- ఎనిమిదేళ్ల తర్వాత పనులు
- సీసీ కెమెరాల ఏర్పాటుకు రంగం సిద్ధం
- రూ.1.47 కోట్ల నిధులు మంజూరు
చర్ల, జూలై ౩ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని మధ్యతరహా ప్రాజెక్టుగా పేరొందిన తాలిపేరు మరమ్మతులకు ఎనిమిదేళ్ల తర్వాత మోక్షం లభించనుంది. ప్రాజెక్టు షటర్లకు రంగులు వేయడం, సీసీ కెమెరాలు అమర్చడం, మైనర్ రిపేర్ల నిమిత్తం ప్రభుత్వం రూ. 1.47 కోట్ల నిధులు మంజూ రు చేసింది. దీంతో నీటిపారుదల శాఖ అధికారులు పనులకు శ్రీకారం చుట్టారు. కొన్నేండ్లుగా ప్రాజెక్టు ఎలాంటి మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో నీటిని విడుదల చేసే సమయంలో షటర్లు మోరా యిస్తున్నాయి. ఎనిమిది సంవత్సరాల క్రింత రబ్బర్ షిల్స్ వేసి అక్కడక్కడ చిన్నచిన్న మరమ్మతులు చేశారు. ఆ తర్వాత ఎలాంటి పనులు జరగలేదు.
పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లితే నిరుడు మరమ్మతులకు అంచనాలు సిద్ధం చేశారు. సుమారు రూ.1.47 కోట్లతో అంచనాలు సమర్పిస్తే ఇప్పుడు నిధులు మంజూరు కావడంతో పనులు చేపట్టారు. దీంతో ప్రాజెక్టుకు ఉన్న 23 గేట్లకు సాండ్ బ్లాసింగ్ చేస్తున్నారు. పనులు పూర్తి కావడానికి మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందని తెలుస్తోంది. దీనికి తోడు శాటిలైట్‌తో పనిచేసేలా ప్రాజెక్టు వద్ద సీసీ కెమెరాలను అమర్చారు.
1986లో రూ.60 కోట్లతో నిర్మాణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలాల మధ్య గల పెద్దవాగుపై రూ.60 కోట్లతో 1986లో తాలిపేరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. తర్వాత అంచనాలు పెరిగి రూ.90 కోట్లకుచేరింది. జపాన్ బ్యాంకు నిధులతో ఈ పనులు చేశారు. ఎడమకాలువ 40 కిలోమీటర్లు, కుడి కాలువ 15 కిలోమీటర్ల ద్వారా మొత్తం దాదాపు 24,700 ఎకరాలకు సాగునీరు అందించేలా దీని నిర్మాణం జరిగింది.
కాలం నెత్తిమీదికి వచ్చిన తర్వాత పనులు
ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైంది. మరోవైపు తాలిపేరు ప్రాజెక్టుకు వరదల కాలం. ఈ సమయంలో మరమ్మతు పను లు ఎలా సాగుతాయని నిపుణులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి వరద నీరు ప్రాజెక్టులోకి చేరే అవకాశం అధికంగా ఉంది.
పనులు త్వరితగతిన పూర్తి చేస్తాం
ఓఅండ్‌ఎం నిధులు రూ.1.47 కోట్లు మంజూరు చేశారు. వాటితో ప్రాజెక్టు మర మ్మతు పనులు,రంగులు వేయడం వంటి పనులు చేపట్టాం. త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకొంటున్నాం. ప్రాజెక్టుకు మైనర్ రిపేర్లు చేయడంతోపాటు సీసీ కెమెరాలు అమర్చుతాం.
ఈఈ రాంప్రసాద్