుచితంగా వ్యవహరించానా!’ ఏమని. లోపలికి వచ్చిన తర్వాత “జరిగింది చెప్ప”మన్నారు. అంతా విన్న తర్వాత “చదువు లో ఇదే శ్రద్ధను కొనసాగించండి” అని ధైర్యం చెప్పి పంపించారు. విద్యార్థుల పట్ల రంగనాథాచార్యుల వారికి ఉన్న ప్రేమకు, వారి చదువులపట్లగల శ్రద్ధకు ఈ సంఘటన ఒక ఉదాహరణగా నిలుస్తుంది.
కేకేఆర్‌లో నేనొక గొప్ప ఆచార్యుణ్ణి చూశాను. ప్రాచ్య పాశ్చాత్య విద్యలను అధ్యయనం చేసిన ఒక పండితుడాయన. వారు డిప్‌ఓఎల్‌లో సాహిత్య చరిత్రతోపాటు భాషాశాస్త్రాన్నీ బోధించేవారు. వారు అప్పుడు వేసిన పునాది విశ్వవిద్యాలయంలో అధ్యాపకత్వం చేస్తున్న సంద ర్బంలో నాకెంతగానో తోడ్పడింది. వారి పాఠం ఒక్కసారి వింటే చాలనిపించేది.
పూర్వాపరాల సమన్వయంతో, ప్రాక్పశ్చిమాల దృక్పథాలతో సులభంగా, సుకుమా రంగా వారి పాఠాలు సాగేవి. నాకు తెలిసినంత వరకు, అప్పటికి సాహి త్య చరిత్ర యుగ విభజనకు సంబంధించినంత వర కు వారి అనుశీలనం ఆమోదయోగ్యమైం ది. వారిది సాహిత్యంలో మరోచూపు. కేవలం పాఠం చెప్పి విద్యార్థులను సమ్మోహనం చేయడమేగాక కొత్తగా సాహిత్యాన్ని సృష్టించగలిగిన నేర్పును ఆయన మాలో కలిగించారు.
“విషయం కఠినమైనా, భాష సులభంగా ఉండాలి. కవి ఆత్మీయతకు ప్రాధాన్యం ఇవ్వాలి. సాహిత్యంలో కొత్త పాతల మేలు కలయికను గుర్తించడమే కాక సమజానికి దాని రుచి చూపించాలి” అన్న వారి మాటలు నేటికీ నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంటా యి. రంగనాథాచార్యుల వారు ప్రిన్సిపల్ అయినప్పటికీ ఆ స్థాయికి గొప్ప గౌరవం కలిగిస్తూనే మా విద్యార్థులతో కలిసి పోయేవారు.
ఎంత గొప్ప గురువైనా విద్యార్థుల మీద ప్రభావాన్ని చూపకపోతే, అతని గురుత్వానికి అర్థం లేదనే విషయాన్ని ఆయనను చూసే నేర్చుకున్నాను. కళాశాల నుంచి విహారయాత్రలకు వెళ్లేటప్పుడు వారు కూడా తోడుగా వచ్చి విహారయాత్రను విజ్ఞానయాత్రగా మలచేవారు. అజంతా, ఎల్లోరా, హంపీ, విజయనగరం మొదలైన ప్రదేశాలకు వారు తోడుగా విద్యార్థులతో కలిసి వెళ్లాను. వారి ఆలోచనలు, అలవాట్లు, సాహిత్య దృక్పథం అన్నీ మానవాభ్యుదయానికి దోహదం చేసేవే.
విద్యార్థులకు కల్పవృక్షం
“తల్లి గర్భస్థ శిశువును ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో అంత జాగ్రత్తగా గురు వు శిష్యులను చూసుకోవాలి” అని అధర్వ వేదంలోని ‘బ్రహ్మచర్య’ సూక్తం చెప్తుంది. రంగనాథాచార్యులు మా విద్యార్థులకు కల్పవృక్షం వంటివారు. వారి అధ్యాపనంలో కృతార్థులైన వారు వేలమంది ఉన్నారు. ‘సారస్వత పరిషత్తు’ కళాశాలకు వారు మణిదీపం లాంటివారు.
నేను 1971 మొదలుకొని 1977 దాకా ఏడేండ్లు వారి పాఠాలు విన్నాను. వారి ప్రభావం, అధ్యాపకులమైన తర్వాత మా మీద ఎంతగానో పనిచేసింది. ఆడంబరాలకు, అర్థం పర్థం లేని ప్రసంగాలకు వారెన్నడూ తావిచ్చిన వారు కాదు. మౌఢ్యం లేని ప్రబోధం వారిది.
ప్రతి రెండ వ శనివారం సారస్వత వేదిక ఆధ్వర్యంలో పరిషత్తులో వివిధాంశాలమీద ప్రసంగాలు, కవి సమ్మేళనాలు జరిగేవి. నేను తప్పక పాల్గొనే వాణ్ణి. ఒకసారి చేకూరి రామారావు ‘విమర్శ’మీద ప్రసగించారు. నేనం తా విని కవి సమ్మేళనంలో ఒక పద్యం వినిపించాను.
మస్తకంబు వెట్టి పుస్తకంబు చదివి
సద్విమర్శ చేయు సరసులేరి?
తెలుగులో విమర్శ తెల్లారినట్లుంది
రమ్యగుణసనాథ రంగనాథ!
కొందరికి చెప్పాలనుకున్నది చెప్పక, చెప్పరాదని అనుకున్నది చెప్పే అలవాటు ఉంటుంది. కాని, రంగనాథాచార్యులు అలా కాదు. వారేం చెప్పాలను కుంటారో సూటిగా అర్థమయ్యే విధంగా చెప్పేవారు. “నా పేరుతో శతకం రాయాలనుకుంటున్నావా? ఆ పని చేయకు!” అన్న మాటలు నాకిప్పటికీ గుర్తున్నాయి. అయినా, వారి మకుటంతో 20 పద్యాల దాకా అప్పుడే రాసి ఊరుకున్నాను.
40 గ్రంథాల రచయితనైనప్పటికీ ఇప్పటికీ శతకం పూర్తి చేయ గలిగాను. వారు భూమిమీద లేరు కాబట్టి, వారి స్మృతికి అంకితంగా రాస్తే బాగుండునని అనిపించింది. గుర్వాజ్ఞను ధిక్కరించిన వాడినవుతానేమోననే భయం కలిగినా, ధైర్యంతో ఈ శతకం రాశాను. రంగనాథాచార్యులు మాకు గురువు కావడం వల్లనే తెలుగు సాహిత్యానికి చెం దిన కావ్యాలు, కథా సంపుటులు, విమర్శన గ్రంథాలు, నవలలు చదివిన వాడినయ్యా ను.
‘కన్యాశుల్కం’ నాటకం మీద మాట్లాడితే వారే మాట్లాడాలని అనిపిస్తుం ది. ‘విజయ విలాసాని’కి తాపీ వారు రాసిన ‘హృదయో ల్లాస’ను వారు బాగా మెచ్చుకునేవారు. చలం సాహిత్యాన్ని అభిమానించినప్పటికీ విశ్వనాథ వారి ‘కడిమిచెట్టు’, ‘ఏకవీర’ నవలలను ఇష్టపడేవారు. వేటూరి వారి సాహిత్యాన్ని సంపూర్ణంగా నా చేత చదివించారు. కవికి, కవితా రచనకు గల సంబం ధాన్ని పసిగట్టగల విమర్శనా శక్తి ఆయన వల్లనే మా విద్యార్థులకు అబ్బింది.
ద్రావిడ భాషల పరిచయంతోపాటు భాషాశాస్త్ర పరిజ్ఞానం వారివల్లే కలిగింది. కవి దృక్పథాన్ని, అతడు సృష్టించిన కవి త్వం ద్వారా అంచనా వేయగలిగిన సామ ర్థ్యం నాకు ఆయన ద్వారానే లభించింది. మార్క్సిజమంటే ప్రాణం. ‘సమాజం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వచ్చే మార్పు ఏదైతే ఉందో, అది ఆరోగ్యకరంగా ఉండా లి. అభ్యుదయాత్మకంగా ఉండాలి’ అన్నదే రంగానాథాచార్యుల ఆశయం. ఒక అధ్యాపకునిగా, విమర్శకునిగా, భాషాశాస్త్రవేత్తగా, పరిపాలనా దక్షుడిగా, ఆత్మీయ గురువుగా రంగనాథా చార్యుల వారు నామీద అనితర సామాన్యమైన ప్రభావాన్నే చూపారు.
వ్యాసకర్త సెల్: 9885654381