calender_icon.png 23 October, 2024 | 11:07 AM

వీరులారా మీకు వందనం

17-09-2024 05:12:15 AM

  1. మరువం మీ అసమాన త్యాగం 
  2. విమోచనంలో కరీంనగర్ కీలకం

కరీంనగర్, సెప్టెంబరు 16 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యోధుల పాత్ర గణనీయమయింది. నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం నిజాం రాజుకు వ్యతిరేక జరిగిన  సాయుధ పోరాటానికి కరీంనగర్ కేంద్రంగా నిలిచింది. ఈ పోరాటంలో ఎందరో అమరులు అయ్యారు. నిజాం సంస్థానంలో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన అనభేరి ప్రభాకర్‌రావు లాంటి ఎందరో పోరాట యోధులకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్నతల్లిగా నిలిచింది.

1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చి స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటే నిజాం పాలనలోని తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛ కరువయింది. నిజాం ఆకృత్యాలతో సహనం కోల్పోయిన ఇక్కడి ప్రజలు సాయుధ పోరు ప్రారంభించారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టుల పిలుపుతో ప్రజలు ప్రాణాలను లెక్క చేయకుండా నిజాం సర్కారును ఎదురించారు. భారత యూనియన్ ఎట్టకేలకు నిజాం మెడలు వంచడంతో 1948 సెప్టెంబర్ 17న ఈ ప్రాంతానికి విముక్తి లభించింది.  

ఉద్యమానికి ఊపిరి పోసిన ఆంధ్ర మహాసభ..

1935 సెప్టెంబర్‌లో సిరిసిల్లలో జరిగిన ఆంధ్రమహాసభ ఉద్యమానికి ఊపిరిపోసింది. మహాసభ తీర్మానాల అనంతరం సంస్థానంలోని భూస్వాములు, పెత్తందార్ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాటాలు ఉధృతమయ్యాయి. 1944లో భువనగిరిలో జరిగిన సభలో రావి నారాయణ రెడ్డి తోపాటు కరీంనగర్ కమ్యూనిస్టు యోధుడు బద్ధం ఎల్లారెడ్డి వంటి ముఖ్యనాయకులు తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారు. వీరి పిలుపుతో జిల్లాలో నిజాం వ్యతిరేక పోరాటాలు, రైతాంగ పోరాటాలు ఊపందుకున్నాయి.

గ్రామీణులను చైతన్యం చేయడంతోపాటు నిజాం రికార్డులను ధ్వంసం చేస్తూ హుస్నాబాద్ ప్రాంతంలో అనభేరి ప్రభాకర్ రావు ఉద్యమాన్ని ముందుకు నడిపించారు. అనభేరిపై నిర్భందం పెరగడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. 1948 మార్చి 14న  మహ్మదాపూర్‌ొ మందాపురంలో అనభేరి దళం విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పోలీసులు కాల్పులు జరపడంతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు వీరమరణం పొందారు.  

పోరాటాలు నేర్పిన గడ్డ గాలిపెల్లి..

ఇల్లంతకుంట మండలం గాలిపెల్లి గ్రామం తెలంగాణకు ఉగ్గుపాలు పట్టి పోరాటాలు నేర్పిన గడ్డ. నిజాం పోలీసులతో భీకర పోరు సల్పిన ప్రజారక్షణ దళం సభ్యులు బద్ధం బాల్‌రెడ్డి, బద్దం ఎల్లారెడ్డితోపాటు మల్లారెడ్డి, సింగిరెడ్డి అంజిరెడ్డిలకు జన్మనిచ్చిన గ్రామం గాలిపల్లి. 1947 సెప్టెంబర్ నెల గాలిపల్లి చరిత్రలో మరపురాని ఘట్టం. పోలీసులను ఎదురించిన ప్రజలు వారిని ఊరి పొలిమేర వరకు తరిమికొట్టారు. మరుసటి రోజు 300 మంది  నిజాం పోలీసులు గ్రామంపై మూకుమ్మడి దాడి చేయడంతో   18 మంది వీరమరణం పొందారు. ఒకపక్క సాయుధ పోరాటం జరుగుతుండగా మరోవైపు అహింసావాదులు శాంతియుత ఆందోళనలు జిల్లాలో కొనసాగించారు.

రజాకార్ల దురాగతాలు, ప్రభుత్వ దమనకాండకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్ సత్యాగ్రహాలు నిర్వహించాలని పిలుపునివ్వడంతో 1947 ఆగస్టు 9న కరీంనగర్ మండలం ఇరుకుల్ల గ్రామంలో మొదటి సత్యాగ్రహం జరిగింది. సత్యాగ్రహం చేస్తున్న జువ్వాడి సోదరులను పోలీసులు అరెస్టు చేశారు. 1947 సెప్టెంబర్ 2న బెజ్జంకిలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేశారు. 1948లో మంథనికి చెందిన రఘునాథ్ కాచే ఆధ్వర్యంలో జె హన్మంతరావు, రామేశ్వర్‌రావు, మురళీధర్‌లు కరీంనగర్‌లో సత్యాగ్రహం చేసి అరెస్టయ్యారు.

బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామానికి చెందిన బోయినపల్లి వెంకటరామారావు చేపట్టిన శాసనోల్లంఘనలో భాగంగా కార్యకర్తలు జెండాలు ఎగురవేశారు. ఇక్కడ ప్రారంభమైన శాసనోల్లంఘన ఉద్యమం హుస్నాబాద్, హుజూరాబాద్, జగిత్యాల ప్రాంతాలకు విస్తరించింది. చాలా మంది  యోధులను అరెస్టు చేసి చందా జైలుకు పంపించారు. వెంకట రామారావు ఇంటిని రజకారుల సైన్యం  పూర్తిగా కూల్చివేసింది. 

మరో జలియన్ వాలాబాగ్ భైరాన్‌పల్లి 

 సిద్దిపేట/హుస్నాబాద్, సెప్టెంబరు16(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్, మద్దూరు, దూల్‌మిట్ట,  బైరాన్‌పల్లి, కూటిగల్ ప్రాంతాలు తెలంగాణ సాయుధ పోరాటంలో  కీలక పాత్ర పోషించాయి.  మరో జలియన్ వాలాబాగ్ ఘటనగా పేరొందిన వీర భైరాన్‌పల్లిలో దాదాపు 120 మందిన రజాకార్ల సైన్యం దాడి చేసి పిట్టలను కాల్చినట్లు కాల్చి దారుణంగా చంపేశారు. మహిళల బట్టలు విప్పించి బతుకమ్మ ఆడించారు. అలాగే కూటిగల్ గ్రామంలోకూడా కొందరిని రజాకార్లు హత్య చేశారు.

అలాగే  సాయుధ పోరాటంలో  మాజీ ఎమ్మెల్యే దేశిని చిన్నమల్లయ్యది ప్రత్యేక పాత్ర. అణభేరి ప్రభాకర్ రావు దళంతో సాన్నిహితంగా ఉంటూ ప్రజలకు, ప్రభాకర్ రావు దళానికి మధ్యవర్తిగా పని చేశారు.  ఇలా ఎంతో మంది తెలంగాణ సాయుధ పోరాటంలో అసమాన త్యాగాలు చేయడంతో 1947 సెప్టెంబర్ 17న చివరకు నాటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముందు నిజాం ప్రభువు లొంగిపోయాడు. దీంతో తెలంగాణకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు వచ్చి రాష్ట్రంగా ఏర్పడింది.