calender_icon.png 16 January, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిఫ్ట్ స్కూళ్లకు త్వరలో మోక్షం!

14-09-2024 12:08:15 AM

దశలవారీగా రెగ్యులర్‌గా మారుస్తున్న అధికారులు

కొన్నేళ్లుగా ఒకే ప్రాంగణంలో రెండు స్కూళ్ల నిర్వహణ

ఇప్పటికే పలు స్కూళ్లు రెగ్యులర్, అదే బాటలో మరిన్ని 

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 1౩(విజయక్రాంతి): పేరుకు మహా నగరమైనా విద్యార్థుల సంఖ్యకు అనుగుణం గా సదుపాయాలు లేకపోవడంతో ఇప్పటికీ పలు పాఠశాలలు షిఫ్ట్ పద్ధతిలోనే కొనసాగుతున్నాయి. అయి తే జిల్లా కలెక్టర్, డీఈవో ఆదేశాలతో ఈ షిఫ్ట్ స్కూళ్లకు దశల వారీగా మోక్షం లభించనుంది. షిఫ్ట్ పద్ధతిని ఎత్తేయాలని వివిధ పాఠశాలలకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ఇప్పటికే పలువురు షిఫ్ట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఈ నిర్ణయాన్ని అమలు చేశారు.  

సిలబస్ పూర్తికాక..

హైదరాబాద్ జిల్లాలో 45 స్కూల్ కాంప్లెక్సులు ఉండగా వీటిలో 89 పాఠశాలల్లో షిఫ్ట్ పద్ధతి కొనసాగుతుంది. కొన్నిచోట్ల రెండు పాఠశాలల్లో మూడు స్కూళ్ల ను నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఆ పాఠశాలల టైమింగ్స్ రెగ్యులర్ స్కూళ్ల కంటే భిన్నంగా ఉంటుంది. రెగ్యులర్ స్కూళ్లు ఉదయం 8.45 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుండగా.. షిఫ్ట్ పాఠశాలల్లో మాత్రం ఉదయం కొన్ని తరగతులు, మధ్యాహ్నం కొన్ని తరగతులకు క్లాసులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ స్కూళ్లలో 45 నిమిషాలకు ఒక సబ్జెక్టు పీరియడ్ ఉంటే.. షిఫ్ట్ పాఠశాలల్లో ఆ సమయం 30 నిమిషాలు మాత్రమే ఉంటోంది. కారణంగా సమయం సరిపోకపోవడం.. సిలబస్ పూర్తి కాకపోవడంతోవిద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు.

హాజరు, ఫలితాలపై ప్రభావం..

షిఫ్ట్ స్కూళ్ల కారణంగా విద్యార్థులు సమయానికి పాఠశాలకు రాలేకపోతున్నారు. ఇళ్లకు వెళ్లే సమయంలోనూ ఇబ్బందులు పడుతున్నారు. ఇది వారి చదువులపై ప్రభావం చూపుతోంది. అయితే షిఫ్ట్ స్కూళ్లను రెగ్యులర్‌గా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నందున ఈ పాఠశాలల్లో చదివే దాదాపు 20 వేల మంది విద్యార్థుల అవస్థలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికే జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటీవల 8 షిఫ్ట్ స్కూళ్లను రెగ్యులర్‌గా మార్చారు. 2024 విద్యా సంవత్సరంలో మెజార్టీ పాఠశాలలను మార్చాలని యోచిస్తున్నారు. 

తరగతుల కొరత తీరేదెలా.. 

విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడం, తరగతుల కొరత కారణంగా గతంలో షిఫ్ట్ స్కూళ్లను అమలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని కొన్ని షిఫ్ట్ స్కూళ్లలో మినహా మెజార్టీ షిఫ్ట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దాదాపు 300 లోపే ఉంది. బండ్లగూడ, ఖైరతాబాద్‌లోని పలు పాఠశాలల్లో మాత్రం వెయ్యి మందికిపైగా విద్యార్థు లున్నారు. ఇలాంటి చోట్ల విద్యార్థుల సంఖ్యకనుగుణంగా తరగతి గదులు సరిపడా లేకపోవడం గమనార్హం. ఒక పూట బడి ఉండడంతో పలువురు విద్యార్థులు దారితప్పి, చెడు అలవాట్ల బారిన పడిన సందర్భాలున్నట్లు తెలుస్తోంది. షిఫ్ట్ స్కూళ్లను రెగ్యూలర్‌గా మారిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తోంది.