20-03-2025 06:10:21 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పాత జిఎం కాలనీకి చెందిన కారంపూడి శ్రీనివాస రాజు, కృష్ణవేణి దంపతుల కుమార్తె సంహితరాజ్ తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో ప్రతిభ చూపి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఎక్స్టెన్షన్ గ్రేడ్ 1 ఆఫీసర్ గా ఎంపికయ్యారు. బుధవారం విడుదలైన ఫలితాలలో రాష్ట్రవ్యాప్తంగా 21వ ర్యాంకు, జోనల్ స్థాయిలో 4వ ర్యాంకు సాధించడం సాధించింది. గత ఏడాది నవంబర్ లో వెలువడిన గ్రూప్ 4 ఫలితాలలో జూనియర్ అసిస్టెంట్ గా ఎంపికై ప్రస్తుతం బెల్లంపల్లిలోని మైనారిటీ సంక్షేమశాఖ రెసిడెన్షియల్ కాలేజిలో విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో తాను మూడేళ్ల పాటు రోజూ పదిగంటల పాటు పుస్తకాలు చదివానని ఆమె తెలిపారు. కష్టానికి తగిన ఫలితం దక్కిందని హర్హం వ్యక్తం చేశారు. ఈమె తల్లి ప్రభుత్వ అధ్యాపకురాలిగా బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. అలాగే తండ్రి బెల్లంపల్లి శాంతిఖని గనిలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈమె సోదరుడు కూడా గత ఏడాది డిసెంబర్ లో మేనేజ్మెంట్ ట్రైనీ (అండర్ మేనేజర్) గా ఎంపికై శ్రీరాంపూర్ లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇంట్లోని కుటుంబ సభ్యులందరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడం గమనార్హం.