- టెన్నిస్‌కు రఫెల్ నాదల్ గుడ్ బై
- డేవిస్ కప్‌లో చివరి మ్యాచ్ ఆడిన దిగ్గజం
- ఓటమితో ఆటకు వీడ్కోలు
- 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో రికార్డు
* ఒక శకం ముగిసింది.. 23 ఏళ్ల పాటు తన ఆటతో ఉర్రూతలూగించిన వీరుడు ఇకపై టెన్నిస్ కోర్టులో కనబడడు. ఆ మాటలు ఇక వినబడవు. ఒక్కసారి రాకెట్ పట్టి కదన రంగంలోకి దూకితే ప్రత్యర్థి వెన్నులో వణుకు పుట్టాల్సిందే. తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆ వీరుడు టెన్నిస్‌కు శాశ్వత వీడ్కోలు పలికాడు. అతడే స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్.
* డేవిస్ కప్‌లో తన చివరి మ్యాచ్ ఆడిన నాదల్ ఓటమి పాలయ్యాడు. 10 వేల మంది ప్రేక్షకుల సమక్షంలో బాధాతప్త హృదయంతో నాదల్ ఆటకు గుడ్ బై ప్రకటించాడు. మట్టి కోట రారాజుగా పేరు పొందిన టెన్నిస్ దిగ్గజం 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో ఓపెన్ శకంలో అత్యధిక టైటిల్స్ సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
209 వారాల పాటు నాదల్ వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగి చరిత్ర సృష్టించాడు
2 - అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన వారిలో నాదల్ (22) రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానం జొకోవిచ్ (24 టైటిల్స్).
* ‘ఇవాళ నా జీవితంలో అత్యంత భావోద్వేగమైన రోజు. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో ఆఖరి మ్యాచ్ ఆడేశాను. చివరిసారిగా జాతీయ గీతాలాపన చేయడం ప్రత్యేకంగా అనిపిస్తోంది. కెరీర్‌లో ఎన్నో టైటిళ్లు సాధించా. చిన్నగ్రామం నుంచి వచ్చి ఇవాళ అంతర్జాతీయ టెన్నిస్ స్టార్‌గా పేరు పొందడం గొప్ప విషయం. ఎల్లవేళలా అండగా నిలిచిన మా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు’
రఫెల్ నాదల్
మలాగా (స్పెయిన్): స్పెయిన్ దిగ్గజం రఫెల్ నాదల్ ప్రొఫెషనల్ టెన్నిస్‌కు అధికారికంగా వీడ్కోలు పలికాడు. గత నెలలోనే ఆటకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపిన నాదల్ సొంతగడ్డపై జరిగే డేవిస్ కప్‌లో చివరి మ్యాచ్ ఆడుతానని ఇది వరకే ప్రకటించాడు. తాజాగా డేవిస్ కప్‌లో పురుషుల సింగిల్స్‌లో బరిలోకి దిగిన నాదల్ ఓటమి పాలయ్యాడు.
మంగళవారం అర్థరాత్రి జరిగిన మ్యాచ్‌లో నాదల్ 4-6, 4-6తో అన్‌సీడెడ్ ఆటగాడు బొటిక్ వాన్ డి (నెదర్లాండ్స్) చేతిలో పరాజయం చవిచూశాడు. కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న నాదల్ సొంతగడ్డపై విజయంతో ఘనంగా వీడ్కోలు పలకాలనుకున్నాడు. కానీ ఓటమితో చేసేదేం లేక బాధాతప్త హృదయంతో టెన్నిస్ కోర్టును వీడాడు.
తమ అభిమాన ఆటగాడిని కోర్టులో ఆఖరిసారి చూసేందుకు ప్రేక్షకులు పోటెత్తారు. నాదల్ మ్యాచ్ ఆడుతున్నంత సేపు ‘రఫా.. రఫా’ అనే నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ సమయంలో భావోద్వేగానికి లోనైన నాదల్ తనను చూడడానికి వచ్చిన 10వేల మంది ప్రేక్షకులను చూసి కంటతడి పెట్టాడు.
తమ మిత్రుడి చివరి మ్యాచ్ చూసేందుకు రోజర్ ఫెదరర్, నొవాక్ జొకోవిచ్ సహా సెరెనా విలియమ్స్, కొంచితా మార్టినేజ్, ఆండీ ముర్రే, ఫుట్‌బాల్ స్టార్స్ డేవిడ్ బెక్‌హమ్, సెర్జియో గార్సియా హాజరయ్యారు. దిగ్గజాల సమక్షంలో రఫెల్ నాదల్ ఆటకు గుడ్ బై చెప్పాడు.
మట్టికోట రారాజు..
నాదల్ తన కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్స్ టైటిల్స్ నెగ్గితే అందులో 14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ నెగ్గడం విశేషం. క్లే కోర్టు (ఎర్రమట్టి)పై 63 టైటిల్స్ సాధించిన నాదల్ ఒక దశలో 81 మ్యాచ్‌ల్లో వరుస విజయాలతో ఎవరికి అందనంత ఎత్తులో నిలిచాడు. ఎర్రమట్టిపై నాదల్ ఆధిపత్యం ఎంతలా సాగిందనడానికి ఈ రికార్డు ఒక నిదర్శనం.
ఇక బిగ్ త్రీగా పిలవబడే నాదల్, ఫెదరర్, జొకోవిచ్‌ల మధ్య పోటీ రసవత్తరంగా ఉండేది. జొకోవిచ్‌తో 60 సార్లు తలపడిన నాదల్ 29 విజయాలు.. 31 ఓటములు చవిచూశాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో మాత్రం నాదల్ 6-3తో జొకోపై పై చేయి సాధించాడు. ఇక చిరకాల ప్రత్యర్థి రోజర్ ఫెదరర్‌తో 40 సార్లు తలపడిన నాదల్ 24 సార్లు గెలిచి 16 సార్లు ఓడాడు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లోనూ 6-3తో నాదల్‌దే పైచేయిగా ఉంది.
2001లో మొదలు..
రఫెల్ నాదల్.. 1986 జూన్ 3న స్పెయిన్‌లోని మనాకొర్‌లో జన్మించాడు. అయితే నాదల్ తండ్రి బిజినెస్‌మేన్ కావడంతో అతడికి పెద్దగా ఆర్థిక కష్టాలు ఎదురుకాలేదు. ఫుట్‌బాల్ ఆటగాడిగా మారాలనుకున్న నాదల్ తన అంకుల్ టోనీ నాదల్ ప్రోద్బలంతో టెన్నిస్‌ను కెరీర్‌గా మలుచుకున్నాడు.
8 ఏళ్ల వయసులోనే అండర్-12 రీజనల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ సాధించిన నాదల్ 14 ఏళ్ల వయసులో (2001లో) ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడలో అడుగుపెట్టాడు. టెన్నిస్ ఓపెన్ శకంలో 23 ఏళ్ల పాటు ఎదురులేకుండా సాగిన నాదల్ కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో కెరీర్ గ్రాండ్‌స్లామ్ అందుకున్న నాదల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడం ద్వారా కెరీర్ గోల్డెన్ గ్రాండ్‌స్లామ్‌ను కూడా పూర్తి చేసుకున్నాడు.
ఇక నాదల్ కెరీర్‌లో 92 ఏటీపీ సింగిల్స్ టైటిల్స్‌తో పాటు 36 మాస్టర్స్ టైటిల్స్ ఉన్నాయి. 2008లో తొలిసారి నంబర్‌వన్ ర్యాంక్ అందుకున్న నాదల్ 2013 ఏడాదిలో 14 టోర్నీల్లో ఫైనల్స్ చేరి అందులో రెండు గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో పాటు ఐదు మాస్టర్స్ టైటిల్స్ నెగ్గి సమ్మర్ స్లామ్ పూర్తి చేశాడు.
ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన రెండో ఆటగాడిగా నాదల్ (22) రెండో స్థానంలో ఉండగా.. అతని కంటే ముందు నొవాక్ జొకోవిచ్ (24 టైటిళ్లు) తొలి స్థానంలో ఉన్నాడు. రోజర్ ఫెదరర్ (20 టైటిల్స్) మూడో స్థానంలో ఉన్నాడు.