- మన్మోహన్ అరుదైన రాజకీయ నాయకుడు: రాష్ట్రపతి ముర్ము
- ఆయన మరణం బాధ కలిగించింది: ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్
- మన్మోహన్ సేవలు మరువలేనివి: ప్రధాని మోదీ
- వ్యక్తిగతంగా ఎంతో లోటు: కాంగ్రెస్ నాయకురాలు సోనియా
- దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు: కాంగ్రెస్ నాయకుడు రాహుల్
- తరతరాలు గుర్తుంచుకుంటాయి: కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే
న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్, దేశానికి ప్రధానిగా రెండు సార్లు సేవలందించిన మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు శనివారం ఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. కాం గ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం నుంచి ఉదయం ౯.౩౦ గంటలకు ఆయన అంతిమయాత్ర ప్రారంభమవుతుంది.
అంతకు ముందు ౮ గంటలకు మన్మోహన్‌సింగ్ పార్థివ దేహాన్ని ఆయన స్వగృహం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయానికి తీసుకువస్తారు. ౧౧.౪౫ గంటలకు ఆయన అంత్యక్రియలు నిగమ్‌బోధ్ ఘాట్‌లో జరుగుతాయి. మన్మోహన్ కుమార్తెల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఆమె వచ్చిన తర్వాతే అంత్యక్రియలు జరగనున్నాయి.
ఆయన పార్థివదేహానికి శుక్రవా రం ప్రముఖులు ఘన నివాళి అర్పించారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, ప్రతి పక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో సహా పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రా ల ముఖ్యమంత్రులు నివాళి అర్పించారు.
మన్మోహన్ మృతి పట్ల కేంద్ర క్యాబినెట్ సంతాపం ప్రకటించింది. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరపాలని నిర్ణయించింది. మాజీ ప్రధాని మన్మోహన్ మృతి పట్ల ఆ పార్టీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
వారం రోజులపాటు పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను వాయిదా వేస్తున్నట్లు, అలాగే అప్పటిదాకా పార్టీ జెండాను కూడా అవనతం చేయనున్నట్లు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబుమన్మోహన్ పార్థివదేహానికి నివాళులర్పించారు.
ప్రత్యేకంగా కావాలి
మన్మోహన్‌సింగ్‌కు నివాళులర్పించేందుకు శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ) సమావేశం జరిగింది. మన్మోహన్‌కు ప్రత్యేకమైన స్మారక స్థలం కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోదీకి ఉత్తరం రాశారు.
* చరిత్ర నా పట్ల దయతో వ్యవహరించింది.
2014లో మన్మోహన్‌సింగ్ చేసిన వ్యాఖ్య
* ఔను.. చరిత్ర మీ పట్ల దయతో తీర్పునిస్తుంది.. ఇది సత్యం.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
* ఆయన అన్న మాటలు నిజం.. చరిత్ర ఆయన పట్ల మరింత దయతో ఉంటుంది. చరిత్ర ఆయనను గౌరవిస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ప్రతి పదవిపై మన్మోహన్‌సింగ్ చెరగని ముద్ర
రాజకీయవేత్త, ఆర్థికవేత్త, విద్యావేత్త, బ్యూరోక్రాట్ డాక్టర్ మన్మోహన్‌సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నా. దేశ రాజకీయ యవనికపై అత్యంత గౌరవనీయమైన జాతీయ నాయకుల్లో ఆయన ఒకరు. తన కెరీర్‌లో ప్రతి పదవిపై చెరగని ముద్ర వేశారు. ఆయన ప్రపంచ ప్రఖ్యాత ఆర్థికవేత్త. దేశంలో సంస్కరణలకు మార్గదర్శకుడు. తన దూరదృష్టితో దేశాన్ని ప్రగతి పథంలో నడిపించారు. ప్రపంచ వేదికపై భారతదేశ స్థాయిని పెంచారు.
జిష్ణుదేవ్ వర్మ, గవర్నర్
దేశం ఎప్పటికీ మరువదు
పీవీ నర్సింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆర్థిక మంత్రిగా సంస్కరణలు తీసుకురావడంలో మన్మోహన్‌సింగ్ పోషించిన పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన మరణం దేశానికి తీరని లోటు. నిరాడంబర జీవితం, దేశంపై వారి అంకితభావం భావితరాలకు స్ఫూర్తిదాయకం. ఆ మహనీయుని ఆత్మకు శాంతి, సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
ఆర్‌బీఐ గవర్నర్‌గా, ప్రణాళికా సంఘంలో కీలక బాధ్యతల్లో, యూజీసీ చైర్మన్‌గా, కేంద్ర ఆర్థికశాఖ మంత్రిగా మన్మోహన్ దేశానికి వన్నె తీసుకొచ్చారు. 2019లో అప్పుడప్పుడూ పార్లమెంటుకు వీల్‌చైర్లో రావడం పార్లమెంట్ సభ్యుడిగా ఆయన అంకితభావానికి నిదర్శనమన్నారు. మేధావి, మితభాషి, సౌమ్యుడు, స్థిత ప్రజ్ఞ కలిగిన నేతగా.. మన్మోహన్ సింగ్ యువతరానికి ఆదర్శం.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
ఆయన సేవలు మరువలేనివి
మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ మరణం నన్ను కలచివేసింది. దేశానికి ఆయన అందించిన సేవలు మరువలేనివి. మన్మోహన్ సింగ్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆర్థిక మంత్రిగా దేశం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి.
కేంద్ర మంత్రి బండి సంజయ్
నవ భారత నిర్మాత
మన్మోహన్ సింగ్.. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించిన నవ భారత నిర్మాత. గొప్ప ఆర్థికవేత్తను దేశం కోల్పోయింది. ఆయన వివాదరహితుడు, సంస్కరణవాది. అన్నిటికీ మించి గొప్ప మానవతావాది.
సీఎం భట్టి విక్రమార్క మల్లు
దార్శనికుడు మన్మోహన్‌సింగ్
ఆధునిక భారతదేశాన్ని తన విజ్ఞత, అచంచలమైన నిబద్ధతతో తీర్చిదిద్దిన దార్శనికుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆయన మరణ వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. ఆయన నుంచి ప్రేరణ పొందిన ప్రతిఒక్కరినీ ఆయన మృతి శ్యూన్యాన్ని మిగిల్చింది. నిజమైన నాయకత్వం అంటే ప్రజలను శక్తివంతం చేయడమే అని ఆయన నిరూపించారు. మన్మోహన్ వారసత్వాన్ని గౌరవిద్దాం. -రాబోయే తరాల కోసం బలమైన భారతదేశాన్ని నిర్మిద్దాం.
మంత్రి శ్రీధర్ బాబు
గొప్ప రాజనీతిజ్ఞుడు
మన్మోహన్‌సింగ్ గొప్ప రాజనీతిజ్ఞుడు. భారత ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు.
మంత్రి పొన్నం ప్రభాకర్
సరళీకృత ఆర్థిక విధానాల రూపశిల్పి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు. ఆయన సరళీకృత ఆర్థిక విధానాల రూపశిల్పి. ఆయన నయా ఉదారవాద ఆర్థిక విధానాలను తీసుకొచ్చి భారత ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేశారు. ఆయన జీవితం నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దం.
మంత్రి కొండా సురేఖ
సంస్కరణల రూపకర్త
మన్మోహన్ సింగ్ ఆర్థిక సంస్కరణల రూపకర్త. ఆయన ప్రధానిగా, ఆర్థిక మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా గవర్నర్‌గా క్రియాశీల పాత్ర పోషించారు. మన్మోహన్ మృతి బాధ కలిగించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.
మంత్రి సీతక్క
మహోన్నత వ్యక్తిని కోల్పోయాం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు. దేశం మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది. కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా.
మంత్రి జూపల్లి కృష్ణారావు
దూరదృష్టి గల ఆర్థికవేత్త
దివంగత మన్మోహన్ సింగ్ దూరదృష్టి గల ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు. ఆయన మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఆయన భారత ఆర్థిక సరళీకరణ రూపశిల్పిగా ప్రపంచ పెట్టుబడులు వచ్చేందుకు భారతదేశ ద్వారాలను తెరిచారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నిజమైన సమతావాది
మన్మోహన్‌సింగ్ నిజాయితీ స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన నిజమైన సమతావాది. కఠినమైన రాజకీయ ప్రపంచంలో ఆయన సున్నితమైన, గౌరవప్రదమైన వ్యక్తి.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనుడు
దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయింది. పీవీ మార్గదర్శకంలో నూతన ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టి దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించిన ఘనత మన్మోహన్ సింగ్‌కే దక్కుతుంది.
మంత్రి దామోదర రాజనర్సింహ
ఆయన సేవలు ఎనలేనివి
ఆర్థికవేత్తగా, అధ్యాపకుడిగా, ఆర్‌బీఐ గవర్నర్‌గా, రాజ్యసభ సభ్యుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా, ప్రధానమంత్రిగా మన్మోహన్‌సింగ్ దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఆర్థికమంత్రిగా సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఆయన మరణం పట్ల ప్రగాణ సానుభూతిని తెలియజేస్తున్నా.
ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
నిజాయితీకి నిలువుటద్దం
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు తన మేధస్సును ధారపోసి దేశ ఆర్థిక అభ్యున్నతికి దారులు వేసిన దార్శనికుడు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటిస్తున్నా. ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో తన చర్యల ద్వారా చాటి చెప్పిన మహనీయుడు. దేశ రాజకీయాల్లో అజాత శత్రువుగా చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి. ఆయన మరణం దేశానికే తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు..
దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచస్థాయిలో నిలిపిన నేత మన్మోహన్‌సింగ్. ఆయన మరణం దేశానికి, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. సోనియాగాంధీకి రెండుసార్లు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా, ఆర్థిక వేత్త మన్మోహన్‌సింగ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. ఓబీసీ కన్వీనర్‌గా ఉన్న సమయంలో ఆయనతో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. ఓబీసీలకు ఐఐటీ, ఐఐఎంలలో రిజర్వేషన్ ఇవ్వాలని కోరగా వెంటనే బిల్లు ప్రవేశపెట్టారు. మన్మోహన్‌సింగ్ లేకపోవడం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి అండగా నిలవాలని దేవుడిని ప్రార్థిస్తున్నా.
మాజీ ఎంపీ వీ హనుమంతరావు