- 4.26 ఎకరాల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- సుమారు 150 కోట్ల విలువైన భూమి స్వాధీనం
రాజేంద్రనగర్, జనవరి 9: దేవుడి భూమికి మోక్షం కలిగింది. అన్యాక్రాంతమైన 4.26 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేవుడి భూమిలో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. దేవాదాయశాఖ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ కృష్ణప్రసాద్, అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ కథనం ప్రకారం.. అత్తాపూర్‌లోని సర్వే నంబర్ 435, 446లో జనప్రియ సమీపంలో అనంత పద్మనాభస్వామి ఆలయానికి చెందిన 4.26 ఎకరాల భూమి ఉంది.
కొన్నేళ్ల క్రితం కొందరు అక్రమార్కులు ఈ భూమిని ఆక్రమించి పలు నిర్మాణాలు చేశారు. దీంతోపాటు నకిలీ పత్రాలు సృష్టించారు. కోర్టుకు వెళ్లి నాట్ ఇంటర్‌ఫియర్ ఆర్డర్లు తెచ్చుకున్నారు. సదరు భూమిని లీజుకు ఇవ్వడంతో క్రికెట్ గ్రౌండ్, కారు గ్యారేజీలు, ఇతర నిర్మాణాలు చేపట్టి అద్దెకు ఇచ్చి ప్రతినెలా లక్షలు జేబుల్లో నింపుకొంటున్నారు.
ఇరువర్గాల వాదనల అనంతరం కోర్టు సదరు భూమి దేవాదాయ శాఖకు చెందుతుందని తీర్పు వెలువరించింది. ఈనేపథ్యంలో ఎండోమెంట్ ఉన్నతాధికారులు గురువారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య దేవాలయ భూమిలో చేపట్టిన నిర్మాణాలను జేసీబీలతో కూల్చివేశారు. ఈక్రమంలో అధికారులతో కబ్జాదారులు తీవ్రవాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా దేవాదాయ శాఖ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతపద్మనాభుడి భూమిని తిరిగి స్వాధీనం చేసుకోవడంలో మీడియా కీలక పాత్ర పోషించిందని ఎండోమెంట్ అధికారులు అభినందించారు. స్వాధీనం చేసుకున్న భూమి విలువ సుమారు 150 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.