29-04-2025 12:30:26 AM
కరీంనగర్, ఏప్రిల్ 28 (విజయ క్రాంతి): భూభారతి కొత్త ఆర్‌ఓఆర్ చట్టం ద్వారా పెండింగ్లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుందని, రైతుల భూ సమస్యలు పరిష్కారం కానున్నాయని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. సోమవారం వీణవంక మండలం చల్లూరులోని రైతువేదికలో నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన సదస్సుకు జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు.
భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా రాష్ర్ట ప్రభుత్వం భూ భారతి చట్టం 2025 రూపొందించిందని తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం సమస్యను సంబంధిత అధికారి ఎన్ని రోజులలో పరిష్కరించాలనే విషయమై స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపారు. అధికారి పరిష్కరించిన భూ సమస్యపై సంబంధిత అర్జీదారు సంతృప్తి చెందని పక్షంలో అప్పీలు వ్యవస్థను ఈ చట్టంలో పొందుపరిచారని తెలిపారు.
కోర్టుకు వెళ్లే అవసరం లేకుండా జిల్లా స్థాయిలోనే భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు రెవెన్యూ డివిజన్ అధికారికి, కలెక్టర్ కు అధికారాలు కల్పించారని తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డులు తయారు చేసి, ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ ప్లే చేయడం జరుగుతుందని అన్నారు. భూమికి భూదార్ సంఖ్య కేటాయింపునకు ప్రభుత్వం ప్రణాళిక చేస్తుందని, దీని ద్వారా భూ ఆక్రమణలు అరికట్టవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి రమేష్ బాబు, తహసిల్దార్ శ్రీనివాస్, వివిధ వర్గాల ప్రజలు, రైతులు పాల్గొన్నారు.