calender_icon.png 3 October, 2024 | 2:42 PM

మాల్ బస్టాండ్‌కు మోక్షం!

02-10-2024 02:23:16 AM

  1. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు కదిలిన అధికారగణం
  2. నిరుపయోగంగా ఉన్న ఆర్టీసీ పాతబస్టాండ్ పరిశీలన
  3. దసరాలోపు అందుబాటులోకి..

యాచారం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా యాచారం మం డలం మాల్ పట్టణవాసులు ఎన్నో సంవత్సరాల నుంచి నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ పునరుద్ధరణ పనుల్లో కదలిక వచ్చింది. ఎమ్మెల్యే మల్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో డీఎం, అధికారులు ఇటీవల బస్టాం డ్ పునఃనిర్మాణానికి సంబంధించి మాల్‌ను సందర్శించారు.

గతంలో మాల్ తొలి గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన లిక్కి జంగారెడ్డి.. 30 ఏళ్ల క్రితం గ్రామంలో 808 సర్వే నంబర్లో ఒక ఎకరా భూమిని ఆర్టీసీ బస్టాండ్ కోసం కేటాయించారు. అప్పట్లో సుమారు 5 లక్షల రూపాయలతో దాతల సహాయం తో బస్టాండ్‌ను నిర్మించగా కొద్ది రోజులకే బస్టాండ్ నిరుపయోగంగా మారింది. దీంతో అది మందుబాబులకు, అసాంఘీక కార్యక్రమాలకు అడ్డాగా మారిం ది.

ఆర్టీసీ బస్సులను మాల్ ప్రధానరోడ్డులోని నల్లవెల్లి చౌరస్తా వద్ద ఆపుతుండటంతో ప్రయాణికులు అక్కడినుంచే రాకపోకలు సాగిస్తున్నారు. అయితే అక్కడ కనీసం బస్ షెల్టర్ కూడా లేకపోవడంతో బస్సుల కోసం వేచిఉండే ప్రయాణికులు ఎండకు ఎండి, వానకు తడిచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. చౌరస్తా కావడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.

ఈ క్రమంలో మాల్ పట్టణవాసుల ఇబ్బందులను మాజీ సర్పంచ్ లిక్కి జంగారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దొంతమోని సత్యనారాయణ గౌడ్ ఇటీవల ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి వివరించడంతో.. ఎమ్మెల్యే స్పందించి ఇబ్రహీంపట్నం డీయం వెంకట నర్సప్పను ఆదేశించడంతో డీఎం.. అధికారులతో కలిసి ఇటీవల మాల్ పట్టణంలోని నిరుపయోగంగా ఉన్న  ఆర్టీసీ బస్టాండ్‌ను సందర్శించారు. 

బస్టాండ్‌ను పునరుద్ధరించాలి

నేను మాల్ తొలి సర్పంచ్‌గా ఉన్న సమయంలోనే బస్టాండ్ నిర్మాణం చేపట్టాం. కొంతకాలం వరకు  బస్టాండ్‌ను బాగానే వినియోగించినప్పటికీ తదనంతరం నిరుపయోగంగా మారింది. కాలక్రమేనా గోడుకొండ్లలో బస్టాండ్ ఏర్పాటు చేయడం వలన మాల్‌లోని పాత బస్టాండ్ నిరుపయోగంగా మారింది. అయితే మాల్‌కు కొనుగోళ్ల నిమిత్తం వచ్చే ప్రయాణికులు, స్థానికులకు గోడుకొండ్ల బస్టాండ్ చాలా దూరంగా ఉంది. స్థానికంగా ఉన్న బస్టాండ్‌ను పునరుద్ధరించడంతో పాటు బస్టాండ్‌లోకి బస్సులు వచ్చిపోయేలా అధికారులు చర్యలు తీసుకోవాలి 

లిక్కి జంగారెడ్డి, మాజీ సర్పంచ్, మాల్

దసరాలోపు అందుబాటులోకి తెస్తాం

మాల్‌లో పాత బస్టాండ్ నిరుపయోగంగా మారడంతో ప్రయాణి కులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక నాయకులు నా దృష్టికి తీసుకువచ్చారు. పాత బస్టాండ్‌ను దసరా లోపు వినియోగంలోకి తీసుకువస్తాం. ఈ మేరకు ఇబ్రహీంపట్నం ఆర్టీసీ డిపో డీయంకు ఆదేశాలిచ్చాం.

 మల్‌రెడ్డి రంగారెడ్డి, 

ఎమ్మెల్యే, ఇబ్రహీంపట్నం